గుట్కా వ్యాపారానికి గుడ్‌బై చెప్పాల్సిందే!
విజయవాడ సిటీ : నగర పోలీసులు గుట్కా మాఫియాను తరిమి కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నగరంలో పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం చేసిన మాఫియా నేతలను కోర్టు మెట్లు ఎక్కించిన పోలీసులు, విచారణలో భాగంగా పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇదే సమయంలో గుట్కా మాఫియాకు సహకరించిన వారిపై కూడా ప్రత్యేక దృష్టిసారించినట్టు విశ్వసనీయ సమాచారం. నగరంలో గుట్కా వ్యాపారాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలంటూ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వీరిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించరాదనేది సీపీ నిర్ణయం. ఈ క్రమంలోనే తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే వీరిపై ఉక్కుపాదం మోపారు. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. టన్నుల కొద్దీ గుట్కా, ఖైనీ నిల్వలను స్వాధీనం చేసుకొని పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గుట్కా హోల్‌సేల్ వ్యాపారులైన చంద్రశేఖర్, కామేశ్వరరావుపై కేసులు నమోదు చేశారు. వీరు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందడంతో పూర్తి స్థాయి వివరాల సేకరణకు రెండుమార్లు పోలీసు విచారణకు రప్పించారు. తిరిగి మరోసారి విచారణకు పిలిచే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది.
గుట్కా మాయంపై దృష్టి
మాఫియా ఆర్థిక మూలాలను దెబ్చకొట్టినా వ్యాపారం మానుకోక పోవడంపై పోలీసు కమిషనర్ సవాంగ్ ఆరా తీయగా పట్టుబడిన సరుకులో కొంత ఫుడ్ ఇన్స్పెక్టర్ల ద్వారా వీరికి చేరుతున్నట్టు గుర్తించారు. నిర్దారణ కోసం ఆదేశించగా టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారణ జరిపి వాస్తవమేనని తేల్చారు. ఇటీవల పోలీసు విచారణకు వచ్చిన గుట్కా విక్రేతలు కూడా దీనిని ధృవీకరించినట్టు తెలిసింది. దీంతో ఆ కేసుపై మరోసారి దృష్టిసారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పట్టుబడిన సరుకును తిరిగి వారికి చేర్చడం వెనుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు.