తిరునక్షత్ర మహోత్సవంలో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి. చిత్రంలో కేసీఆర్ దంపతులు
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): యాదగిరిగుట్ట దేవస్థానాన్ని కాంతులీనే యాదాద్రిగా.. దేశంలోని నర్సింహస్వామి క్షేత్రాల్లోæకెల్లా తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి కొనియాడారు. యాదాద్రిని ఉత్తమ క్షేత్రంగా తయారు చేయడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కృషి చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని జీవా ప్రాంగణంలో సోమవారం జరిగిన చినజీయర్ స్వామి ‘తిరునక్షత్ర’ మహోత్సవానికి కేసీఆర్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జీయర్‌స్వామికి పండ్లు, కానుకలు అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జీయర్‌స్వామి మాట్లాడుతూ ‘‘నా పుట్టిన రోజున కేసీఆర్ పండ్లు, పరివారంతో రావడం చాలా ఆనందదాయకం.
రాజకీయంగా వారికంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు రాజకీయ నాయకుల్లో కొత్త ఒరవడికి దారి చూపించిన మహనీ యుడు కేసీఆర్. వ్యక్తిగతంగా అందరిలో దైవభక్తి ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఉండేవారు దేవుడి గురించి మాట్లాడానికి సిగ్గు, మొహమాట పడతారు. కానీ కేసీఆర్ దీనికి భిన్నం. భగవద్భక్తికి ఆయన నిదర్శనం. యాదాద్రి ప్రాజెక్టు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన తొలి అడుగు. అందులో భాగంగా యజ్ఞాలు, ఇతర ఆలయాలైన వేములవాడ, భద్రాది, మట్టపల్లిని అభివృద్ధిపరిచే అవసరాన్ని గుర్తించడం సంతోషకరం. మనసులో మాటను స్పష్టంగా, అందంగా, ఆనందంగా చెప్పే చొరవను ఆయనకు భగవంతుడు కల్పించారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా నా వద్దకు వచ్చినప్పుడు బక్కవాడైనా.. గొప్పవాడని అనుకున్నా’’ అని పేర్కొన్నారు. అనంతరం పెద్దజీయర్‌స్వామి జీవిత చరిత్రకు సంబంధించిన ‘సత్య సంకల్ప’గ్రంథంతోపాటు మంగళ శాసనాలను కేసీఆర్‌కు అందజేశారు.
ఫిబ్రవరిలో యాదాద్రి ప్రారంభోత్సవం: కేసీఆర్
శ్రీ రామానుజాచార్య భారీ విగ్రహంతో ఇక్కడ సమతా స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయడం మనకు ఎంతో గర్వకారణమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 108 దివ్యక్షేత్రాలను ఒకేచోట దర్శించుకునే భాగ్యం ఇక్కడ కల్పించడం దేశంలోనే మొదటిదన్నారు. ఇందులో మై హోం గ్రూప్ అధినేత రామేశ్వర్‌రావు కృషి ఎంతో కీలకమని ప్రశంసించారు. ఖర్చుకు వెనకాడకుండా భారీ కార్యక్రమాన్ని పట్టుదలతో చేపట్టడం అభినందనీయమన్నారు. స్వామివారి అనుగ్రహంతో యాదాద్రి ప్రధాన ఆలయం దాదాపు పూర్తి కావొస్తోందని, అక్కడ ఇంకా చాలా అభివృద్ధి జరిగాల్సి ఉందని కేసీఆర్ వివరించారు. బాలాలయంలో భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రధాన ఆలయాన్ని వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు. 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం, ప్రపంచంలోని అన్ని వైష్ణవ పీఠాల నుంచి స్వాములను యాగానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
మహా సుదర్శన యాగానికి అందరూ రావాలని ఆహ్వానించారు. ‘‘రాష్ట్రంలో రెండు గొప్ప కార్యక్రమాలు జరుగబోతున్నాయి. అందులో ఒకటి యాదాద్రిలో మహాయాగం. రెండోది జీవా ప్రాంగణంలో సమతాస్ఫూర్తి కేంద్రం ప్రారంభం. ఈ పవిత్రమైన రోజున చినజీయర్‌స్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ చేతి ద్వారా చిన్న పండు ప్రసాదంగా దొరికితే చాలు అనుకునే భక్తులు చాలా మంది ఉంటారు. అందుకోసం మీకు పండ్లు సమర్పించుకున్నా’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా సలక్షణ ఘనాపాఠి మద్దులపల్లి సూర్యనారాయణకు జీయర్ పురస్కారం అందజేశారు. వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment