Child Protection Officer
-
బాలిక కుటుంబాన్ని ఆదుకుంటాం
వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం : మండలంలోని బెండి గ్రామంలో ఈ నెల 5న జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి బాధిత బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి తెలిపారు. బెండి గ్రామంలో సోమవారం ఆమె బాలిక తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రుల మధ్య విభేదాలు, ఇతర సామాజిక అంశాల్లో గొడవలు జరుగుతున్నందున తక్షణమే బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. భార్యభర్తలు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీని సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తండ్రి తరఫు కుటుంబసభ్యులకు హెచ్చరించారు. శ్రీకాకుళంలో భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత బాలిక తల్లికి మానసిక నిపుణుడితో పరీక్షలు నిర్వహించి.. మందులు ఉచితంగా అందించాలని శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు. బాలిక తాతయ్య, తల్లితో మాట్లాడారు. ఎలాంటి ఆర్థికసాయం కావాలన్నా ఫోన్ చేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ కేవీ రమణ, కాశీబుగ్గ ఐసీడీఎస్ ఏసీడీపీఓ ఎస్.అరుణ, ఇన్చార్జి సూపర్వైజర్ అరుణ, తదితరులు ఉన్నారు. -
బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం
నెక్కొండ : ఎలాంటి సంబంధం లేని ఓ బాలిక అన్నదమ్ముల గొడవలో ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బంజరుపల్లి శివారు ధర్మతండాలో ఈ నెల 30న రాళ్లు విసరడంతో అదే తండాకు చెందిన బాలిక అఖిల మృతిపై జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న మరుసటి రోజు ఎంజీఎం ఆస్పత్రిలో నెక్కొండ సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై నవీన్‌కుమార్‌లను కలిసి వివరాలు తీసుకున్నట్లు మహేందర్‌రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబ నేపథ్యం ప్రకారం.. వారి ఆర్థిక విషయాలపై గొవడకు కారణం, బాలిక మృతిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర విచారణ రిపోర్టును మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు, జిల్లా ఉన్నతాధికారులు, బాలల సంక్షేమ కమిటీకి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు నాలుగో సంతా నం కాగా, పదో తరగతి చదివిన పెద్ద కూతురు(మూగ)కు పునరావాసం కల్పిస్తామన్నారు. ఆమెను వృత్తి విద్యా కోర్సు చదివించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రెండో కుమార్తెకు వివాహం జరుగగా, మూడో కుమార్తెను నెక్కొండ కస్తూర్భా గురుకులంలో 8వ తరగతిలో చేర్పిస్తామన్నారు. ప్రభుత్వం తరుఫున బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విచారణలో అంగన్వాడీ టీచర్ సుధ, ఆయా పూలమ్మ, తండావాసులు పాల్గొన్నారు. -
పేగు బంధాన్ని అమ్ముకున్నారు
కందుకూరు, న్యూస్‌లైన్: పేదరికం ఆ దంపతుల కన్నపేగును దూరం చేసుకునేలా చేసింది. హాస్పిటల్ బిల్లులు చెల్లించలేని స్థితిలో తమకు కలిగిన కవలలను అమ్మకానికి పెట్టారు. ఆడపిల్లలన్న కారణమో..లేక సాకలేమన్న భయమో పొత్తిళ్లలో ఉన్న పిల్లల్ని అమ్మేశారు. నెల రోజుల క్రితం లింగసముద్రం మండలం పెదపవని గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శిశు సంక్షేమ శాఖాధికారులు ఆ పిల్లల్ని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. పెదపవని గ్రామానికి చెందిన వ్యక్తికి, నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సంకువారిపాలెం గ్రామానికి చెందిన యువతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటికే వారికి ఒక బాబు, పాప ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం గతనెల 18న కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. మూడో కాన్పులో ఆడ పిల్లలైన ఇద్దరు కవలలు జన్మించారు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ యజమాని వారిని పోషించలేమని భావించి విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ప్రసవమైన 8 రోజులకు వేటపాలేనికి చెందిన ఓ వ్యక్తికి ఒక పాపను ఇచ్చేయగా.. 9వ రోజు హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తికి రెండో పాపను ఇచ్చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌కు అయిన ఖర్చు రూ 25 వేలను వారు చెల్లించినట్లు సమాచారం. ఆ దంపతుల కుటుంబ ఖర్చుల కోసం మరికొంత నగదు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా శిశు సంక్షేమ శాఖాధికారులకు తెలియడంతో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసులు పెదపవని వెళ్లి దంపతులను విచారించడంతో పిల్లల్ని ఎవరికి ఇచ్చిందీ చెప్పారు. అధికారులు పిల్లల్ని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కవల పిల్లల్ని ఒంగోలులోని శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి సంరక్షిస్తున్నారు. మంగళవారం పిల్లలిద్దరికీ ఒంగోలులోని హాస్పటల్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం శిశువులిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన శిశు సంక్షేమశాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. కవలలను తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు పిల్లలు లేని వారేనని, తమ సమ్మతితోనే వారు తీసుకెళ్లినట్లుగా చెప్పినట్లు సమాచారం. అయినా చట్టప్రకారం ఇది నేరం కావడంతో కేసులు నమోదు చేశారు. శిశువుల విక్రయంలో పలువురు దళారుల పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది.