chinjeyar swamy
-
ధార్మిక విప్లవాన్ని సాధించిన మహనీయుడు పెదజీయర్
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): ధార్మిక విప్లవాన్ని సాధించిన మహనీయుడు పెదజీయర్ స్వామి అని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పారు. ఆయన 1909 నుంచి 1979 వరకు ఈ భూమిపై భౌతికంగా సంచరించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్‌లో ఐదు రోజులుగా సాగుతున్న చినజీయర్ స్వామి ‘తిరునక్షత్ర’మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా చినజీయర్ అనుగ్రహ భాషణం చేశారు. దీపావళి నుంచి 5రోజులుగా దివ్యసాకేత క్షేత్రంలో సీతారామచంద్రస్వామి పునరాగమన కార్య క్రమం జరుపుకున్నట్లు తెలిపారు. 1930కి పూర్వం బ్రాహ్మణులు తప్పా మిగతా వారెవ్వరూ భగవద్గీత, రామాయణం, సహస్రనామాన్ని ముడితే తప్పు, పాపం అనే భావనలో ఉండేవారనీ పెదజీయర్ స్వామి ఉద్యమించాక అవి శ్రద్ధ కలిగిన ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్‌రా వు పాల్గొన్నారు. -
యాదాద్రి తలమానికం
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): యాదగిరిగుట్ట దేవస్థానాన్ని కాంతులీనే యాదాద్రిగా.. దేశంలోని నర్సింహస్వామి క్షేత్రాల్లోæకెల్లా తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి కొనియాడారు. యాదాద్రిని ఉత్తమ క్షేత్రంగా తయారు చేయడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కృషి చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని జీవా ప్రాంగణంలో సోమవారం జరిగిన చినజీయర్ స్వామి ‘తిరునక్షత్ర’ మహోత్సవానికి కేసీఆర్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జీయర్‌స్వామికి పండ్లు, కానుకలు అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జీయర్‌స్వామి మాట్లాడుతూ ‘‘నా పుట్టిన రోజున కేసీఆర్ పండ్లు, పరివారంతో రావడం చాలా ఆనందదాయకం. రాజకీయంగా వారికంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు రాజకీయ నాయకుల్లో కొత్త ఒరవడికి దారి చూపించిన మహనీ యుడు కేసీఆర్. వ్యక్తిగతంగా అందరిలో దైవభక్తి ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఉండేవారు దేవుడి గురించి మాట్లాడానికి సిగ్గు, మొహమాట పడతారు. కానీ కేసీఆర్ దీనికి భిన్నం. భగవద్భక్తికి ఆయన నిదర్శనం. యాదాద్రి ప్రాజెక్టు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన తొలి అడుగు. అందులో భాగంగా యజ్ఞాలు, ఇతర ఆలయాలైన వేములవాడ, భద్రాది, మట్టపల్లిని అభివృద్ధిపరిచే అవసరాన్ని గుర్తించడం సంతోషకరం. మనసులో మాటను స్పష్టంగా, అందంగా, ఆనందంగా చెప్పే చొరవను ఆయనకు భగవంతుడు కల్పించారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా నా వద్దకు వచ్చినప్పుడు బక్కవాడైనా.. గొప్పవాడని అనుకున్నా’’ అని పేర్కొన్నారు. అనంతరం పెద్దజీయర్‌స్వామి జీవిత చరిత్రకు సంబంధించిన ‘సత్య సంకల్ప’గ్రంథంతోపాటు మంగళ శాసనాలను కేసీఆర్‌కు అందజేశారు. ఫిబ్రవరిలో యాదాద్రి ప్రారంభోత్సవం: కేసీఆర్ శ్రీ రామానుజాచార్య భారీ విగ్రహంతో ఇక్కడ సమతా స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయడం మనకు ఎంతో గర్వకారణమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 108 దివ్యక్షేత్రాలను ఒకేచోట దర్శించుకునే భాగ్యం ఇక్కడ కల్పించడం దేశంలోనే మొదటిదన్నారు. ఇందులో మై హోం గ్రూప్ అధినేత రామేశ్వర్రావు కృషి ఎంతో కీలకమని ప్రశంసించారు. ఖర్చుకు వెనకాడకుండా భారీ కార్యక్రమాన్ని పట్టుదలతో చేపట్టడం అభినందనీయమన్నారు. స్వామివారి అనుగ్రహంతో యాదాద్రి ప్రధాన ఆలయం దాదాపు పూర్తి కావొస్తోందని, అక్కడ ఇంకా చాలా అభివృద్ధి జరిగాల్సి ఉందని కేసీఆర్ వివరించారు. బాలాలయంలో భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రధాన ఆలయాన్ని వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు. 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం, ప్రపంచంలోని అన్ని వైష్ణవ పీఠాల నుంచి స్వాములను యాగానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహా సుదర్శన యాగానికి అందరూ రావాలని ఆహ్వానించారు. ‘‘రాష్ట్రంలో రెండు గొప్ప కార్యక్రమాలు జరుగబోతున్నాయి. అందులో ఒకటి యాదాద్రిలో మహాయాగం. రెండోది జీవా ప్రాంగణంలో సమతాస్ఫూర్తి కేంద్రం ప్రారంభం. ఈ పవిత్రమైన రోజున చినజీయర్‌స్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ చేతి ద్వారా చిన్న పండు ప్రసాదంగా దొరికితే చాలు అనుకునే భక్తులు చాలా మంది ఉంటారు. అందుకోసం మీకు పండ్లు సమర్పించుకున్నా’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా సలక్షణ ఘనాపాఠి మద్దులపల్లి సూర్యనారాయణకు జీయర్ పురస్కారం అందజేశారు. వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లలో యాదాద్రి
* అభివృద్ధి పనులకు గవర్నర్, సీఎం శంకుస్థాపన * చినజీయర్‌స్వామి చేతుల మీదుగా కార్యక్రమం * రాజగోపురం, మహాప్రాకారం, ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శనివారం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామి శంకుస్థాపనలు చేశారు. తొలుత లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం రాజగోపురం, మహాప్రాకారం నిర్మాణ పనులను ప్రారంభించారు. తర్వాత పెద్దగుట్ట వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో గుట్ట అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ సతీసమేతంగా హాజరయ్యారు. యాదాద్రి అభివృద్ధి పనులు ముందుగా నిర్ణయించిన ముహూర్తమైన ఉదయం 8:35కే ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు చేశారు. అనివార్యకారణాల వలన సీఎం కేసీఆర్, గవర్నర్ ఆలస్యంగా వచ్చారు. అయితే వారు శంకుస్థాపన చేసిన ముహూర్తం కూడా చాలా బాగుందని ఆలయ అర్చకులు తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా సీఎం.. ఉదయం 11:05కు గుట్ట సమీపంలోని వడాయిగూడెం హెలిపాడ్ వద్దకు రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ చేరుకున్నారు. కొద్దిసేపటికే హెలికాప్టర్లో చినజీయర్‌స్వామి, మరో హెలికాప్టర్లో గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కడికి చేరుకున్నారు. తొలుత చినజీయర్‌స్వామితో కలిసి కేసీఆర్ గుట్టపైకి చేరుకోగా, తర్వాత నరసింహన్ చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాజగోపురం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ శిలాఫలకం వద్ద సీఎం కేసీఆర్ జ్యోతిని వెలిగించి పనులను ప్రారంభించారు. అనంతరం పెద్దగుట్ట వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని గవర్నర్ దంపతులు ఆవిష్కరించారు. చినజీయర్‌స్వామి ఆశీస్సులు, శాస్త్ర సంప్రదాయాలతో నరసింహస్వామి ఆలయం ఎంతో అభివృద్ధి అవుతుందని గవర్నర్ దంపతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం పెద్దగుట్ట నుంచి కేసీఆర్, గవర్నర్ దంపతులు, చినజీయర్‌స్వామి కొండపైకి వచ్చి.. సంగీత భవనంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడే అధికారులతో చాలాసేపు చర్చించారు. ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్ట యాదాద్రిగా రూపుదిద్దుకున్న తర్వాత ఎలా మారుతుందో అధికారులు స్క్రీన్‌పై చిత్రాలు చూపించారు. రెండు మూడేళ్లలో ఈ పనులన్నీ పూర్తికావాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ సునీత, అధికారులు పాల్గొన్నారు. సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు హైదరాబాద్: హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళుతుండగా సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని రెండు సెక్యూరిటీ వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కొండమడుగు గ్రామ సమీపంలో ఉదయం 10.40 సమయంలో ఈ ఘటన జరిగింది. కాన్వాయ్‌లోని ఒక బుల్లెట్‌ప్రూఫ్ స్కార్పియో దాని ముందు వెళుతున్న పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్ సుమోను ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుళ్లు జి.రఘురామ్(27), కె.పుల్లయ్య(26), చంద్రశేఖర్ (25)లకు తల, వెన్నెముక వద్ద గాయాలయ్యాయి. వారిని వెంటనే ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు.