కొడవలూరు, న్యూస్‌లైన్: ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించాడు. ఐదేళ్ల వ్యవధిలోనే అందరికీ నమ్మకస్తుడిగా మారాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ బిల్డప్ ఇచ్చాడు. నగదు లావాదేవీలు సక్రమంగా నిర్వర్తించడంతో ఆహా..ఓహో..అంటూ అందరూ నమ్మారు. వెనుకా..ముందూ చూసుకోకుండా లక్షల రూపాయల చీటీలు కట్టారు. అంతా అనుకున్నట్టే జరగడంతో అందరినీ ముంచి రూ.2 కోట్లతో గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించాడు. మోసపోయామని గ్రహిం చిన సుమారు 250 మంది ఇప్పుడు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు..కొడవలూరు మండలం చింతచెలికకు ఐదేళ్ల క్రితం కృష్ణారావు అనే వ్యక్తి ఓ మహిళతో కలసివచ్చి ఓ ఇంట్లో కాపురముంటున్నాడు. మొదట్లో ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపాడు. ఈ వ్యాపారంతో అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్భాటంగా, అందరితో కలివిడిగా ఉండేవాడు. అందరి వద్ద నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్వస్తి చెప్పి చీటీల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో రూ.20 వేల చీటీతో వ్యాపారం ప్రారంభించాడు. ఖాతాదారులకు చెల్లింపులు సక్రమంగా చేస్తూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. వ్యాపారాన్ని కూడా రూ.50 వేలు, లక్ష రూపాయల చీటీలకు విస్తరించాడు. ఇలా సుమారు రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నడుపుతున్నాడు.
పక్కా ప్లాన్‌తోనే..
ప్రస్తుతం కృష్ణారావు రూ.లక్ష చీటీలు 8, రూ.50 వేల చీటీలు రెండు, రూ.30 వేల చీటీలు ఒకటి నడుపుతున్నాడు. వీటిలో దాదాపు 250 మంది సభ్యులుగా ఉన్నారు. ఎక్కువ లబ్ధిదారులు మహిళలే. పక్కాప్లాన్‌తో ముందుకు సాగుతున్న కృష్ణారావు కొన్ని నెలలుగా చీటీలు పాడుకున్న వారికి నగదు చెల్లింపులు నిలిపేశాడు. గట్టిగా అడిగిన వారికి స్థలాలు కొన్నందున నగదు బ్లాక్ అయిందని, త్వరలోనే చెల్లిస్తానంటూ నమ్మిస్తూ వచ్చాడు. నెలలు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో అనుమానంతో ఖాతాదారులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతనితో కలిసి ఉంటున్న మహిళను బాధితులు నిలదీయగా తనకే మీ తెలియదంటూ ఆమె సమాధానమిచ్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ లావాదేవీలకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. కృష్ణారావు ఎక్కడా స్థలాలు కొనలేదని నిర్ధారణకు వచ్చారు. రూ.2 కోట్లకు పైగా మోసపోయామని బాధితులు వాపోతున్నారు. కృష్ణారావు ఇంట్లోని పుస్తకంలో అన్ని వివరాలు ఉన్నాయని, వాటి ఆధారంగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం
గ్రామంలోకి వెళ్లి విచారించాను. కృష్ణారావును నమ్మి చాలా మంది చీటీలు కట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి వద్దా రశీదులు లేవు. ఆయనేమి ప్రభుత్వ అనుమతి పొందిన వ్యాపారి కాదు. దీన్ని సివిల్ విషయంగా పరిగణించాల్సి వస్తోంది. కాని చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో వాటికి సంబంధించిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం. నిందితుడి కోసం గాలిస్తాం.
నరేష్, ఎస్సై, కొడవలూరు
చీటీల పేరుతో టోపీ
Published Tue, Feb 11 2014 6:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement