లక్షన్నర కోళ్లను చంపేశారు
చికెన్ కొనుగోలును నిలిపివేసిన మైసూరు జూ అధికారులు
కొన్ని జాగ్రత్తలతో బర్డ్‌ఫ్లూ దూరం : నిపుణులు
బెంగళూరు : రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ నివారణా చర్యలు యుద్ధ ప్రతిపాదికన సాగుతున్నాయి. అందులో భాగంగా బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులను నిపుణులు బృందం వైజ్ఞానికంగా సంహరిస్తోంది. రాష్ట్రంలోని బీదర్ జిల్లా హొమ్నాబాద్ తాలూకా మార్కెర గ్రామంలో బర్డ్‌ఫ్లూతో 20 వేల కోళ్లు చనిపోగా అక్కడే వివిధ కోళ్ల ఫారంలలో ఉన్న మరో 1.50 లక్షల కోళ్లను చంపడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశుసంవర్థకశాఖ అధికారులు 50 బృందాలను ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంపేశారు. ఇందు కోసం నాలుగు వేల సంచులను సిద్ధం చేసుకుని 200 గుంతలను తవ్వారు.
ఒక్కొక్క సంచిలో నలభై నుంచి యాభై కోళ్లను వేసి అటుపై గుంతల్లో వేసి మట్టితో కప్పేశారు. ఈ పనిలో నిమగ్నమైన వారికి మాస్క్‌లు, ప్రత్యేక దుస్తులను అందజేశారు. కాగా, పక్షలను వైజ్ఞానికంగా చంపే కార్యక్రమం సోమవారమే జరగాల్సి ఉండగా వర్షం వ ల్ల ఈ పనిని మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా బర్డ్‌ఫ్లూ విషయమై ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్రంలోని వివిధ జూ సిబ్బంది అక్కడి జంతువులకు కోళ్లను ఆహారంగా వేయడాన్ని నిలిపివేశాయి. అంతేకాకుండా పక్షులు ఉన్న ఎన్‌క్లోజర్స్‌ను పూర్తిగా శుభ్రం చేసి వాటి శ్యాంపిల్స్‌ను కూడా పరీక్ష కోసం లాబొరేటరీలకు పంపించారు.
ఈ విషయమై మైసూరు జూ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.వెంకటేషన్ మాట్లాడుతూ...‘మా జూలో బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాలు ఏవీ కనబడలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చికెన్ కొనుగోలును నిలిపివేశాం.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పక్షుల ద్వారా మనుషులకు కూడా బర్డ్‌ఫ్లూ (ఏవీఎన్ ఇన్ఫ్లూఎంజా-ఎచ్5ఎన్1) వ్యాధి సోకే అవకాశం ఉంది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికీ కూడా బర్డ్‌ఫ్లూ సోసిన దాఖలాలు లేవు. కాగా, బర్డ్‌ఫ్లూ సోకిన వారికి ప్రస్తుతం ఓసల్టామీవీర్ (టామీఫ్లూ) మందును అందజేస్తున్నారు. దీంతో పాటు జనామీవీర్ను కూడా కొన్నిచోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి చికిత్సలో అందజేయవచ్చు.
పక్షుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవి..
అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడం
పక్షుల్లో విసర్జక పదార్థాలు సాధారణం కంటే నీళ్లగా ఉండడం
పక్షుల కాళ్లు, ముక్కు ఊదా రంగులోకి మారి పోవడం
పక్షుల గుడ్డు పెంకులు పెలుసుగా మారిపోవడం
పక్షులు ఆహారాన్ని తీసుకోవపోవడం
కనురెప్పలు, తల, కాళ్ల గోళ్లు ఉబ్బిపోవడం
ముక్కుల నుంచి నీరు కారడం
మనుషుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవి...
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, దగ్గు,
ముక్కు నుంచి నీరు కారడం
స్వల్ప పరిమాణంలో శరీర ఉష్ణోగ్రత పెరగడం
చాలా కొంతమందిలో శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...
బర్డ్‌ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కోడి మాంసంతో పాటు గుడ్డును పూర్తిగా ఉండికించిన తర్వాతనే తినాలి
హాఫ్ బాయిల్డ్, స్మోక్డ్ చికెన్లను తినకపోవడం మంచిది
కోళ్లను ముట్టుకున్న తర్వాత చేతిని సోపుతో శుభ్రపరుచుకోవాలి
కోళ్ల వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకకూడదు