అయ్యో పాపం.. చిన్నారి ప్రాణం తీసిన కారు
గచ్చిబౌలి: ఇంటి సమీపంలోని రోడ్డుపై ఆడుకుంటున్న ఓ బాలుడి పైనుంచి కారు వెళ్లడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గచ్చిబౌలి ఎస్ఐ రమేష్ తెలిపిన ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఎనమదల గ్రామానికి చెందిన తోట రమేష్, అనూష దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి కొండాపూర్ శ్రీరాంనగర్ బి బ్లాక్‌లోలో నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు తోట జశ్వంత్ (11 నెలలు) ఉన్నారు. ఇంటి సమీపంలో రోడ్డుపై ఇద్దరు అక్కలు, జశ్వంత్‌తో పాటు మరి కొత మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఓఎన్సీ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే తాటి కిరణ్ కూకట్‌పల్లిలోని ఆఫీస్‌కు వెళ్లేందుకు మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో కారులో బయలుదేరాడు.
హారన్ కొట్టడంతో మూల మలుపు వద్ద ఆడుతున్న పిల్లలందరూ పక్కకు జరిగారు. 11 నెలల జశ్వంత్ నడవలేక పాకుతుండగా...ఆ బాలుడిని గమనించకపోవడంతో ముందు టైరు పైనుంచి వెళ్లింది. వెంటనే శ్రీరాంనగర్ కాలనీలోని ఓ క్లినిక్‌లో చికిత్సచేయించగా కోలుకోలేక పోవడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నిందితుడు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: కరోనాతో ఉద్యోగం రాదని విద్యార్థి బలవన్మరణం