మూడేళ్లలో యాదాద్రి
* అభివృద్ధి పనులకు గవర్నర్, సీఎం శంకుస్థాపన
* చినజీయర్‌స్వామి చేతుల మీదుగా కార్యక్రమం
* రాజగోపురం, మహాప్రాకారం, ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శనివారం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామి శంకుస్థాపనలు చేశారు. తొలుత లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం రాజగోపురం, మహాప్రాకారం నిర్మాణ పనులను ప్రారంభించారు. తర్వాత పెద్దగుట్ట వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో గుట్ట అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ సతీసమేతంగా హాజరయ్యారు. యాదాద్రి అభివృద్ధి పనులు ముందుగా నిర్ణయించిన ముహూర్తమైన ఉదయం 8:35కే ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు చేశారు. అనివార్యకారణాల వలన సీఎం కేసీఆర్, గవర్నర్ ఆలస్యంగా వచ్చారు. అయితే వారు శంకుస్థాపన చేసిన ముహూర్తం కూడా చాలా బాగుందని ఆలయ అర్చకులు తెలిపారు.
రోడ్డు మార్గం ద్వారా సీఎం..
ఉదయం 11:05కు గుట్ట సమీపంలోని వడాయిగూడెం హెలిపాడ్ వద్దకు రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ చేరుకున్నారు. కొద్దిసేపటికే హెలికాప్టర్‌లో చినజీయర్‌స్వామి, మరో హెలికాప్టర్‌లో గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కడికి చేరుకున్నారు. తొలుత చినజీయర్‌స్వామితో కలిసి కేసీఆర్ గుట్టపైకి చేరుకోగా, తర్వాత నరసింహన్ చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాజగోపురం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ శిలాఫలకం వద్ద సీఎం కేసీఆర్ జ్యోతిని వెలిగించి పనులను ప్రారంభించారు. అనంతరం పెద్దగుట్ట వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని గవర్నర్ దంపతులు ఆవిష్కరించారు. చినజీయర్‌స్వామి ఆశీస్సులు, శాస్త్ర సంప్రదాయాలతో నరసింహస్వామి ఆలయం ఎంతో అభివృద్ధి అవుతుందని గవర్నర్ దంపతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం పెద్దగుట్ట నుంచి కేసీఆర్, గవర్నర్ దంపతులు, చినజీయర్‌స్వామి కొండపైకి వచ్చి.. సంగీత భవనంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడే అధికారులతో చాలాసేపు చర్చించారు. ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్ట యాదాద్రిగా రూపుదిద్దుకున్న తర్వాత ఎలా మారుతుందో అధికారులు స్క్రీన్‌పై చిత్రాలు చూపించారు. రెండు మూడేళ్లలో ఈ పనులన్నీ పూర్తికావాలని సీఎం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ సునీత, అధికారులు పాల్గొన్నారు.
సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళుతుండగా సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని రెండు సెక్యూరిటీ వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొండమడుగు గ్రామ సమీపంలో ఉదయం 10.40 సమయంలో ఈ ఘటన జరిగింది. కాన్వాయ్‌లోని ఒక బుల్లెట్‌ప్రూఫ్ స్కార్పియో దాని ముందు వెళుతున్న పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్ సుమోను ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుళ్లు జి.రఘురామ్(27), కె.పుల్లయ్య(26), చంద్రశేఖర్ (25)లకు తల, వెన్నెముక వద్ద గాయాలయ్యాయి. వారిని వెంటనే ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు.