Charminar Police Station
-
‘సాక్షి’ ఫొటో జర్నలిస్టుపై దాడి
సాక్షి, చార్మినార్ (హైదరాబాద్): సాక్షి దినపత్రిక ఫొటో జర్నలిస్టు గాలి అమర్‌పై బుధవారం సిటీ కాలేజీ చౌరస్తా వద్ద ఐదుగురు దుండగులు దాడి చేసి గాయపరిచారు. విధి నిర్వహణలో ఉన్న అమర్‌పై స్థానికులు అకారణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. పేట్లబురుజు సిటీ కాలేజీ చౌరస్తా వద్ద సిగ్నల్స్ పనితీరు, వాహనాల రాకపోకలపై ఫొటోలు చిత్రీకరిస్తుండగా స్థానికంగా నివాసముంటున్న కొందరు అమర్‌ను అడ్డుకుని చితకబాదారు. కెమెరాతో పాటు సెల్‌ఫోన్ లాక్కున్నారు. అక్కడి వాహనదారులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆగలేదు. చదవండి: మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు చార్మినార్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుల దాడి నుంచి ఫొటో జర్నలిస్టును కాపాడాడు. లాక్కున్న కెమెరాతో పాటు సెల్‌ఫోన్‌ను దుండగుల నుంచి తిరిగి ఇప్పించాడు. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చార్మినార్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్ తెలిపారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: ‘సాక్షి’ బాల ఎడిటర్లు 301 మంది నిందితులపై చర్యలు తీసుకోవాలి.. ‘సాక్షి’ఫోటో జర్నలిస్టు గాలి అమర్‌పై అకారణంగా దాడికి పాల్పడిన దుండగులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిరిగిరి విజయ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, జనరల్ సెక్రటరీ కేఎన్ హరి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగు వెంకటేశ్ గౌడ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్ దాడిని ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘కానిస్టేబుల్ అని పిల్లనివ్వడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : కానిస్టేబుల్ ఉద్యోగంతో జీవితం మారట్లేదనే ఆవేదనతో ఓ కానిస్టేబుల్ చేసిన రాజీనామాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఆమోదించారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పూర్వాపరాలు పరిశీలించిన కమిషనర్.. రాజీనామా ఆమోదిస్తూ ఉత్తర్వులు (డీవో నెం.9583/2019) జారీ చేశారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రతాప్ 2014లో కానిస్టేబుల్‌గా చేరాడు. (చదవండి : కనీసం.. పిల్లనివ్వడం లేదు) కొన్నాళ్లుగా తన సీనియర్లను పరిశీలించగా.. పలువురు 35 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా కానిస్టేబుల్‌గానే పదవీ విరమణ చేస్తున్న విషయాన్ని గుర్తించాడు. ఇంత సర్వీసు ఉన్న వారికి ఇతర విభాగాల్లో స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ లభిస్తోందని, సబ్ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులకు పదోన్నతులతో పాటు వాహనం, పెట్రోల్ వంటి ఇతర సౌకర్యాలు ఉన్నా.. కానిస్టేబుళ్లకు అలాంటివేవీ లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్ అని తెలియడంతో పెళ్లి సంబంధాలు కుదరట్లేదని వాపోయారు. తన రాజీనామాపై పునరాలోచన చేస్తానంటూ ఓ దశలో ప్రతాప్ పేర్కొన్నా.. చివరకు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
కనీసం.. పిల్లనివ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్ : జీతాలు పెరిగినా తమ జీవితాలు మారలేదని అంటున్నారు కానిస్టేబుళ్లు. అనేక మంది ఈ స్థాయి నుంచి ఒక్క ప్రమోషనూ లేకుండా పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనరేట్‌లో పని చేసే ఓ కానిస్టేబుల్ అనివార్య కారణాల వల్ల తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ ఆంగ్లంలో లేఖ రాశారు. చార్మినార్ ఠాణాలో పని చేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ ఈ నెల7న బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ఇన్వార్డ్ సెక్షన్లో రాజీనామా లేఖను అందించారు. నగర పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి రాసిన లేఖ ఇలా... ‘నా పేరు సిద్ధాంతి ప్రతాప్ (పీసీ నెం.5662) చార్మినార్ పోలీసుస్టేషన్లో పని చేస్తున్నా. కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 2014లో కానిస్టేబుల్‌గా చేరా. పోలీసు డిపార్ట్మెంట్ మీద ఉన్న అమితాసక్తితో అడుగుపెట్టిన నేను నా విధుల్ని త్రికరణ శుద్ధితో నిర్వహిస్తున్నా. