Fact Check: బాబుకోసం ఓ ‘అబద్ధాల కథ’
సాక్షి, అమరావతి: ఏదైనా ప్రాజెక్టు గురించి చెప్పాలనుకుంటే ముందుగా వాస్తవాలను పరిశీలించాలి. అక్కడ జరుగుతున్న దానికి, తాము చెబుతున్న దానికీ పొంతన ఉండాలి. ఇలా ఏ పొంతనా కుదరకుండా చెప్పగలిగిన వారే రామోజీరావు. కేవలం చంద్రబాబును సీఎంను చేయాలన్న ఏకైక లక్ష్యంతో, సీఎం జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుగ్ధతో ఈనాడులో అబద్ధాలనే కథనాలుగా అచ్చేస్తున్నారు.
తాజాగా విశాఖ – చెన్నై కారిడార్(వీసీఐసీ)పైనా ఇలాంటి విష కథనాన్ని ప్రచురించి మరోసారి అడ్డంగా దొరకిపోయారు. అసలు వాస్తవమేమిటంటే.. ఈ రోజుకు కూడా ఈ కారిడార్‌లో జరిగిన పనులు 64.82 శాతమే. కానీ, చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికే 78.5 శాతం పనులు పూర్తయిపోయాయంటూ రామోజీ వీరంగం వేశారు. వాస్తవంగా చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ కారిడార్‌లో జరిగిన పనులు 25.70 శాతమే. మిగతా పనులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినవే.
అదీ కరోనా మహమ్మారి కారణంగా అనేక నెలలు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి, ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి, త్వరితగతిన పూర్తి చేస్తోంది. ఇవన్నీ పరిశీలించకుండానే రామోజీ విషం కక్కేశారు.
విశాఖ – చెన్నై కారిడార్‌లో మొత్తం 8 ప్రాజెక్టులను రూ.2,629.05 కోట్లతో చేపట్టారు. అందులో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి కేవలం 194.37 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. కానీ రూ.2,459 కోట్లు ఖర్చు చేశామంటూ సిగ్గు ఎగ్గూ లేకుండా ఈనాడులో రాసుకున్నారు. రూ.170 కోట్ల బిల్లుల పెండింగ్‌లో రాష్ట్ర వాటా కింద రూ.36 కోట్లు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై మరోసారి విషం కక్కారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,082 కోట్లు చెల్లించడమే కాకుండా మరో రూ.1,078.68 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ జీవోలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అయినా బాబు గ్రాఫిక్స్ రాజధానిలాగా రామోజీ వీసీఐసీ కారిడార్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిపోయిందని రాసేసుకున్నారు.
కోవిడ్‌తో తొలి దశ ఆలస్యం
వాస్తవంగా వీసీఐసీ మొదటి దశ పనులు 2023 జూన్ 30కి పూర్తి కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్‌డౌన్‌తో కొంత కాలం పనులు ఆగిపోయాయి. ఆ కాలంలో స్వస్థలాలకు వెళ్లిపోయిన కూలీలు తిరిగి రాలేదు. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) తొలి దశ గడువును మరో ఏడాది అంటే ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది.
కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.32.61 కోట్లు ఈ నెలాఖరులోగా విడుదల చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న రూ.154.76 కోట్ల విడుదల ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. అంతేకాదు.. తొలి దశ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఏడీబీ.. రెండో దశ కింద రూ.1,468.12 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులకు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆమేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది.
ఆగిపోయిన పనులు తిరిగి మొదలు పెట్టేలా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంటే నోటీసులతో బెదిరిస్తోందంటూ రామోజీ తన వక్రబుద్ధిని చాటుకున్నారు. నాయుడుపేట క్లస్టర్లో 95 శాతం పనులు పూర్తి కాగా మిగిలిన 5 శాతం పనులను లక్ష్యంలోగా పూర్తి చేయనున్నారు.