చికెన్ 110... కందిపప్పు 200!
''శాకాహారులు కూడా ఈమధ్య చికెన్ తినేస్తున్నారు... అందుకే మా చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి'' అని ఇంతకుముందు తమ శాకాహార స్నేహితులతో సరదాగా అనేవాళ్లు. కానీ, ఇప్పుడు కిలో కందిపప్పు కంటే కిలో చికెన్ ధర బాగా చవగ్గా ఉంది. గట్టిగా మాట్లాడితే చికెన్ ధర కంటే కందిపప్పు ధర దాదాపు రెట్టింపు పలుకుతోంది. మరి ఇప్పుడు పప్పులను అందరూ తినేయడం వల్లే వాటి ధరలు పెరిగిపోతున్నాయని అంటారేమో! పండుగల సీజన్ రావడంతో పప్పులకు గిరాకీ పెరిగిపోయింది. ప్రధానంగా కందిపప్పు ధర దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భగ్గుమంటోంది. కిలో కందిపప్పు ధర ఢిల్లీలో రూ. 180 ఉండగా హైదరాబాద్ లాంటి నగరాల్లో 180-200 మధ్య పలుకుతోంది.
మధ్యతరగతిపై భారం
హైదరాబాద్‌లో చికెన్ ధరలు దాదాపు రూ. 100-120 మధ్యన ఉంటున్నాయి. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో కిలో రూ. 110కే అమ్మారు. మరింత తగ్గొచ్చని కూడా కొందరు వ్యాపారులు అంటున్నారు. కందిపప్పు మొన్నటి వరకు కిలో రూ. 140 వరకు పలికేదని, అప్పుడు దాల్ రైస్‌ను రూ. 40కే ఇచ్చేవాళ్లమని.. కానీ ఇప్పుడు దాని ధర పెరిగిపోవడంతో తాము కూడా ఓ పది రూపాయలు పెంచక తప్పడం లేదని రోడ్డుపక్కన బండి మీద సాంబార్ రైస్, దాల్ రైస్ అమ్ముకునే వ్యాపారులు చెబుతున్నారు. అదే చికెన్ రైస్ అయితే ప్లేటు 20 రూపాయలే! ఇప్పుడు తాము కూడా పప్పు వండటం తగ్గించి, చికెన్ ఎక్కువగా అమ్ముతున్నామంటున్నారు. కోడిగుడ్లు కూడా ఒక్కోటి 4 రూపాయలకే దొరుకుతున్నాయని, ముగ్గురు ఉన్న కుటుంబంలో కూర వండాలంటే 15 రూపాయలు పెడితే సరిపోతుందని మరో మధ్యతరగతి మానవుడు చెప్పాడు. అదే కందిపప్పు అయితే కనీసం పావుకిలో వండుకోవాలన్నా 50 రూపాయల వరకు పెట్టాల్సి వస్తోంది. మళ్లీ అందులోకి ఏదో ఒక కూర కలపాలి. దాని ధర అదనం.
కారణాలు ఏంటి?
పండగల సీజన్ రావడంతో వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దాంతోపాటు.. మార్చిలో అకాల వర్షాల కారణంగా కంది పంట తీవ్రంగా దెబ్బతింది. దానివల్ల దిగుబడులు తగ్గి ధరలు పెరిగాయని కూడా అంటున్నారు. కందులు మహారాష్ట్రలో ఎక్కువగా పండుతాయి. అక్కడ పంట నష్టపోవడంతో కందిపప్పు త్వరలోనే 200 దాటుతుందని వ్యాపారులు చెబుతున్నారు.