‘కింగ్’ సేతురామన్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ (జీఎం) చెస్ టోర్నమెంట్-2013ను భారత గ్రాండ్‌మాస్టర్ ఎస్పీ సేతురామన్ గెలుచుకున్నాడు. మంగళవారం ఇక్కడి కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలో ముగిసిన ఈ టోర్నీలో సేతురామన్ 11 రౌండ్ల ద్వారా మొత్తం 8.5 పాయింట్లతో టాప్‌గా నిలిచాడు. మెరాబ్ (జార్జియా)తో జరిగిన ఆఖరి రౌండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకొని అతను అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. రష్యా గ్రాండ్ మాస్టర్ ఇవాన్ పొపొవ్ (8.5) కూడా పాయింట్లపరంగా సమంగా నిలిచినా... ‘బుకాల్జ్ టైబ్రేక్’ పద్ధతి ద్వారా సేతుకు టైటిల్ దక్కింది. ఇవాన్ తన ఆఖరి గేమ్‌లో లెవాన్ (జార్జియా)ను ఓడించాడు. విజేతకు రూ. 2 లక్షలు, రన్నరప్‌కు రూ. లక్షా 50 వేలు ప్రైజ్‌మనీగా లభించాయి. మరో భారత ఆటగాడు విదిత్ గుజరాతీ (8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. విదిత్ 11వ రౌండ్లో టోర్నికే (జార్జియా)ను ఓడించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లలిత్‌బాబు (24వ స్థానం), ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ (27), రవితేజ (28) టాప్-30లో నిలిచారు. ఈ టోర్నీ ద్వారా బాలచంద్ర, రవితేజలు ఐఎం నార్మ్‌లు అందుకున్నారు.
ఆకట్టుకున్న ఏపీ ఆటగాళ్లు...
2100కంటే తక్కువ రేటింగ్ ఉన్న ఆటగాళ్ల కోసం నిర్వహించిన ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నీ (కేటగిరి బి)లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు వి. వరుణ్ (8.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు. ఆఖరి రౌండ్లో వరుణ్ మన రాష్ట్రానికే చెందిన రమణబాబును ఓడించి టైటిల్ ఖాయం చేసుకున్నాడు. అతనికి రూ. 1 లక్ష రూపాయల నగదు బహుమతి దక్కింది.