
బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీవాణి
వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం : మండలంలోని బెండి గ్రామంలో ఈ నెల 5న జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి బాధిత బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి తెలిపారు. బెండి గ్రామంలో సోమవారం ఆమె బాలిక తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రుల మధ్య విభేదాలు, ఇతర సామాజిక అంశాల్లో గొడవలు జరుగుతున్నందున తక్షణమే బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. భార్యభర్తలు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీని సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తండ్రి తరఫు కుటుంబసభ్యులకు హెచ్చరించారు.
శ్రీకాకుళంలో భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత బాలిక తల్లికి మానసిక నిపుణుడితో పరీక్షలు నిర్వహించి.. మందులు ఉచితంగా అందించాలని శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు. బాలిక తాతయ్య, తల్లితో మాట్లాడారు. ఎలాంటి ఆర్థికసాయం కావాలన్నా ఫోన్ చేయాలని సూచించారు.
ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ కేవీ రమణ, కాశీబుగ్గ ఐసీడీఎస్ ఏసీడీపీఓ ఎస్.అరుణ, ఇన్‌చార్జి సూపర్‌వైజర్ అరుణ, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment