chitti funds
-
Hyderabad: చిట్టీల పేరుతో అధిక వడ్డీ.. రెండు కోట్లతో ఉడాయించింది
సాక్షి, హస్తినాపురం: చిట్టీల పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి రెండు కోట్ల రూపాయలతో ఓ మహిళ ఉడాయించింది. దీంతో బాధితులు ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. అనురాధ కాలనీకి చెందిన కోన విజయలక్ష్మి తన స్నేహితులు , బంధువుల దగ్గర దాదాపు రెండు కోట్లరూపాయల మేరకు వసూలు చేసింది. 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోవడంతో కంగారు చెందిన బాధితులు ఆదివారం విజయలక్ష్మీ ఇంటిముందు ధర్నాకు దిగారు. విజయలక్ష్మిని తీసుకొచ్చేంతవరకు తాము ఇక్కడే ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటామని బాధిత మహిళలు తెలిపారు. దాదాపు 45 మంది వద్ద డబ్బు తీసుకుందని ఈనెల 21న నారాయణరెడ్డి, క్రిష్ణారెడ్డి, వెంకటరెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: ఓయూ క్యాంపస్‌లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్ చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ -
రూ.5.60 కోట్లకు మహిళ టోకరా
చినగంజాం: చీటీల పేరుతో ఓ మహిళ తమను మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌లోని చినగంజాం మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పలువురు బాధితులు శనివారం చినగంజాం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. సుమారు 40 మందికి పైగా బాధితులు కుటుంబ సభ్యులతో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీస్ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోపిరాల గ్రామానికి చెందిన మహిళ సుమారు రూ.5.60 కోట్ల నగదు తమకు చెల్లించాల్సి ఉందని న్యాయం చేయాలని కోరారు. సీఐ పీ సుబ్బారావు, ఎస్ఐ పీ అంకమ్మరావులు అందించిన సమాచారం ప్రకారం మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పోలకం ఝాన్సీ లక్ష్మి... 25 ఏళ్ల నుంచి గ్రామంలో చీటీపాటలు నిర్వహిస్తోంది. చీటీపాటలపై వచ్చే కమీషన్‌తో పాటు, రొక్కంగా మరి కొంత సొమ్ము వడ్డీకి తీసుకొని, వారికి వడ్డీ కడుతోంది. అయితే గత ఏడాది నుంచి వడ్డీలు చెల్లించక, అందరి చీటీ పాటలు తానే పాడుకొని సుమారు రూ.5.60 కోట్ల నగదు వసూలు చేసిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు చీటీ పాడిన లబి్ధదారులకు సైతం డబ్బులు చెల్లించక కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధితులకు ఎటువంటి తేదీ, ఇతర వివరాలు నమోదు చేయకుండా ఖాళీగా ఉన్న ప్రామిసరీ నోటుపై కేవలం సంతకాలు చేసి ఇచ్చి వారికి నమ్మకం కలిగేలా చేసింది. ఒక్కొక్క బాధితునికి సుమారు రూ.10 లక్షలకు పైగా నగదు ఇవ్వకుండా ఇంటి చుట్టూ తిప్పుకుంటోంది. కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురవుతున్న చీటీ సభ్యులు తమ నగదు గురించి అడుగగా ఆమె తమ కుమార్తెకు, కుమారునికి నగదు ఇచ్చినట్లు, వీరితో పాటు తమ బంధువులకు నగదు ఇచ్చినట్లు బాధితుల వద్ద ఒప్పుకొని వాయిదాల పద్ధతిలో బాకీ తీరుస్తానని నమ్మబలుకుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో తనకు సంబంధించిన గృహం, ఇతర ఆస్తులను బంధువుల పేరుతో రిజి్రస్టేషన్ చేయించడంతో అనుమానం వచ్చిన బాధితులు శనివారం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల గోడు విన్న ఇంకొల్లు సీఐ పీ సుబ్బారావు నిందితురాలిని విచారించిన అనంతరం కేసు నమోదు చేశామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. చదవండి: రూ. కోట్ల విలువైన భూమికి స్కెచ్.. బీజేపీ నేత అరెస్టు -
చిట్టీల పేరుతో మోసం
