సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం రోజురోజుకు ఎక్కువవుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ బాధితులపై పోలీసులు ఒత్తిళ్లు తీసుకురావడం సర్వసాధారణంగా మారిందని, దీనిపై హైకోర్టులో వరదలా పిటిషన్లు దాఖలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసులపై సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నట్లు ప్రాథమికంగా రుజువు కావడంతో వారి వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని బంజారాహిల్స్ ఎస్‌హెచ్‌ఓ, సబ్ ఇన్‌స్పెక్టర్ హరీందర్‌లను ఆదేశించింది. ఈ కేసులో పిటిషనర్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఏసీపీ స్థాయికి తక్కువ కాని అధికారితో దర్యాప్తు చేయించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రాథమిక ఆధారాలున్నాయి..
చార్టర్డ్ అకౌంటెంట్ ఎర్రవల్లి దీక్షిత్‌రావుతో తలెత్తిన వివాదంలో బంజారాహిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ హరీందర్ తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, దీక్షిత్‌రావుతో వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా కమిషనర్‌ను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సదాశివుని మధులత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జి.పురుషోత్తంరెడ్డి వాదనలు వినిపిస్తూ, మధులతపై దీక్షిత్‌రావు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు, పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మాత్రం సివిల్ వివాదం అంటూ పక్కన పెట్టేశారని ఆరోపించారు.
దీక్షిత్‌రావు తన పలుకుబడితో ఎస్‌ఐ హరీందర్‌ను తన వైపునకు తిప్పుకున్నారని, ఆయన చేత పిటిషనర్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. దీక్షిత్‌రావుతో వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ పిటిషనర్‌ను హరీందర్ తీవ్ర ఒత్తిడికి గురి చేసి, ఓ లేఖ రాయించుకున్నారని కోర్టుకు నివేదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్ వివాదాల్లో జోక్యం వద్దని పదే పదే చెబుతున్నా పోలీసులు పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. సివిల్, వైవాహిక వివాదాల్లో జోక్యం వద్దని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సర్క్యులర్లు జారీ చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని వివరించారు. చాలా సందర్భాల్లో బాధితులు తగిన ఆధారాలు చూపలేకపోతున్నారని, అయితే ప్రస్తుత కేసులో మాత్రం హరీందర్ తదితరుల జోక్యానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తెలిపారు.
సివిల్ వివాదాల్లో మీ జోక్యమేంటి?
Published Sat, Dec 2 2017 4:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment