Civil disputes
-
మ్యుటేషన్ మాయాజాలం
సాక్షి, అమరావతి: వారసత్వ భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల లొసుగులతో దశాబ్దాలుగా ఎడతెగని వివాదాలతోపాటు ఖజానాకు భారీగా గండి పడుతోంది. రిజిస్టర్ డీడ్లు లేకుండానే రెవెన్యూ అధికారులు ఎడాపెడా మ్యుటేషన్లు చేసేస్తుండటంతో ఏటా దాదాపు రూ.800కోట్ల వరకు ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. మరోవైపు సివిల్ వివాదాలు పెరుగుతుండటంతో సామాన్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. రిజిస్టర్డ్ డీడ్ తప్పనిసరి.. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిని ఆ వారసుల పేరిట మ్యుటేషన్ చేయాలంటే పార్టీషన్ డీడ్‌ను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని ‘రిజిస్ట్రేషన్ చట్టం–1986’ స్పష్టం చేస్తోంది. ఒక వ్యవసాయ భూమి యజమాని మరణిస్తే ఆయన/ఆమె ఆస్తి వారసులకు చెందుతుంది. ఆ వ్యవసాయ భూములను వారు భాగాలుగా చేసుకుని తమ పేరిట మ్యుటేషన్ చేసుకుంటారు. అందుకోసం ముందుగా వారసులు ఆ ఆస్తిని పంపకాలు చేసుకునే ఒప్పందాన్ని అంటే తగిన స్టాంపు డ్యూటీ చెల్లించి పార్టీషన్ డీడ్‌ను రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ ఉంటేనే అందులో పేర్కొన్న మేరకు ఆ వ్యవసాయ భూములను వారసుల పేరిట తహసీల్దార్లు మ్యుటేషన్ చేయాలి. సర్క్యులర్ సాకుతో చట్ట విరుద్ధంగా... రాష్ట్రంలో దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు పార్టీషన్ డీడ్ లేకుండానే వ్యవసాయ భూములను మ్యుటేషన్ చేసేస్తున్నారు. 1989లో సర్వే, సెటిల్మెంట్స్ కమిషనర్ ఇచ్చిన ఓ సర్క్యులర్‌ను దీనికి సాకుగా చూపుతున్నారు. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ లేకపోయినా సరే తగిన స్టాంపు డ్యూటీ చెల్లిస్తే మ్యుటేషన్ చేయవచ్చని అప్పటి కమిషనర్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. పార్టీషన్ డీడ్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం చెబుతుండగా అందుకు విరుద్ధంగా అప్పటి కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్‌కు విలువ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. చట్టం, సర్క్యులర్‌లో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నప్పుడు చట్టం చెప్పిందే పాటించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఆ సర్క్యులర్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది. పోనీ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా స్టాంపు డ్యూటీని కట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం ఆ సర్క్యులర్‌ను సాకుగా చూపిస్తున్నారు కానీ అందులో అంశాన్ని తహసీల్దార్లు పాటించడం లేదన్నది స్పష్టమవుతోంది. ఏటా రూ.800 కోట్ల నష్టం... డీఆర్ఐ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యుటేషన్ల తీరును పరిశీలించగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు రాష్ట్రంలో 8,55,937 మ్యుటేషన్లు జరగ్గా కేవలం 68,239 మ్యుటేషన్లకే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు ఉండటం గమనార్హం. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7,87,698 మ్యుటేషన్లు జరిగాయి. దీంతో స్టాంపు డ్యూటీ రూపంలో రావాల్సిన దాదాపు రూ.800 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఒక్క ఏడాదిలోనేఇంద నష్టం వాటిల్లిందంటే 30 ఏళ్లుగా ఎంత ఆదాయాన్ని కోల్పోయిందో ఊహకే అందడం లేదు. దీనిపై డీఆర్ఐ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పెరుగుతున్న న్యాయ వివాదాలు రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు లేకుండా ఎడాపెడా మ్యుటేషన్లు చేస్తుండటంతో సివిల్ వివాదాలు పెరుగుతున్నాయి. వారసుల మధ్య తదనంతర కాలంలో విభేదాలు తలెత్తుతుండటంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల తప్పుడు పత్రాలతో, వారసులందరి సమ్మతితో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే సివిల్ వివాదాలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు మ్యుటేషన్ల వివరాలు -
సివిల్ వివాదాల్లో ఖాకీల జోక్యం!
