పులి పిల్లలు - శునకమాత..!
మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా ‘సరోగసి’ ఉంటుందంటున్నారు చైనా జూ అధికారులు. అనడమే కాదు, నిజమని నిరూపిస్తున్నారు కూడా. తల్లి నిరాదరణకు గురైన పులిపిల్లలను అదే జూలోని ఓ శున కమాతకి దత్తత ఇచ్చి, జంతువులకు జాతివైరం లేదని చాటి చెబుతున్నారు. హాంగ్జూహూ జూ లో ఈ వింత సంఘటన చోటు చేసుకొంది. అక్కడ ఒక సైబీరియన్ టైగర్ రెండు కబ్స్‌కు జన్మనిచ్చింది.
ఎందుకో అది వాటికి పాలివ్వనని మొరాయించింది. దీంతో దిక్కుతోచని జూ అధికారులు అదే జూ లో ప్రసవించిన జియావో అనే శునకం దగ్గరకు ఈ కబ్స్‌ను తీసుకెళ్లారు. పరాయి తల్లి కన్నబిడ్డలైనప్పటికీ వాటిని ఈసడించుకోకుండా, తన పిల్లలతో సమానంగా పులిపిల్లలకు కూడా ప్రేమతో పాలిచ్చింది జియావో. నవంబర్ పదోతేదీన కబ్స్ పుట్టాయట. అప్పటినుంచి వాటికి పాలిచ్చే బాధ్యత జియావోకే అప్పజెప్పామని వారు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ శునకాన్ని పులిపిల్లలకు సరోగసీ మదర్‌గా చెప్పవచ్చని వారు అంటున్నారు.
ఈ జూలో ఇలా ఒక జాతి జంతువును మరోజాతికి దత్తతఇవ్వడం కొత్తకాదు. గతంలోనూ జరిగింది. అప్పుడూ ఇలాగే చేశారు. పులులు ఇలా తమ పిల్లలకు పాలివ్వకుండా మొరాయించడం మామూలేనని, అలాంటప్పుడు ఇదే పరిష్కార మార్గమని జూ అధికారులు పేర్కొన్నారు.