civil rights groups
-
పోలీసులా.. చింతమనేని ఏజెంట్లా?
పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్): లా అండ్ ఆర్డర్ అమలులో తప్పు చేసిన చింతమనేని ప్రభాకర్‌ను వదిలేసి వెలుగులోకి తీసుకు వచ్చిన కత్తుల రవికుమార్‌జైన్‌ను అరెస్ట్ చేయడం ఏమిటని? పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఇది పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేయటమే అన్నారు. పోలీసులు కత్తుల రవిపై పెట్టిన కేసును తక్షణం ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను, వెనుకబడిన వర్గాల వారిని దూషించడం, అవమానించడం, కొట్టడం పరిపాటిగా మారిపోతోందని పేర్కొన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం మానేసి బాధితులపైన, వెలుగులోకి తీసుకు వచ్చిన వారిపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం అని వివరించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని, చట్టం తనపని తాను చేసుకు పోతుంది అంటే అధికారానికి దాసోహామనటమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ఆర్థిక వెనుకబాటు తనం, నిస్సహాయతలను ఆసరా చేసుకుని ప్రభుత్వ విప్‌గా ఉన్న వ్యక్తి దళితులను చులకనగా, అవమానకరంగా మాట్లాడటం, ప్రవర్తించటం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కటమేనన్నారు. ఎమ్మెల్యే చింతమనేనిని అన్ని విధాలుగా కాపాడుతున్న ప్రభుత్వాధినేత చంద్రబాబు కూడా దోషే అవుతారన్నారు. తక్షణం చింతమనేనిని అరెస్టు చేయాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదులు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దళితులను అవమానించే ఇలాంటి వారందరికీ తగిన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు. -
ప్రజాసంఘాల నాయకుల నిర్బంధం దుర్మార్గం
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు, నిర్వాసితులు, రాజకీయ ఖైదీల కోసం పనిచేస్తున్న వారిని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పౌరహక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి ఆరోపించారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6న పూణె పోలీసులు సీఆర్పీపీ జాతీయ కార్యదర్శి రోనావిల్సన్ను ఢిల్లీలో ఐఏపీఎల్ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, దళిత్నేత సుధీర్ దావ్లే, విస్తాపన వ్యతిరేక ఉద్యమ కారుడు మహేశ్ రావత్‌లను అరెస్టు చేసి ఉపా చట్టం కింద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీరిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబరు 31న టి కోరెగాం సంఘటనల నేపథ్యంలో గత ఏప్రిల్ 17న సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్దావ్లే ఇళ్లపై పూణె పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేసి దస్త్రాలు, సీడీలు, కంప్యూటర్లు సీజ్ చేశారని తెలిపారు. వీటిలో ప్రధానమంత్రి మోదీని హత్య చేయడానికి కుట్ర ఉందని, వాటిలో విరసం నేత వరవరరావు పేరు ఉందని పోలీసులు పేర్కొనడాన్ని ఖండించారు. ఇది అవాస్తవమని, ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు, నిర్వాసితులు, రాజకీయ ఖైదీల కోసం పనిచేస్తున్న వారిని అణచివేసే కుట్రలో భాగమేనన్నారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం నేత పీవీ రమణ, జయంత్ రఘురాం, హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి వీఎస్ కృష్ణ, కె.పద్మ, బాలకృష్ణ, ఇఫ్టూ ప్రతినిధి మల్లన్న, ఎస్వి.రమణ, అన్నపూర్ణ, లలిత, పద్మ, కె.ఎస్.చలం పాల్గొన్నారు. -
ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ - ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పౌరహక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు పూర్తి అయ్యేవరకు మావోయిస్టుల మృతదేహాలను సరైన పద్దతిలో భద్రపరిచేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం జరపాలని కోరింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలంది. పౌరహక్కుల సంఘం పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం విచారణకు చేపట్టనున్నట్టు సమాచారం. కాగా సరిహద్దులోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట- ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌తో పాటు మరో నేత మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు. -
ఇంకా ఎంతమంది?
► మళ్లీ ఎన్కౌంటర్ పేరుతో రెండు శవాల వెలికితీత ► ఈసారి కాల్పుల ఘటన విశాఖ మన్యంలో.. ► మొత్తం 30కి చేరిన మావోల మృతుల సంఖ్య ► 40 మంది మృతదేహాలను లెక్కతేలుస్తారన్న వాదనలు తెరపైకి ► పౌరహక్కుల సంఘాల భయాందోళన సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కూంబింగ్ కొనసాగుతోంది.. ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చు.. అన్న పోలీసు అధికారుల మాటలు నిజం చేస్తూ ఏవోబీలో గురువారం ఉదయం మరో రెండు మావోల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. దీంతో మొత్తంగా మావోల మృతుల సంఖ్య 30కి చేరింది. ఎనిమిదేళ్ల కిందట బలిమెలలో 38 మంది పోలీసులను బలిగొన్న ఘటనకు ప్రతీకారంగా ఇప్పుడు ఆ సంఖ్యకు ఒక్కటైనా మించేలా 39, 40 మావోల మృతదేహాలను లెక్క తేలుస్తారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగి 24 మంది మావోలు మృతి చెందారని పోలీసులు చెప్పినప్పుడు ఒకింత వాస్తవంగానే అనిపించినా.. మంగళవారం నలుగురు మావోల మృతదేహాలను చూపించి మళ్లీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పడంపై అనుమానాలు రేకెత్తాయి. తాజాగా గురువారం ఉదయం విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం సిర్లిమెట్ట వద్ద మరో ఇద్దరిని ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టామని పోలీసులు చెబుతుండటంపై మొత్తం ఎన్కౌంటర్ ఘటనలపైనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అనుమానాలెన్నో... యాదృచ్ఛికంగా మూడు ఎన్కౌంటర్లూ తెల్లవారుజామునే చోటుచేసుకున్నాయని చెప్పడం, ముందుగా మావోలు ఫైరింగ్ చేయడంతోనే పోలీసులు కాల్పులు జరుపుతున్నారని అధికారులు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చెబుతున్నట్టు సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోలు, లేదా గాయాలపాలైన మావోలు ఇన్ని రోజుల పాటు ఇంకా అక్కడే ఎలా ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. లొంగుబాట్లు, అదుపులోకి తీసుకునే ప్రస్తావనలే లేకుండా వరుసపెట్టి మావోలను ఎన్కౌంటర్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. సోమవారం కటాఫ్ ఏరియాలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ సమావేశానికి దాదాపు 40 నుంచి 50 మంది దళ సభ్యులు హాజరయ్యేందుకు వచ్చారని అంచనా. ఈ నేపథ్యంలో గాయాలపాలైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కీలక సమాచారాలు రాబట్టి రోజుకో ఎన్కౌంటర్ పేరిట మావోలను అంతమొందిస్తున్నారని పౌరహక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వ్యూహాత్మకంగా మృతదేహాల తరలింపు.. మృతదేహాల తరలింపులోనూ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రామగూడ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ మృతు ల్లో ఎక్కువమంది ఆంధ్ర, తెలంగాణ జిల్లాలకు చెందినవారే ఉన్నారు. వారి మృతదేహాలను ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి తరలించిన పోలీసులు.. గురువారం ఉదయం మృతిచెందిన ఒడిశా వారిని విశాఖ జిల్లా పాడేరుకు తరలించారు. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల ప్రజాసంఘాల వ్యతిరేక ప్రభావం ఎక్కువగా పడకుండా ఉండేందుకే అలా తరలిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.