
ఎకరం రూ. 15,98,565 చొప్పున ఇవ్వాలని ఏపీఐఐసీ ప్రతిపాదన పంపితే.. రూ. 3.50 లక్షలకే ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన అడ్డగోలు జీవో
సాక్షి, అమరావతి: పరిశ్రమల ఏర్పాటు ముసుగులో రూ.కోట్ల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలుగు తమ్ముళ్లకు పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆర్థిక స్తోమత ఏమాత్రం లేని కంపెనీలకు విలువైన భూములను కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికల్లో అధికార పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుస్తున్న కర్నూలు జిల్లా టీడీపీ నేత మిద్దె శాంతి రాముడికి చెందిన కంపెనీలకు ప్రభుత్వం అత్యంత విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టింది. అంతేకాదు విచ్చలవిడిగా రాయితీలను సైతం ప్రకటించింది. రూ.53 కోట్ల విలువైన 250 ఎకరాల భూములను శాంతిరాముడి కంపెనీలకు కేవలం రూ.5 కోట్లకే కట్టబెట్టారంటే సర్కారు పెద్దలు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ధర ఎందుకు తగ్గింది?
రూ.660 కోట్ల పెట్టుబడితో ఫెర్రో సిలికాన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తానని, ఇందుకోసం భూమి కేటాయించాలని కోరుతూ అధికార పార్టీ నేత శాంతి రాముడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం రూ.5,00,000 మూలధనంతో(క్యాపిటల్) 2016 డిసెంబర్ 16న ట్రెమాగ్ అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. భూమి కోసం 2017 ఏప్రిల్ 3న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) అదే నెల 21న ఆ దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలం కోపర్తిలోని ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో 100 ఎకరాలను ఎకరం రూ.15,01,437 చొప్పున కేటాయిస్తూ 2017 అక్టోబర్ 14న ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం మొత్తం సొమ్మును రూ.90 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంది. అడ్వాన్స్‌గా కేవలం రూ.35 లక్షలు చెల్లించిన ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీ మిగిలిన రూ.3.94 కోట్లు చెల్లించలేక చేతులెత్తేసింది. దీనితో భూ కేటాయింపును రద్దు చేస్తూ ఏపీఐఐసీ 2017 డిసెంబర్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని కారణాల వల్ల నగదు సమకూర్చుకోలేకపోయామని, 60 రోజుల సమయం ఇస్తే పూర్తి సొమ్ము చెల్లిస్తామంటూ ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీ 2018 ఏప్రిల్ 30న ఏపీఐసీసీకి లేఖ రాసింది. దీంతో వడ్డీతో కలిపి ఎకరం భూమిని ట్రెమాగ్ అల్లాయిస్ కంపెనీకి రూ.15,98,565 చొప్పున ధరకు కేటాయించాలని సూచిస్తూ ప్రభుత్వానికి ఏపీఐసీసీ ప్రతిపాదనలను పంపింది. కానీ, దీనికి భిన్నంగా ప్రభుత్వం ఎకరం రూ.3.50 లక్షల చొప్పున మొత్తం 100 ఎకరాలను రూ.3.50 కోట్లకు ట్రెమాగ్ అల్లాయిస్‌కు కేటాయిస్తూ 2018 అక్టోబర్ 23న ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ ఎకరం విలువ రూ.30 లక్షల దాకా పలుకుతోంది. అంటే రూ.100 ఎకరాల విలువ ఎంత లేదన్నా రూ.30 కోట్లు తగ్గదు. అన్ని వసతులు ఉండే పారిశ్రామిక పార్కులో రూ.100 ఎకరాలను కేవలం రూ.3.5 కోట్లకే కేటాయించారంటే ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
శాంతిరాం కెమికల్స్‌దీ అదే దారి..
తొలుత చార్టెర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసి, విద్యాసంస్థల వ్యాపారంలోకి ప్రవేశించిన మిద్దె శాంతిరాముడు ఇప్పుడు కెమికల్స్, అల్లాయిస్ కంపెనీ పేరిట ప్రభుత్వం వందల ఎకరాలను చేజిక్కించుకుంటున్నారు. కెమికల్స్ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ ప్రతిపాదనలు పంపిన వెంటనే ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తోంది, రాయితీలు ఇస్తోంది. శాంతిరాం కెమికల్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో శాంతిరాముడి కుటుంబ సభ్యులే తప్ప ఇతరులెవరూ లేరు. రూ.5 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్‌తో 2012లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ రూ.900 కోట్ల పెట్టుబడితో కాల్షియం కార్పొనేట్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామంటూ 2015లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి ఆమోదం తెలుపుతూ 150 ఎకరాలను కేటాయిస్తూ 2016లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎకరం కేవలం రూ.1,00,500 ధరకే కేటాయించడం గమనార్హం. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటురులో కేటాయించిన ఈ 150 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.23 కోట్ల పైమాటే. అలాంటిది కేవలం రూ.1.5 కోట్లకే శాంతిరాముడి కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. అంతేకాదు 2015–20 పారిశ్రామిక పాలసీ కింద 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ, వ్యాట్, జీఎస్‌టీపై 100 శాతం మినహాయింపు, రూ.1.50కే యూనిట్ విద్యుత్ వంటి భారీ రాయితీలను అందించింది. భూమి కేటాయించిన మూడేళ్లలో వినియోగంలోకి తీసుకురావాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇంతవరకు అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు.
సన్నిహితుడి కాలేజీలకు అనుమతులు
శాంతిరాం కెమికల్స్, ట్రెమాగ్ అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీల పేరిట రూ.53 కోట్ల విలువైన 250 ఎకరాల భూమిని టీడీపీ నేత శాంతిరాముడు కేవలం రూ.5 కోట్లకే దక్కించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజీ, హాస్పిటల్, మెడికల్ కాలేజీలకు అనుమతులు పొందారు. తాజాగా 2018 అక్టోబర్ 5న పారామెడికల్ కాలేజీకి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఆర్థికంగా తోడ్పాటు అందించిన తన సన్నిహితుడు శాంతిరాముడుకు ‘ముఖ్య’నేత భారీ స్థాయిలో ప్రయోజనాలు చేకూర్చుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ శాంతిరాముడితో భారీగా డబ్బు ఖర్చు చేయించేందుకే అత్యంత విలువైన భూములను కారుచౌకగా ఆయనకు కట్టబెడుతున్నారని సాక్షాత్తూ టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment