Chemicals Company
-
ఐపీవో బాటలో సర్వైవల్ టెక్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ప్రధానంగా విజయ్ కుమార్ రఘునందన్ ప్రసాద్ అగర్వాల్ రూ. 544 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్, తయారీ సర్వీసుల(క్రామ్స్) ఈ కంపెనీ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్స్ రూపొందిస్తోంది. దేశీయంగా హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్‌లకు చెందిన ప్రత్యేకతరహా ఉత్పత్తుల తయారీలోగల కొద్దిపాటి సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) రూ. 312 కోట్ల ఆదాయం, రూ. 73 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
తీర్చేసుకో ‘ఎన్నికల’ రుణం!
సాక్షి, అమరావతి: పరిశ్రమల ఏర్పాటు ముసుగులో రూ.కోట్ల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలుగు తమ్ముళ్లకు పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆర్థిక స్తోమత ఏమాత్రం లేని కంపెనీలకు విలువైన భూములను కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికల్లో అధికార పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుస్తున్న కర్నూలు జిల్లా టీడీపీ నేత మిద్దె శాంతి రాముడికి చెందిన కంపెనీలకు ప్రభుత్వం అత్యంత విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టింది. అంతేకాదు విచ్చలవిడిగా రాయితీలను సైతం ప్రకటించింది. రూ.53 కోట్ల విలువైన 250 ఎకరాల భూములను శాంతిరాముడి కంపెనీలకు కేవలం రూ.5 కోట్లకే కట్టబెట్టారంటే సర్కారు పెద్దలు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ధర ఎందుకు తగ్గింది? రూ.660 కోట్ల పెట్టుబడితో ఫెర్రో సిలికాన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తానని, ఇందుకోసం భూమి కేటాయించాలని కోరుతూ అధికార పార్టీ నేత శాంతి రాముడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం రూ.5,00,000 మూలధనంతో(క్యాపిటల్) 2016 డిసెంబర్ 16న ట్రెమాగ్ అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. భూమి కోసం 2017 ఏప్రిల్ 3న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) అదే నెల 21న ఆ దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలం కోపర్తిలోని ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో 100 ఎకరాలను ఎకరం రూ.15,01,437 చొప్పున కేటాయిస్తూ 2017 అక్టోబర్ 14న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం మొత్తం సొమ్మును రూ.90 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంది. అడ్వాన్స్‌గా కేవలం రూ.35 లక్షలు చెల్లించిన ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీ మిగిలిన రూ.3.94 కోట్లు చెల్లించలేక చేతులెత్తేసింది. దీనితో భూ కేటాయింపును రద్దు చేస్తూ ఏపీఐఐసీ 2017 డిసెంబర్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని కారణాల వల్ల నగదు సమకూర్చుకోలేకపోయామని, 60 రోజుల సమయం ఇస్తే పూర్తి సొమ్ము చెల్లిస్తామంటూ ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీ 2018 ఏప్రిల్ 30న ఏపీఐసీసీకి లేఖ రాసింది. దీంతో వడ్డీతో కలిపి ఎకరం భూమిని ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీకి రూ.15,98,565 చొప్పున ధరకు కేటాయించాలని సూచిస్తూ ప్రభుత్వానికి ఏపీఐసీసీ ప్రతిపాదనలను పంపింది. కానీ, దీనికి భిన్నంగా