క్రైస్తవులపై నిర్లక్ష్యం తగదు
విజయవాడ (గుణదల) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతరాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఉన్నా కేవలం ఒక సంప్రదాయానికే పెద్ద పీట వేసి రాజ్యాంగాన్ని కించపరుస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేడెట్ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐసీసీ) జాతీయ అధ్యక్షులు గేరా హానోక్ విమర్శించారు. సోమవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మతాలకు చెందిన వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పుష్కరాల పేరుతో దుర్వినియోగం చేయటమే కాకుండా ఇతర మతాలకు చెందిన వారి మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ దేశంగా పిలిచే భారతదేశంలో మత పరంగా దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం శోచనీయమన్నారు. అభివృద్ధి పేరుతో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన తారాపేట చర్చిని కూల్చేయటం ప్రభుత్వానికి తగదని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి బహిరంగ లేఖ ద్వారా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జాతీయ గౌరవ అ«ధ్యక్షులు బిషప్ జాన్ ఎస్. డి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు ఎం ఎలీయూజర్, కొలమూరి ప్రభాకర్, సలహాదారు పీఎస్ రావు, యువజన విభాగం అధ్యక్షులు అభిలాష్, నగర అధ్యక్షులు కె. ప్రభాకర్, కోశాధికారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.