లక్ష జనాభాకు 96 మంది పోలీసులే
ఉండాల్సింది కనిష్టంగా 125 మంది
కేటాయించిన పోస్టుల్లో 30 వేలకు పైగా ఖాళీనే..
మహిళా ఫోర్స్ విషయంలో మరీ ఘోరం
విభజన లెక్కల నేపథ్యంలో వెలుగులోకి
మనకన్నా కర్ణాటక, తమిళనాడులే మిన్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా పోలీసు విభాగం పంపకాల కోసం తీస్తున్న లెక్కలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. కేటాయింపుల ప్రకారం రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు కనిష్టంగా 125 మంది సివిల్ పోలీసులు ఉండాలి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాని ప్రకారం కేవలం 96 మందే ఉన్నారు. రాష్ట్ర పోలీసులోని అన్ని విభాగాలకు కలిపి కేటాయించిన పోస్టుల సంఖ్య 1,29,225 కాగా, అందుబాటులో ఉన్నది మాత్రం 96,978 మాత్రమే. మహిళా పోలీసుల అంశంలో పొరుగు రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఊహించని పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీస అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
665 మందికి కచ్చితంగా ఒకరుండాలి...
నిబంధనలు, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి 665 మంది జనాభాకు ఒక పోలీసు ఉండాలి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం ప్రతి 886 మందికీ ఒకరు మాత్రమే ఉంటున్నారు. ఫలితంగా శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. గడిచిన కొన్నేళ్లుగా పోలీసు విభాగంలో పదవీ విమరణలు చేస్తున్న స్థాయిలో ఎంపికలు జరగకపోవడంతో కేటాయించిన పోస్టుల్లోనూ అనేకం ఖాళీగా ఉంటున్నాయి. ఈ కారణంగానే అవసరమైన స్థాయిలో పోలీసులు అందుబాటులో లేరు. ఉన్నతాధికారులు, పర్యవేక్షణ అధికారుల కంటే క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగులైన కానిస్టేబుల్ పోస్టుల్లోనే కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరత నేపథ్యంలో మార్గదర్శకాల ప్రకారం ఓ దర్యాప్తు అధికారి ఏడాదికి గరిష్టంగా 40 కేసుల్ని మాత్రమే దర్యాప్తు చేయాల్సి ఉండగా... ఇప్పుడు ఒక్కోక్కరూ 150కి పైగా కేసుల దర్యాప్తు చేస్తున్నారు. దీని ప్రభావం నాణ్యతపై పడి శిక్షలు పడే కేసుల సంఖ్య పడిపోతోంది.
ఎస్ఐ స్థాయిలోనూ తీవ్ర కొరత
పోలీసింగ్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా, దర్యాప్తు తదితర అంశాలు ప్రాథమికమైనవి. ఈ విధులు నిర్వర్తించడంలో క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులైన, జిల్లాల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఎస్ఐల పాత్ర చాలా కీలకం. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐల లేమి తీవ్ర సమస్యగా మారింది. కొన్నేళ్ల కిందట కేటాయించిన సిబ్బందిలో దాదాపు 24 శాతం పోస్టులు ఖాళీగా ఉండిపోవడంతో మూడు షిప్టుల్లో (8 గంటల చొప్పున) పనిచేయాల్సిన సిబ్బంది రెండు షిఫ్టుల్లో (12 గంటల చొప్పున) పని చేస్తున్నారు. దీంతో పని భారం పెరిగి, పనిలో నాణ్యత కొరవడుతోంది. ఫలితంగా సిబ్బంది ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కానిస్టేబుల్ స్థాయిలోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. స్వచ్ఛంద సేవగా పరిగణించే హోంగార్డులు, మాజీ సైనికాధికారుల్ని ఎంపిక చేసుకునే స్పెషల్ పోలీసు ఆఫీసర్లు (ఎస్పీఓ)లతోనే చాలా విభాగాల్లో పనులు చక్కబెడుతున్నారు. వీరిని కేవలం బందోబస్తు, భద్రతా విధులకు మాత్రమే వాడాల్సి ఉండటంతో అసలు సమస్య మాత్రం తీరట్లేదు.
తీసికట్టుగా మహిళా సిబ్బంది...
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మహిళలే ఉంటున్నారు. అయితే వీరికి రక్షణ, సహాయ సహకారాల కోసమంటే ఏర్పాటు చేసిన మహిళా ఠాణాలు, సిబ్బంది మాత్రం ఎందుకూ కొరగాని సంఖ్యలో ఉంటున్నారు. ఉద్యమాలతో పాటు నిరసన కార్యక్రమాల్లోనూ మహిళలు పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారు. వీరిని అదుపు చేయడంతో పాటు వివిధ నేరాల్లో అరెస్టు అయిన మహిళల్ని విచారించడానికి, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి, భద్రతా ఏర్పాట్లలో భాగంగా మహిళల్ని సోదాలు, తనిఖీలు చేయడానికీ కచ్చితంగా మహిళా పోలీసులు అవసరం. వీరు అవసరమైన స్థాయిలో లేకపోవడంతో అనేక సందర్భాల్లో అపశృతులు చోటు చేసుకున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో 196 మహిళా పోలీసుస్టేషన్లు ఉండగా... మన రాష్ట్రంలో ఆ సంఖ్య కేవలం 32కు పరిమితమైంది. అక్కడ ప్రత్యేకించి మహిళా బెటాలియన్, కమాండో ఫోర్స్ ఉండగా... ఇక్కడ ఈ అంశం కేవలం ప్రతిపాదనలు మాత్రమే పరిమితమైంది.
ఖాళీలు నింపాలి, సంఖ్యను పెంచాలి
అరకొర సంఖ్యలో ఉన్న సిబ్బందితో పని భారం మొత్తం ఉన్న వారిపైనే పడుతోంది. పగలురాత్రి డ్యూటీలు చేస్తుండటంతో పోలీసులు అనేక శారీరక రుగ్మతలు, మానసిక ఒత్తిడి బారినపడి తీవ్రమైన దుష్ఫభ్రావాలు చవిచూస్తున్నారు. దీని ప్రభావం కుటుంబంపైన కూడా ఉంటోంది. ప్రతి 500 జనాభా ఒక పోలీసు ఉండాలన్నది పోలీసు సంస్కరణలు చెప్పే అంశాల్లో కీలకమైంది. ఏ స్థాయిలోనూ ఇది అమలు కావట్లేదు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీఐపీ బందోబస్తు, ఇతర డ్యూటీలపై సిబ్బంది వెళ్లిపోగా.. ఆ ప్రాంతంలో జరగరానిది జరిగితే కనీసం నలుగురు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి. ఇవి మారాలంటే తక్షణం ఖాళీలు నింపాలి. పోలీసు సిబ్బంది సంఖ్యనూ మరో లక్ష పెంచాలి. దర్యాప్తు, బందోబస్తు విభాగాలను వేరు చేయాలి.
- గోపిరెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు