అన్నీ తెలియాలంటే మాలో చేరండి
బీజేపీ ఎమ్మెల్యే చింతలతో మంత్రి ఈటెల రాజేందర్
అసెంబ్లీలో ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పద్దులపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎమెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు అధికారపక్ష సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. హోం, వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, ఎక్సైజ్, సేల్స్‌టాక్స్‌కు సం బంధించిన అంశాల గురించి చింతల పలు సందేహాలను వెలిబుచ్చగా బడ్జెట్లో ఆయా అంశాలను పొందుపరిచామని, అవి సవ్యం గానే ఉన్నాయని మంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, ఈటెల రాజేందర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సమాధానాలతో సంతృప్తిచెందని ఇతర అంశాలను ప్రస్తావించగా ఈటెల స్పందిస్తూ ‘అన్ని విషయాలు తెలియాలంటే మాలో వచ్చి చేరండి. అన్నింటినీ వివరించే అవకాశముంటుంది’ అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్‌ను విధిం చడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గుతోందని మరో సందర్భంలో చింతల పేర్కొనగా.. దీనిపై కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటూ ఏపీ గురించి చెప్పడం లేదేంటి? టీడీపీ మీ మిత్రపక్షమనా? అంటూ ప్రశ్నించారు.
దీనిపై చింతల బదులిస్తూ ‘టీడీపీ వాళ్లు దోస్తులు ..అయితే మీరు దుష్మన్లా’ అని ప్రశ్నించారు. తెలంగాణకు టీడీపీ ద్రోహం చేసిందని.. అందుకే వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెట్టించగా తెలంగాణ వద్దని లేఖ ఇచ్చిన ద్రోహులను (ఎంఐఎంను ఉద్దేశించి) భుజాల పైకి ఎత్తుకుని జీహేచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.