సమావేశంలో మాట్లాడుతున్న పౌరహక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీరామమూర్తి
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు, నిర్వాసితులు, రాజకీయ ఖైదీల కోసం పనిచేస్తున్న వారిని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పౌరహక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి ఆరోపించారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6న పూణె పోలీసులు సీఆర్‌పీపీ జాతీయ కార్యదర్శి రోనావిల్సన్‌ను ఢిల్లీలో ఐఏపీఎల్ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, దళిత్‌నేత సుధీర్ దావ్లే, విస్తాపన వ్యతిరేక ఉద్యమ కారుడు మహేశ్ రావత్‌లను అరెస్టు చేసి ఉపా చట్టం కింద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీరిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబరు 31న టి కోరెగాం సంఘటనల నేపథ్యంలో గత ఏప్రిల్ 17న సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్‌దావ్లే ఇళ్లపై పూణె పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేసి దస్త్రాలు, సీడీలు, కంప్యూటర్లు సీజ్ చేశారని తెలిపారు. వీటిలో ప్రధానమంత్రి మోదీని హత్య చేయడానికి కుట్ర ఉందని, వాటిలో విరసం నేత వరవరరావు పేరు ఉందని పోలీసులు పేర్కొనడాన్ని ఖండించారు. ఇది అవాస్తవమని, ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు, నిర్వాసితులు, రాజకీయ ఖైదీల కోసం పనిచేస్తున్న వారిని అణచివేసే కుట్రలో భాగమేనన్నారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం నేత పీవీ రమణ, జయంత్ రఘురాం, హెచ్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధి వీఎస్ కృష్ణ, కె.పద్మ, బాలకృష్ణ, ఇఫ్టూ ప్రతినిధి మల్లన్న, ఎస్‌వి.రమణ, అన్నపూర్ణ, లలిత, పద్మ, కె.ఎస్.చలం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment