బెల్ట్ షాపులపై దృష్టి సారించండి
కడప అర్బన్, న్యూస్‌లైన్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న మద్యం షాపులతోపాటు అనుబంధంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై దృష్టి సారించాలని ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్ విజయకుమారి ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 291కేసులు నమోదు చేశామన్నారు.
173 మందిని అరెస్టు చేశామన్నారు. 15 వాహనాలను సీజ్ చేశామన్నారు. బద్వేలులో మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం శ్యాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపించామన్నారు. రెండు స్టేషన్ల పరిధిలో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి పెట్టామన్నారు. 24మందిని బైండోవర్ చేశామన్నారు. ఒకే మద్యం షాపు ఏడుసార్లు, అంతకంటే ఎక్కువసార్లు నేరాలకు పాల్పడితే వాటి లెసైన్సులను రద్దు చేస్తామన్నారు. సారా కేంద్రాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామన్నారు. 99 బెల్ట్‌షాపులపై దాడులు నిర్వహించి 110 మందిని అరెస్టు చేశామన్నారు. 1171.92 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. 68 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు.
జిల్లాలో ఎక్సైజ్ దాడులు
జిల్లాలో సోమవారం 16కేసులు నమోదు చేశామని, ఎనిమిది మందిని అరెస్టు చేసి మూడు వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. నాటుసారాకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు. 110 లీటర్ల నాటుసారాను సీజ్ చేశామన్నారు. 3650 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. రెండు వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ బాబు శ్రీధర్, సీఐలు పప్పూరి రామ్మోహన్, తిరుపతయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.