Depravity
-
కేసీఆర్ పాలనలో తెలంగాణ అధోగతి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా పాలి స్తూ తెలంగాణను అధోగతిపాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలం గాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోందన్నారు. బుధవారం ఇక్కడి గాంధీభవన్‌లో పరకాల మున్సిపల్ చైర్మన్ మార్తిరాజు భద్రయ్య తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఉత్తమ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరికలే ఇందుకు సాక్ష్యాలని అన్నారు. టీఆర్ఎస్ తప్పుడు విధానాలకు విరక్తి చేందే పరకాల చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో కాంగ్రెస్‌కు పట్టం కడతారని పేర్కొన్నారు. -
ప్రజాసంఘాల నాయకుల నిర్బంధం దుర్మార్గం
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు, నిర్వాసితులు, రాజకీయ ఖైదీల కోసం పనిచేస్తున్న వారిని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పౌరహక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి ఆరోపించారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6న పూణె పోలీసులు సీఆర్పీపీ జాతీయ కార్యదర్శి రోనావిల్సన్ను ఢిల్లీలో ఐఏపీఎల్ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, దళిత్నేత సుధీర్ దావ్లే, విస్తాపన వ్యతిరేక ఉద్యమ కారుడు మహేశ్ రావత్‌లను అరెస్టు చేసి ఉపా చట్టం కింద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీరిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబరు 31న టి కోరెగాం సంఘటనల నేపథ్యంలో గత ఏప్రిల్ 17న సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్దావ్లే ఇళ్లపై పూణె పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేసి దస్త్రాలు, సీడీలు, కంప్యూటర్లు సీజ్ చేశారని తెలిపారు. వీటిలో ప్రధానమంత్రి మోదీని హత్య చేయడానికి కుట్ర ఉందని, వాటిలో విరసం నేత వరవరరావు పేరు ఉందని పోలీసులు పేర్కొనడాన్ని ఖండించారు. ఇది అవాస్తవమని, ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు, నిర్వాసితులు, రాజకీయ ఖైదీల కోసం పనిచేస్తున్న వారిని అణచివేసే కుట్రలో భాగమేనన్నారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం నేత పీవీ రమణ, జయంత్ రఘురాం, హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి వీఎస్ కృష్ణ, కె.పద్మ, బాలకృష్ణ, ఇఫ్టూ ప్రతినిధి మల్లన్న, ఎస్వి.రమణ, అన్నపూర్ణ, లలిత, పద్మ, కె.ఎస్.చలం పాల్గొన్నారు. -
ఈ దుర్మార్గం ఎవరి మెప్పు కోసం: స్వరూపానందేంద్ర
విశాఖపట్టణం: హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా విజయవాడలో దేవాలయాలను కూల్చివేస్తున్నారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే దేవాలయాలను కూల్చి.. విగ్రహాలను ఈడ్చుకుంటూ తరలించడం మంచి పరిణామం కాదన్నారు. ఎవరి మెప్పు కోసం ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ధనుర్మాస దీక్ష కోసం రుషికేశ్‌లో ఉన్న స్వామీజీ విజయవాడలో జరుగుతున్న పరిణామాలపై శనివారం స్పందించారు. దేవాలయాల కూల్చివేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంఘాలు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యయప్రయాసలకోర్చి ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి దేశంలో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కారణజన్ములైన శంకరాచార్య, రామానుజాచార్య, మద్వాచార్యుల చేతుల మీదుగా ఎన్నో దేవాలయాలకు ప్రతిష్ఠాపన జరిగిందని గుర్తు చేశారు. అందులో స్వయంభూ, రుషిప్రతిష్టలు, ఆగమాలతో కూడిన ప్రతిష్టలు ఎన్నో ఉన్నాయన్నారు. అలాంటి దేవాలయాలను కృష్ణా పుష్కరాలు, రోడ్డు విస్తరణల పేరుతో శాస్త్ర విరుద్ధంగా కూల్చివేయడం, విగ్రహాలను తాళ్లతో కట్టి తీసుకువెళ్లడం ఎంతో అపచారమన్నారు. ఒకవేళ నిజంగా ఆలయాలను కూల్చాల్సిన పరిస్థితి వస్తే ఏ ఆగమ పద్ధతుల్లో వాటిని ప్రతిష్టించారో..అవే ఆగమ పద్ధతుల్లో శాస్త్రోక్తంగా తొలగించాలన్నారు. కానీ ఇష్టానుసారంగా దేవాలయాలను కూల్చివేసి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఎవరి మెప్పు కోసం ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారో.. ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారో చెప్పాలన్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని స్వామీజీ డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని ప్రశ్నించిన వారి గురించి కొంతమంది నాయకులు నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అధినాయకుల మెప్పు కోసం అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.