- అసెంబ్లీలో నిలదీసిన పీలేరు ఎమ్మెల్యే చింతల
పీలేరు: మంచినీటి ఎద్దడితో జనం అల్లాడుతున్నా ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు సైతం నిధులు ఇవ్వకపోవడమేంటని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాగునీటి సమస్యపై చింతల ప్రభుత్వాన్ని నిలదీశారు. పీలేరు నియోజకవర్గంలో వంద గ్రామాలకు పైగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయని, కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా స్పందించడం లేదని ఆరోపించారు. సమస్య ఉన్న గ్రామాల్లో అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు.
నియోజకవర్గంలో ప్రజలు తాగునీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పీలేరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించడం కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులతో గార్గేయ ప్రాజెక్టు నుంచి పీలేరు సమ్మర్ స్టోరేజ్‌కి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించాల్సి ఉందని అన్నారు. సమస్య తీవ్రతను గుర్తించి సత్వరం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.