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నా. కొన్నాళ్లుగా నా సీనియర్లను పరిశీలించిన నేపథ్యంలో అనేక మంది 35 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నా కానిస్టేబుల్‌గానే పదవీ విరమణ చేస్తున్న విషయాన్ని గుర్తించా. ఇలాంటి సర్వీసు ఉన్న వారికి ఇతర విభాగాల్లో స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ లభిస్తోంది. సబ్–ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులకు పదోన్నతులతో పాటు వాహనం, పెట్రోల్ అలవెన్సులు వంటి ఇతర సౌకర్యాలు ఉన్నా.. కానిస్టేబుళ్లకు అలాంటివి మచ్చుకైనా లేవు. ప్రస్తుతం నా వయస్సు 29 ఏళ్లు కావడంతో వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా. నేను కానిస్టేబుల్ అని తెలియడంతో ఓ సంబంధం చెడిపోయింది. ఆ తర్వాత నా బంధువుల ద్వారా ఆ యువతి నన్ను తిరస్కరించడానికి కారణాలు ఏమిటని అడిగా. కానిస్టేబుళ్లు 24 గంటలూ పని చేయాల్సి వస్తుందని, సరైన బాధ్యతలకు ఆస్కారం ఉండదని, అదే హోదాలో పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని, ఆ ఉద్యోగంలో ఎదుగుబొదుగూ ఉండదని యువతి భావించినట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నేను తీవ్రంగా మనస్తాపం చెందడంతో పాటు నా ఉద్యోగం పట్ల డిప్రెస్ అయ్యా. ఈ నేపథ్యంలోనే నా రాజీనామా ఆమోదించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.’అని రాశారు. ఇబ్బందులు నిజమే... పోలీసు విభాగంలో కలకలం సృష్టించిన ఈ విషయంపై పోలీసు అధికారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సిబ్బంది సంఖ్యతో ఉన్న ఇబ్బంది వల్ల వీక్లీ ఆఫ్‌ల విధానం అమలుకావట్లేదని చెప్తున్నారు. మరోపక్క ఎస్సై, డీఎస్పీ ఆపై పోస్టులు రిక్రూట్మెంట్ ప్రతి బ్యాచ్‌లోనూ గరిష్టంగా 500లోపే జరుగుతుంది. అందుకే వీరి సర్వీసులో పదోన్నతులు తేలిగ్గా లభిస్తాయి. కానిస్టేబుళ్ల ఎంపిక ఒక్కో బ్యాచ్‌కు వేల సంఖ్యలో ఉంటుంది. ఆ స్థాయిలో పై పోస్టులు ఉండవు. అందుకే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తయారు చేసిన మెరిట్ జాబితా ఆధారంగా పదోన్నతులు వచ్చినా అనేక మంది కానిస్టేబుల్‌గానే రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ వారిని ఇబ్బంది పెడుతున్నాయి అని ఓ అధికారి అన్నారు.ప్రస్తుతం పోలీసు విభాగంలో వారికి లభిస్తున్న జీతం ఆధారంగా చూస్తే గరిష్టంగా రూ.1 లక్ష వరకు నెలసరి తీసుకునే కానిస్టేబుళ్లు ఉన్నారని, పదోన్నతులు రాకపోయినా ఇంక్రిమెంట్లు మాత్రం ఆగవన్నారు. ప్రతాప్ రాజీనామాను ఆమోదించే ఆలోచన లేదని, అతనికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. -
అబార్షన్ కోసం వచ్చిన గర్భిణి మృతి
శాలిబండ: అబార్షన్ కోసం వచ్చిన ఓ గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రాత్రి జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని మృతురాలి బంధువులు గురువారం అసెంబ్లీ ఎదుట ఆందోళనకు యత్నించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొండాపూర్‌కు చెందిన చెన్నయ్య భార్య యాదమ్మ(36) ఇటీవల గర్భం దాల్చింది. ఇప్పటికే ఆమెకు 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ వయసులో పిల్లల్ని కనడం కష్టమని భావించింది. అబార్షన్ చేయించుకునేందుకు గత నెల 22నపేట్లబురుజు ఆస్ప్రత్రికి వచ్చింది. ఎంటీపీ సమస్య ఉన్న కారణంగా ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని ఆమెకు అబార్షన్ చేయాల్సిందేనని వైద్యులు కూడా సూచించారు. తర్వాత చేయించుకుంటానని వెళ్లిన ఆమె బుధవారం ఆస్పత్రికి వచ్చింది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఆపరేషన్ గదికి తీసుకువెళ్తుండగా యాదమ్మ మృతి చెందింది. కాగా ఆమె మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వస్తే తెలుస్తాయని ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ శ్రీదేవి తెలిపారు. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహంతో యాదమ్మ కుటుంబ సభ్యులు గురువారం అసెంబ్లీ ఎదుట ధర్నా చేసేందుకు యత్నించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.