
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : కానిస్టేబుల్ ఉద్యోగంతో జీవితం మారట్లేదనే ఆవేదనతో ఓ కానిస్టేబుల్ చేసిన రాజీనామాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఆమోదించారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పూర్వాపరాలు పరిశీలించిన కమిషనర్.. రాజీనామా ఆమోదిస్తూ ఉత్తర్వులు (డీవో నెం.9583/2019) జారీ చేశారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రతాప్ 2014లో కానిస్టేబుల్‌గా చేరాడు.
(చదవండి : కనీసం.. పిల్లనివ్వడం లేదు)
కొన్నాళ్లుగా తన సీనియర్లను పరిశీలించగా.. పలువురు 35 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా కానిస్టేబుల్‌గానే పదవీ విరమణ చేస్తున్న విషయాన్ని గుర్తించాడు. ఇంత సర్వీసు ఉన్న వారికి ఇతర విభాగాల్లో స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ లభిస్తోందని, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులకు పదోన్నతులతో పాటు వాహనం, పెట్రోల్ వంటి ఇతర సౌకర్యాలు ఉన్నా.. కానిస్టేబుళ్లకు అలాంటివేవీ లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్ అని తెలియడంతో పెళ్లి సంబంధాలు కుదరట్లేదని వాపోయారు. తన రాజీనామాపై పునరాలోచన చేస్తానంటూ ఓ దశలో ప్రతాప్ పేర్కొన్నా.. చివరకు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment