సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, సకల సౌకర్యాలతో అద్భుతమైన ఎయిర్‌పోర్టు సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జీఎంఆర్ ప్రతినిధులను కోరారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టెర్మినల్‌ను విస్తరించాలని, రెండో రన్‌వే నిర్మాణ పనులు ప్రారంభించాలని, హైదరాబాద్ మెట్రోరైలును ఎయిర్‌పోర్టు వరకు విస్తరించాలని ఆదేశించారు. అత్యుత్తమ సౌకర్యాలతో 12 వేల సీటింగ్ కెపాసిటీ ఉండేలా కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్లు నిర్మించాలని సూచించారు.
వీటన్నింటికీ ప్రభుత్వపరంగా అన్ని రకాల సహకారం అందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణంపై మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణరావు, నవీన్ మిట్టల్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు, ఎయిర్‌పోర్టు బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల, బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు, ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్, డైరెక్టర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
2008లో ప్రారంభమైన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే నంబర్ వన్ ఎయిర్‌పోర్టుగా నిలిచిందని, ఐటీ వినియోగం సహా అనేక విషయాల్లో అగ్రగామిగా ఉందని జీఎంఆర్ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రస్తుతం రోజుకు 400 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఏడాదికి 1.7 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని వివరించారు. తెలంగాణ ఏర్పడకముందు 7 శాతం ఉన్న ప్రయాణికుల వృద్ధిరేటు, ప్రస్తుతం 20.4 శాతానికి పెరిగిందని, భవిష్యత్‌లో ఇంకా పెరుగుతుందని వారు అంచనా వేశారు. ప్రస్తుతమున్న టర్మినల్, రన్ వే దాదాపు రెండున్నర కోట్ల మంది రాకపోకలకు అనువుగా ఉందని వెల్లడించారు. ప్రస్తుత వృద్ధిరేటును అంచనా వేస్తే, టర్మినల్ విస్తరణ, రెండో రన్ వే నిర్మాణం అవసరమని చెప్పారు. రెండో రన్ వే నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. అందుకు ప్రభుత్వ సహకారం కోరారు.
త్వరలో నేనే శంకుస్థాపన చేస్తా
ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణానికి త్వరలో తానే స్వయంగా శంకుస్థాపన చేస్తానని, విమానాశ్రయం పదేళ్ల వేడుకల్లో పాల్గొంటా నని జీఎంఆర్ ప్రతినిధులకు సీఎం మాటిచ్చారు. ‘‘హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. వాతావరణ పరిస్థితులు, మెరుగైన శాంతి భద్రతలు తదితర కారణాల వల్ల ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. వందలాది అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. విమానాశ్రయంలో రద్దీ పెరుగుతోంది.
రాబోయే 25 ఏళ్లకు ఏర్పడే రద్దీని కూడా అంచనా వేసుకుని టర్మినల్ విస్తరణ, రెండో రన్ వే నిర్మాణం చేపట్టాలి. 5 కోట్ల మంది ప్రయాణికులు వచ్చిపోయినా ఇబ్బంది లేకుండా సదుపాయాలుండాలి. ప్రపంచస్థాయి సదస్సులు నిర్వహించేలా కాన్ఫరెన్స్ హాల్, అంతర్జాతీయ ప్రదర్శనల కోసం ఎగ్జిబిషన్ హాల్స్, స్టార్ హోటళ్లు, మాల్స్, హాస్పిటల్స్, ఉద్యాన వనాలు, విశాలమైన పార్కింగ్ స్థలంతో కూడిన ఎయిర్ పోర్టు సిటీని 600 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మించాలి. ఎయిర్‌పోర్టు సిటీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేలా ఉండాలి’’అని జీఎంఆర్ ప్రతినిధులకు సీఎం సూచించారు.
రూ.12.28 కోట్ల ప్రభుత్వ వాటా
2016–17 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా(13%) కింద రూ.12.28 కోట్ల చెక్కును జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మల్లిఖార్జునరావు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అందించారు.
విమానాశ్రయం వరకు మెట్రో
‘‘ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణం, టర్మినల్ విస్తరణ, రెండో రన్ వే నిర్మాణానికి ప్రభుత్వపరంగా కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారుల నిర్మాణం, విస్తరణ, విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, శానిటేషన్, డ్రైనేజీ తదితర పనులు ప్రభుత్వపరంగా చేయాలి. హైదరాబాద్ మెట్రోరైలును విమానాశ్రయం వరకు పొడిగించాలి. మెట్రోరైలు విమానాశ్రయం వరకు ఉంటే, ఢిల్లీలో మాదిరి ప్రయాణికులు రైలులోనే విమానాశ్రయం చేరుకునేందుకు ప్రాధాన్యమిస్తారు’’అని సీఎం పేర్కొన్నారు. మెట్రోరైలును విమానాశ్రయం వరకు విస్తరించే పనులు వెంటనే ప్రారంభమయ్యేలా త్వరలోనే జీఎంఆర్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment