పౌర అణు సహకారం వేగవంతం
భారత్, రష్యాల ప్రతిన
* రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ చర్చలు
* చైనా అధ్యక్షుడితోనూ భేటీ
* భారత రైల్వేల్లో రష్యా నిధులు
ఉఫా(రష్యా): ద్వైపాక్షిక పౌర అణుశక్తి రంగంలో సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. అలాగే, ఇరుదేశాల వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రతినబూనాయి.
8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం రష్యా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై వారిరువురు సమగ్ర సమీక్ష జరిపారని భారత విదేశాంగ శాఖకార్యదర్శి ఎస్ జైశంకర్ వెల్లడించారు. పుతిన్‌తో చర్చల సందర్భంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ)లో భారతకు పూర్తి స్థాయి సభ్యత్వం విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు.
చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్న ఎస్సీఓలో భారత్, పాకిస్తాన్లకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని ప్రస్తుత ఎస్సీఓ సమావేశాల్లో ఆమోదించనున్నారు. ఆ సంస్థలో భారత్ సభ్యత్వ ప్రక్రియ వచ్చే సంవత్సరంలోగా పూర్తవుతుంది. ఈ విషయంలో పుతిన్ అందించిన సహకారానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీఓలో భారత్ సభ్యత్వం గురించి పుతిన్ స్వయంగా ఫోన్‌చేసి చెప్పిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అలాగే, తనకు రష్యాలో లభించిన స్వాగతం, ఆతిథ్యానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఏటా జరిగే ద్వైపాక్షిక శిఖరాగ్ర చర్చల కోసం ఈ సంవత్సరం చివరలో మరోసారి రష్యా రానున్నానని మోదీ వెల్లడించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రష్యాలో జరుపుకోవడాన్ని మోదీ స్వాగతించారు. రష్యాలోని అన్ని నగరాల్లో ఆ కార్యక్రమం జరగడం ముదావహమన్నారు. దీనిపై స్పందిస్తూ.. ‘నాకు యోగా చేయడం రాదు. మీరంతా చేస్తున్నప్పుడు చూస్తే చాలా కష్టమనిపించింది. అందుకే నేను ప్రయత్నించలేదు’ అని మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడైన పుతిన్ వ్యాఖ్యానించారు.
భారత్‌లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రష్యా పాలుపంచుకునే అవకాశముంది. కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా నిధులు అందించే ప్రతిపాదన ఉందని, దీనిపై భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని రష్యా రైల్వేస్ చీఫ్ వ్లాదిమిర్ యకునిన్ వెల్లడించారు. పుతిన్‌లో చర్చల అనంతరం.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడానికి సంబంధించి పాక్‌పై చర్య తీసుకోవాలన్న భారత్ ప్రతిపాదనను ఐరాసలో చైనా అడ్డుకోవడాన్ని జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా మోదీ నిరసించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా చైనా నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్‌పైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సంవత్సరం వ్యవధిలో మనం 5 సార్లు కలుసుకోవడం భారత్, చైనాల అనుబంధాన్ని చాటుతుందని భారత ప్రధాని చైనా అధ్యక్షుడితో వ్యాఖ్యానించారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. ఎస్సీఓ సదస్సు సందర్భంగా జులై 10న భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌లు ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం. అయితే, ఆ సమావేశం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. నవంబర్‌లో కఠ్మాండులో జరినిన సార్క్ సదస్సులో కలిసినప్పటికీ.. వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు.
సైనిక కూటమి బ్రిక్స్ ఉద్దేశం కాదు
సైనిక, రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడం బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల ఉద్దేశం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేసి, పాశ్చాత్య దేశాల అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలున్న ఆ దేశాలన్నీ కలిసి.. అమెరికా డాలర్ ఆధారిత ద్రవ్య వ్యవస్థను మార్చాలనుకుంటున్నాయన్నారు. ఐరాస, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల వద్ద తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కలసికట్టుగా కృషిచేస్తాయని మీడియాతో అన్నారు.