హుజూరాబాద్‌రూరల్: చెల్పూర్ గ్రామానికి చెందిన మోడం రవీందర్, అతని భార్య శ్రీదేవి చిట్టీల పేరుతో పలు గ్రామాల్లో అమాయక ప్రజలను మోసం చేశారు. తోకలపల్లికి చెందిన దేవేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వారు నగదుతో పారిపోతుండగా హుజూరాబాద్ టౌన్ సీఐ వాసంశెట్టి మాధవి మంగళవారం పట్టుకున్నారు. ఆమె వివరాల ప్రకారం.. రవీందర్, శ్రీదేవిలు చెల్పూర్, తోకలపల్లి, శాలపల్లి ఇందిరానగర్ గ్రామాల్లో అమాయక ప్రజల నుంచి చిట్టీల పేరుతో రూ.40 లక్షలు వసూలు చేశారు. అనంతరం తమ కుమారుడితో కలిసి నగదు తీసుకొని పారిపోతుండగా పరకాలక్రాస్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. చిట్టీల పేరుతో మోసం చేసే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితుల నుంచి వివరాలు సేకరణ.. సీఐ ఆదేశాల మేరకు చెల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎస్సై శ్రీనివాస్ బుధవారం విచారణ చేపట్టారు. బాధితులు ఆయనకు పలు వివరాలు చెప్పారు. గ్రామానికి చెందిన రవీందర్ ఎటువంటి అనుమతులు లేకుండా చిట్టీల వ్యాపారం చేసున్నాడని తెలిపారు. అతన్ని నమ్మి ఊళ్లో చాలా మంది చిట్టీలు వేశారని పేర్కొన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నేరెళ్ల మహేందర్‌గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
చీటీల పేరుతో టోపీ
కొడవలూరు, న్యూస్‌లైన్: ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించాడు. ఐదేళ్ల వ్యవధిలోనే అందరికీ నమ్మకస్తుడిగా మారాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ బిల్డప్ ఇచ్చాడు. నగదు లావాదేవీలు సక్రమంగా నిర్వర్తించడంతో ఆహా..ఓహో..అంటూ అందరూ నమ్మారు. వెనుకా..ముందూ చూసుకోకుండా లక్షల రూపాయల చీటీలు కట్టారు. అంతా అనుకున్నట్టే జరగడంతో అందరినీ ముంచి రూ.2 కోట్లతో గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించాడు. మోసపోయామని గ్రహిం చిన సుమారు 250 మంది ఇప్పుడు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు..కొడవలూరు మండలం చింతచెలికకు ఐదేళ్ల క్రితం కృష్ణారావు అనే వ్యక్తి ఓ మహిళతో కలసివచ్చి ఓ ఇంట్లో కాపురముంటున్నాడు. మొదట్లో ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపాడు. ఈ వ్యాపారంతో అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్భాటంగా, అందరితో కలివిడిగా ఉండేవాడు. అందరి వద్ద నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్వస్తి చెప్పి చీటీల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో రూ.20 వేల చీటీతో వ్యాపారం ప్రారంభించాడు. ఖాతాదారులకు చెల్లింపులు సక్రమంగా చేస్తూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. వ్యాపారాన్ని కూడా రూ.50 వేలు, లక్ష రూపాయల చీటీలకు విస్తరించాడు. ఇలా సుమారు రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నడుపుతున్నాడు. పక్కా ప్లాన్‌తోనే.. ప్రస్తుతం కృష్ణారావు రూ.లక్ష చీటీలు 8, రూ.50 వేల చీటీలు రెండు, రూ.30 వేల చీటీలు ఒకటి నడుపుతున్నాడు. వీటిలో దాదాపు 250 మంది సభ్యులుగా ఉన్నారు. ఎక్కువ లబ్ధిదారులు మహిళలే. పక్కాప్లాన్‌తో ముందుకు సాగుతున్న కృష్ణారావు కొన్ని నెలలుగా చీటీలు పాడుకున్న వారికి నగదు చెల్లింపులు నిలిపేశాడు. గట్టిగా అడిగిన వారికి స్థలాలు కొన్నందున నగదు బ్లాక్ అయిందని, త్వరలోనే చెల్లిస్తానంటూ నమ్మిస్తూ వచ్చాడు. నెలలు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో అనుమానంతో ఖాతాదారులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతనితో కలిసి ఉంటున్న మహిళను బాధితులు నిలదీయగా తనకే మీ తెలియదంటూ ఆమె సమాధానమిచ్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ లావాదేవీలకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. కృష్ణారావు ఎక్కడా స్థలాలు కొనలేదని నిర్ధారణకు వచ్చారు. రూ.2 కోట్లకు పైగా మోసపోయామని బాధితులు వాపోతున్నారు. కృష్ణారావు ఇంట్లోని పుస్తకంలో అన్ని వివరాలు ఉన్నాయని, వాటి ఆధారంగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం గ్రామంలోకి వెళ్లి విచారించాను. కృష్ణారావును నమ్మి చాలా మంది చీటీలు కట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి వద్దా రశీదులు లేవు. ఆయనేమి ప్రభుత్వ అనుమతి పొందిన వ్యాపారి కాదు. దీన్ని సివిల్ విషయంగా పరిగణించాల్సి వస్తోంది. కాని చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో వాటికి సంబంధించిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం. నిందితుడి కోసం గాలిస్తాం. నరేష్, ఎస్సై, కొడవలూరు