టర్బైన్ల వాడకంపై అవగాహన పెంచుకోవాలి
భీమవరం: ఇంజినీరింగ్ విద్యార్థులు విమానాలు, విద్యుత్ కేంద్రాల్లో టర్బైన్ల వినియోగం, ఆధునిక గ్యాస్ టర్బైన్ల వాడకం వంటి అంశాల్లో సాంకేతిక మార్పులను అవగాహన చేసుకోవాలని చెన్నై ఐఐటీ ఫ్రొఫెసర్ డాక్టర్ బీవీఎస్ఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ థర్మల్ ఇంజినీరింగ్’ అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో విశాఖ, విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్లు పాల్గొంటారని చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, వర్క్‌షాప్ సమన్వయ కర్తలు జి.శ్రీనివాసరావు, జీవీ సుభాష్, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.