ప్రభుత్వం ఎకరం రూ.3.50 లక్షల చొప్పున మొత్తం 100 ఎకరాలను రూ.3.50 కోట్లకు ట్రెమాగ్ అల్లాయిస్‌కు కేటాయిస్తూ 2018 అక్టోబర్ 23న ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ ఎకరం విలువ రూ.30 లక్షల దాకా పలుకుతోంది. అంటే రూ.100 ఎకరాల విలువ ఎంత లేదన్నా రూ.30 కోట్లు తగ్గదు. అన్ని వసతులు ఉండే పారిశ్రామిక పార్కులో రూ.100 ఎకరాలను కేవలం రూ.3.5 కోట్లకే కేటాయించారంటే ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శాంతిరాం కెమికల్స్దీ అదే దారి.. తొలుత చార్టెర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసి, విద్యాసంస్థల వ్యాపారంలోకి ప్రవేశించిన మిద్దె శాంతిరాముడు ఇప్పుడు కెమికల్స్, అల్లాయిస్ కంపెనీ పేరిట ప్రభుత్వం వందల ఎకరాలను చేజిక్కించుకుంటున్నారు. కెమికల్స్ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ ప్రతిపాదనలు పంపిన వెంటనే ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తోంది, రాయితీలు ఇస్తోంది. శాంతిరాం కెమికల్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో శాంతిరాముడి కుటుంబ సభ్యులే తప్ప ఇతరులెవరూ లేరు. రూ.5 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్‌తో 2012లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ రూ.900 కోట్ల పెట్టుబడితో కాల్షియం కార్పొనేట్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామంటూ 2015లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి ఆమోదం తెలుపుతూ 150 ఎకరాలను కేటాయిస్తూ 2016లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎకరం కేవలం రూ.1,00,500 ధరకే కేటాయించడం గమనార్హం. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటురులో కేటాయించిన ఈ 150 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.23 కోట్ల పైమాటే. అలాంటిది కేవలం రూ.1.5 కోట్లకే శాంతిరాముడి కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. అంతేకాదు 2015–20 పారిశ్రామిక పాలసీ కింద 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ, వ్యాట్, జీఎస్టీపై 100 శాతం మినహాయింపు, రూ.1.50కే యూనిట్ విద్యుత్ వంటి భారీ రాయితీలను అందించింది. భూమి కేటాయించిన మూడేళ్లలో వినియోగంలోకి తీసుకురావాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇంతవరకు అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. సన్నిహితుడి కాలేజీలకు అనుమతులు శాంతిరాం కెమికల్స్, ట్రెమాగ్ అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీల పేరిట రూ.53 కోట్ల విలువైన 250 ఎకరాల భూమిని టీడీపీ నేత శాంతిరాముడు కేవలం రూ.5 కోట్లకే దక్కించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజీ, హాస్పిటల్, మెడికల్ కాలేజీలకు అనుమతులు పొందారు. తాజాగా 2018 అక్టోబర్ 5న పారామెడికల్ కాలేజీకి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఆర్థికంగా తోడ్పాటు అందించిన తన సన్నిహితుడు శాంతిరాముడుకు ‘ముఖ్య’నేత భారీ స్థాయిలో ప్రయోజనాలు చేకూర్చుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ శాంతిరాముడితో భారీగా డబ్బు ఖర్చు చేయించేందుకే అత్యంత విలువైన భూములను కారుచౌకగా ఆయనకు కట్టబెడుతున్నారని సాక్షాత్తూ టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఏడీ ఒక్కరే బాధ్యులా?
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): ఆలూరు మండలం హత్తి బెళగల్ పేలుడు ఘటనకు సంబంధించి మైనింగ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) నటరాజ్‌ను బాధ్యున్ని చేస్తూ సస్పెండ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ఘటనలో ఒక్కరే బాధ్యులా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించి గ్రామ, మండల స్థాయి అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. క్వారీ ప్రాంతంలో చేపట్టబోయే పనులను, పేలుడు పదార్థాల వినియోగాన్ని ప్రతి మూడు నెలలకోసారి అధికారులు పర్యవేక్షించాలి. అయితే.. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఏకంగా మైనింగ్‌శాఖ ఏడీని బాధ్యున్ని చేస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు. పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? వాస్తవానికి క్వారీలలో పేలుళ్లకు సంబంధించి రెండు రకాల బ్లాస్టింగ్స్ నిర్వహిస్తుంటారు. కంట్రోల్ బ్లాస్టింగ్, కెమికల్ బ్లాస్టింగ్ విధానాల్లో నిపుణులైన వారి ద్వారా పేలుళ్లు జరుపుతారు. పేలుళ్లకు వినియోగించే పదార్థాల నిల్వలు, పేల్చిన మొత్తం తదితర వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాల్సిన బాధ్యత క్వారీ యజమానులపై ఉంది. ఈ విధానాన్ని మొత్తం పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక గ్రామ కార్యదర్శి, మండల రెవెన్యూ అధికారి, పోలీసుశాఖలపై కూడా ఉంటుంది. కొంత కాలంగా ఈ క్వారీలో పేలుళ్లు యథేచ్ఛగా కొనసాగినప్పటికీ అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు ఆరోపణలున్నాయి. -
విషవాయువులతో 400 మందికి అస్వస్థత
* రసాయనాల కంపెనీ నిర్వాకమని ఆరోపణ * శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిన బాధితులు * పలు ఆస్పత్రుల్లో చికిత్స * సీరియస్‌గా ఉన్న ఇద్దరిని ముంబై తరలింపు * బాధితులకు పలువురు రాజకీయనాయకుల పరామర్శ * కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాక్షి, ముంబై: ఉల్లాస్‌నగర్,అంబర్నాథ్ పట్టణాలను విషవాయువులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారు 400 మంది ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. రెండు పట్టణాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అంబర్నాథ్ ఎంఐడీసీలోని ఓ రసాయనాల కంపెనీకి చెందిన ట్యాంకర్‌లోని అపాయకరమైన రసాయనాలను అంబర్నాథ్ వడోల్ గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న వాలధుని నదీలో శుక్రవారం అర్ధరాత్రి వదిలేశారు. దాంతో విషవాయువులు ఈ రెండు పట్టణాల్లో వ్యాపించాయి. వాటిని పీల్చిన వారికి ఒక్కసారిగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, కళ్లు మండటం, కళ్లు తిరగడం తదితర సమస్యలు ప్రారంభమయ్యాయి. దీంతో శనివారం తెల్లవారుజాము సుమారు మూడు గంటల నుంచి వడోల్గావ్, సమ్రాట్ అశోక్‌నగర్, రేణుకా సొసైటీ, లాసీపాడా, పహలుమల్ కంపౌండ్, అయోధ్యనగర్ తదితర పరిసరాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల ఏం జరిగిందో అర్థకం కాక అనేక మంది ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు స్వయంగా ఆస్పత్రుల్లో చేరగా మరికొందరిని తర్వాత సుమారు 25 అంబులెన్సుల్లో చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. ఉల్లాస్నగర్లోప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చిన పలు అంబులెన్స్‌లు బారులు తీరిన దృశ్యమే పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టిందనవచ్చు. కాగా, బాధితుల్లో దీపక్ ముపే, హసీనా శేఖ్ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు వారిని ముంబైకి తరలించారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరగడంతో శివనేరి, శర్వానంద్, ఈఎస్ఐఎస్, త్రిమూర్తి మొదలగు ఆస్పత్రుల్లో చేర్పించారు. పరిస్థితి తెలుసుకున్న శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఉల్లాస్‌నగర్ కార్పొరేషన్ కమిషనర్ బాలాజీ ఖతగావ్కర్, డిప్యూటీ పోలీసు కమిషనర్ వసంత్ జాదవ్, ఉపజిల్లాధికారి చంద్రకాంత్ బోడారే, మేయర్ అపేక్ష పాటిల్, ఆర్పిఐ జిల్లా అధ్యక్షుడు నానా బాగుల్, ఎమ్మెన్నెస్ విద్యార్థి సేన జిల్లా ఉపాధ్యక్షుడు బండు దేశ్‌ముఖ్ తదితరులు బాధితులను పరామర్శించారు. ఈ విషయంపై హిల్‌లైన్ పోలీసు స్టేషన్, సెంట్రల్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.