సాక్షి, హైదరాబాద్ : సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చి ఫిర్యాదుదారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ వారంలో ఈ విధమైన రెండు ఘటనల్లో రాష్ట్ర మానవహక్కుల సంఘం (ఎస్హెచ్ఆర్సీ) కలగజేసుకుందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా నాగారం ఎస్సై ఓ భూవివాదంలో అకారణం గా దళితులపై దాడి చేశారని, చంపుతానని బెదిరించారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర మానవ హక్కుల సంఘం దీన్ని సుమోటాగా స్వీకరించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీ భాస్కరన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన ఎస్పీ సదరు ఎస్సైని వీఆర్‌కు పంపారు. గతంలోనూ ఈ అధికారిపై ఇలాంటి ఆరోపణలున్నా యి. అదే జిల్లాలోని మునగాల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. తన భూమిని ఆక్రమిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోకపోగా దూషించి వెనక్కి పంపడంతో బాధితుడు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపించాలని హెచ్చార్సీ సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. భూపంచాయితీలంటే ఎంత ఇష్టమో! రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులు ఎంతమందిని బలి తీసుకుంటున్నా యో చూస్తున్నాం. ఈ క్రమంలో తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో బాధితులు ముందుగా పోలీసులనే ఆశ్రయియిస్తున్నారు. దీన్ని కొందరు పోలీసులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వాస్తవానికి సివిల్ కేసులు పోలీసుల పరిధిలోనివి కావు. కానీ, ఇలాంటి వివాదాలపై పోలీసులు ఠాణాల్లోనే పంచాయితీలు పెట్టి రెండు వర్గాల నుంచి డబ్బులు దం డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులు ఎస్పీలు, మానవ హక్కుల సం ఘాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ఎవరో ఒకరి పక్షం వహించడం వల్ల ఒకవర్గం మరోవర్గంపై దాడులు, బెదిరింపులకు దిగుతోంది. వీరంతా పేదలు, బలహీనులు కావడంతో భయపడి చాలామంది రాజీకే మొగ్గు చూపుతున్నారు. అందుకే, ఇలాంటి విషయాలు తక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. డీజీపీ ఆదేశాలు బేఖాతరేనా? సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని, స్టేషన్ల చుట్టూ పదే పదే బాధితులను తిప్పించుకోవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి పలుమార్లు హెచ్చరించారు. ఇలాంటి వైఖరి హత్యలు, అల్లర్లు, శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుందని చెప్పినా చాలామంది గ్రామీణ పోలీసుల తీరు లో మార్పు రావట్లేదు. విచారణలో తప్పు రుజువై వేటు పడుతున్నా కొందరు కిందిస్థా యి పోలీసు అధికారుల తీరు మారడంలేదు. కొంతకాలం తరువాత పోస్టింగ్ వస్తుందన్న ధీమాతో బరితెగిస్తున్నారు. -
సివిల్ వివాదాల్లో మీ జోక్యం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు ఆక్షేపించింది. కుటుంబ, భూవివాదాల్లో జోక్యం మంచిది కాదని హితవు పలికింది. కుటుంబ వివాదంలో జోక్యం చేసుకున్న సిద్దిపేట జిల్లా తొగుట పోలీసులకు, ఓ భూవివాదంలో జోక్యం చేసుకున్న రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని సర్వేనంబర్ 1008తో పాటు వివిధ సర్వే నంబర్లలో ఉన్న దాదాపు 71 ఎకరాల భూమి వివాదంలో హయత్‌నగర్ పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ తౌరుస్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు స్టేషన్‌కు పిలిచి, తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని బెదిరిస్తున్నారని, స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. తమ కుటుంబ వివాదం లో కూడా తొగుట పోలీసులు జోక్యం చేసుకుంటూ బెదిరిస్తున్నారంటూ ఎండీ సాహెదుల్లా అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ చౌహాన్ విచారణ జరిపారు. పోలీసులు ఇలా సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటుండటంపై తరచూ పిటిషన్లు దాఖలవుతున్నాయని, వీటిని బట్టి పోలీసులు సివిల్ వివాదాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుం టున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. -
సివిల్ వివాదాల్లో మీ జోక్యమేంటి?
సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం రోజురోజుకు ఎక్కువవుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ బాధితులపై పోలీసులు ఒత్తిళ్లు తీసుకురావడం సర్వసాధారణంగా మారిందని, దీనిపై హైకోర్టులో వరదలా పిటిషన్లు దాఖలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసులపై సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నట్లు ప్రాథమికంగా రుజువు కావడంతో వారి వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని బంజారాహిల్స్ ఎస్హెచ్ఓ, సబ్ ఇన్స్పెక్టర్ హరీందర్లను ఆదేశించింది. ఈ కేసులో పిటిషనర్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఏసీపీ స్థాయికి తక్కువ కాని అధికారితో దర్యాప్తు చేయించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాలున్నాయి.. చార్టర్డ్ అకౌంటెంట్ ఎర్రవల్లి దీక్షిత్‌రావుతో తలెత్తిన వివాదంలో బంజారాహిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ హరీందర్ తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, దీక్షిత్‌రావుతో వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా కమిషనర్‌ను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సదాశివుని మధులత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జి.పురుషోత్తంరెడ్డి వాదనలు వినిపిస్తూ, మధులతపై దీక్షిత్‌రావు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు, పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మాత్రం సివిల్ వివాదం అంటూ పక్కన పెట్టేశారని ఆరోపించారు. దీక్షిత్‌రావు తన పలుకుబడితో ఎస్ఐ హరీందర్‌ను తన వైపునకు తిప్పుకున్నారని, ఆయన చేత పిటిషనర్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. దీక్షిత్‌రావుతో వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ పిటిషనర్‌ను హరీందర్ తీవ్ర ఒత్తిడికి గురి చేసి, ఓ లేఖ రాయించుకున్నారని కోర్టుకు నివేదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్ వివాదాల్లో జోక్యం వద్దని పదే పదే చెబుతున్నా పోలీసులు పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. సివిల్, వైవాహిక వివాదాల్లో జోక్యం వద్దని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సర్క్యులర్లు జారీ చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని వివరించారు. చాలా సందర్భాల్లో బాధితులు తగిన ఆధారాలు చూపలేకపోతున్నారని, అయితే ప్రస్తుత కేసులో మాత్రం హరీందర్ తదితరుల జోక్యానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తెలిపారు. -
ఆ వివాదాలు తేలకుండా విడాకులివ్వద్దు
- ఎన్ఆర్ఐ భర్తకు కుటుంబ న్యాయస్థానం ఆదేశం - అమెరికాలో విడాకుల కేసు విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ఉంటున్న బిడ్డ సంరక్షణ, భార్యతో ఉన్న ఆస్తుల పంపకం వివాదాలు తేలకుండా అమెరికాలో విడాకుల కేసును కొనసాగించవద్దని ఓ ఎన్ఆర్ఐని హైదరాబాద్ నగర కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 31 వరకు విడాకులు కేసు విచారణను ఆపాలంటూ న్యాయమూర్తి తిరుపతయ్య సదరు ఎన్ఆర్ఐని ఆదేశిస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతోపాటు భార్య, పిల్లలను భారత్‌కు పంపించి అమెరికా న్యాయస్థానం ద్వారా విడాకులు పొందాలని ప్రయత్నించిన ఎన్ఆర్ఐ కొమ్మినేని సిద్దిజ్ఞానేశ్వరప్రసాద్కు ఇక్కడి న్యాయస్థానం ఆదేశాలు ప్రతిబంధకంగా మారాయి. ఇక్కడి కేసులు, సివిల్ వివాదాలు తేలకుండా అమెరికాలో తన భర్త ప్రసాద్ వేసిన విడాకుల కేసు విచారించకుండా ఆదేశించాలని కోరుతూ సోని ఓలేటి కొమ్మినేని అనే మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ సంప్రదాయం ప్రకారం భారత్‌లో పెళ్లైందని, ఇక్కడ క్రిమినల్, సివిల్ వివాదాలు పెండింగ్‌లో ఉండగా ఏకపక్షంగా అమెరికాలో విడాకుల కేసు కొనసాగితే సోనికి అన్యాయం జరుగుతుందని ఆమె తరఫు న్యాయవాది వై.బాలాజీ కోర్టుకు నివేదించారు. 2013 డిసెంబర్ 6న తిరుపతిలో సోనీని ప్రసాద్ వివాహం చేసుకున్నారని, అనంతరం కోటి రూపాయలు కట్నం తేవాలంటూ ఆమెను వేధింపులకు గురిచేశారని తెలిపారు. కాన్పు ఖర్చు తేవాలని వేధింపులు అమెరికా వెళ్లేందుకు విమాన ఖర్చుల కోసం రూ.3 లక్షలు తీసుకొని సోనీని అమెరికా తీసుకెళ్లార ని న్యాయవాది వివరించారు. అమెరికాలో ఉన్న సమయంలో ఓ సారి హత్యాయత్నంతోపాటు కాన్పు ఖర్చునూ పుట్టింటి నుంచి తేవాలని వేధించే వారన్నారు. 2015 నవంబర్ 15న నెలల బాబుతో భార్యను భారత్‌లో వదిలి, ఆమె పాస్‌పోర్టు లాక్కొని ప్రసాద్ అమెరికా వెళ్లిపోయాడని పేర్కొ న్నారు. ఈ క్రమంలోనే ప్రసాద్ అమెరికాలోని టెక్సాస్ డెన్టౌన్ కౌంటీ జిల్లా కోర్టులో విడాకుల కేసు దాఖలు చేశారన్నారు. సమన్లు అందుకున్న సోని తమ మధ్య వివాదాలు తేలేవరకూ విడాకుల కేసు విచారించవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. అయితే ఆ వివాదాలను పరిష్కరించే పరిధి తమకు లేదని, విడాకుల కేసును మాత్రమే విచారించే అధికారం తమకుందని అక్కడి కోర్టు స్పష్టం చేసింది. అక్కడి విడాకులు కేసులో ముందుకు వెళ్లకుండా ప్రసాద్‌ను ఆదేశించాలని కోరుతూ సోని కుటుంబ కోర్టును ఆశ్రయించింది.