civils-2014
-
సివిల్స్ ర్యాంకర్ల మనోభావాలు...
సివిల్స్ తుది ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతోపాటు ర్యాంకుల పట్ల తమ మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు ఇవీ... -సాక్షి, హైదరాబాద్ ఐఎఫ్ఎస్కు వెళతా నాకు ఫారిన్ సర్వీసెస్ అంటే ఇష్టం. ఇంటర్నేషనల్ లా అంశంలో ఆసక్తి ఉంది. అందుకే ఇండియన్ ఫారిన్ సర్వీసు (ఐఏఎఫ్ఎస్)ను ఎంచుకోవాలనుకుంటున్నా. 2011లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ నుంచి డిగ్రీ పూర్తి చేశా. ఆ తరువాత రెండేళ్లు ఉద్యోగం చేసి ఏడాదిపాటు సెలవు పెట్టి శిక్షణ తీసుకున్నా. అమ్మ ఛాయారతన్, నాన్న రతన్ ఇద్దరూ సివిల్ సర్వేంట్లే కావడంతో ఇంటర్వ్యూ మెళకువలను నేర్పించి ఎంతగానో తోడ్పడ్డారు. - సాకేత రాజ ముసినిపల్లి, 14వ ర్యాంకర్ మళ్లీ పరీక్ష రాస్తా... మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కొండ్రిపోలు గ్రామం. రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో ఐఏఎస్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఒకవేళ రాకుంటే మంచి ర్యాంకు కోసం మళ్లీ సివిల్స్ రాస్తా. ఓయూలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి క్యాపిటల్ ఐక్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశా. - అదావత్ సైదులు, 1,174వ ర్యాంకు పేదల సంక్షేమమే లక్ష్యం... మొదటి ప్రయత్నంలోనే 18వ ర్యాంకుతో సివిల్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. మొదటి ఆప్షన్ ఐఏఎస్, రెండోది ఐపీఎస్. ఏ రంగంలో పని చేసినా పేదల సంక్షేమమే నా లక్ష్యం. పేదల అభ్యున్నతి కోసం అంకిత భావంతో సేవలందిస్తా. - సాయికాంత్ వర్మ, 18వ ర్యాంకర్ కష్టాలే సివిల్స్ వైపు నడిపించాయి మాది పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవపల్లి. తల్లిదండ్రులు పడిన కష్టాలే నన్ను సివిల్స్ వైపు నడిపించాయి. వారిది వ్యవసాయ కుటుంబం. రోజుకు 8గంటలు కష్టపడి చదివా. బీటెక్ చేసినా అప్షనల్గా ఆంత్రోపాలజీ ఎంపిక చేసుకొని విజయం సాధించా. - లక్ష్మీ భవ్య, 88వ ర్యాంకర్ దేశ సేవ కోసమే.. దేశానికి విస్తృతస్థాయిలో సేవలందించడమే లక్ష్యంగా సివిల్స్‌ను ఎంచుకున్నా. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. సీబీఐటిలో ఇంజనీరింగ్ చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరినా సంతృప్తి చెందకే సివిల్స్ వైపు అడుగులేశా. - రాకేష్, 122వ ర్యాంకర్ ఫ్యాకల్టీ నుంచి సివిల్స్‌కు.. గతంలో మూడుసార్లు ర్యాంకులు రాకున్నా నిరుత్సాహ పడకుండా సివిల్స్‌కు సిద్ధమయ్యా. హార్డ్ వర్క్, డెడికేషన్ , ఫోకస్ ఈ మూడు అంశాలపై దృష్టిపెట్టి చదివా. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే రెండేళ్లుగా ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో ఎకానమి, జాగ్రఫీ సబ్జెక్టులలో విద్యార్థులకు తరగతు లు బోధిస్తున్నా. - వీఆర్ కృష్ణతేజ, 66వ ర్యాంకర్ నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ మాది కృష్ణాజిల్లాలోని గుళ్లపూడి అనే పల్లెటూరు. మూడో విడత పరీక్షలో 318 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికై ప్రస్తుతం నాగపూర్‌లో శిక్షణ తీసుకుంటున్న నాకు ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యం నాలుగో ప్రయత్నంలో నెరవేరింది. - గౌతమ్, 30వర్యాంకు గ్రామాల్లో సేవ చేస్తా... కలెక్టర్‌గా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. బెంగళూరులో బీటెక్ కంప్యూటర్ సైన్స్, అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశా. హైదరాబాద్‌లోని కేపీఎంజీ అనే సివిల్ సర్వీసెస్ అడ్వయిజరీ సంస్థలో పనిచేస్తూ అనుదినం ఐఏఎస్‌లతో అభిప్రాయాలు పంచుకోవటంతో నాకూ ఐఏఎస్ కావాలనే లక్ష్యం ఏర్పడింది. సివిల్స్‌లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, ఓపిక ఎంతో అవసరం. - గిరియప్ప లక్ష్మీకాంత్‌రెడ్డి, 21వ ర్యాంకర్ గురి ఎప్పుడు లక్ష్యం వైపే.. పోటీలో ఉన్న వారి గురి ఎప్పుడు లక్ష్యం మీదే ఉండాలి. అప్పుడే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుంది. బీటెక్ చేసే క్రమంలోనే సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నా. నా విజయం వెనుక తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల ఆశీస్సులు ఉన్నాయి. -మహ్మద్ రోషన్, 44వ ర్యాంకర్ ఆడియో ద్వారా పాఠాలు విన్నా ఆడియో విని.. బ్రెయిలీ లిపిలో సివిల్స్ పరీక్షలు రాశా. మూడో ప్రయత్నంలో విజయం సాధించా. మాది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. ఓయూలో ఎం.ఎ.బిఈడీ పూర్తి చేశా. మెరుగైన ర్యాంకు కోసం మళ్లీ సివిల్స్ రాస్తా. - స్వాతి (అంధురాలు), 796వ ర్యాంకర్ వినికిడి శక్తి కోల్పోయినా.. సివిల్స్ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన 22 ఏళ్ల నేహా వీరవల్లి 1221 ర్యాంకు సాధించారు. వికలాంగుల కోటాలో తనకు ఐఏఎస్ లేదా మరేదైనా మంచి సర్వీసు వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. రెండో తరగతిలో ఉన్నప్పుడు ఆమెకు బ్రెయిన్ ఫీవర్ (మెనిజైటిస్) రావడం వల్ల వినికిడి శక్తిని కోల్పోయారు. సివిల్స్‌లో రెండో ప్రయత్నంలో 1,221 ర్యాంకు సాధించారు. నేహా సాధించిన విజయం గురించి తెలుసుకున్న రాష్ట్రపతి సోమవారం తనను కలిసేందుకు ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ‘ఆర్సీ రెడ్డి’కి టాప్ ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ విద్యార్థులు సివిల్స్ 2015 ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించినట్లు సంస్థ డెరైక్టర్ ఆర్సీ రెడ్డి తెలిపారు. 100లోపు 18, 49, 66 ర్యాంకులతోపాటు మొత్తం 36 మందికిపైగా మంచి ర్యాంకులు కైవసం చేసుకున్నారని, పట్టుదల, శ్రమతో సివిల్స్‌లో విజయం సాధించొచ్చని తెలిపారు. -
సివిల్స్‌లో తెలుగు తేజాలు
టాప్-100లో 10 మందికి ర్యాంకులు * మొత్తంగా 100 వరకు ర్యాంకులు * సాధించిన తెలంగాణ, ఏపీ విద్యార్థులు సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అఖిల భారత సివిల్ సర్వీసెస్ ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శనివారం ఢిల్లీలో విడుదల చేసిన సివిల్ సర్వీసెస్-2014 తుది ఫలితాల్లో దాదాపు వంద మంది వరకు ర్యాంకులు సాధించా రు. హైదరాబాద్‌లో చదువుకున్న వారితోపాటు ఢిల్లీలో చదువుకున్న తెలుగు విద్యార్థులు ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తొలి వంద ర్యాంకుల్లో 10 మంది తెలుగువారు స్థానం సంపాదించారు. వీరిలో రాష్ట్రానికి చెందిన సాకేతరాజ ముసినిపల్లి జాతీయ స్థాయిలో 14వ ర్యాంకుతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన రిటైర్డ్ ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛాయారతన్, మాజీ ఐపీఎస్ అధికారి, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం.రతన్ దంపతుల కుమారుడు. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మూడు విడతలుగా జరిగిన ఈ పరీక్షల తుది ఫలితాల్లో మొత్తం 1,236 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో 590 మంది జనరల్ కేటగిరీకి చెందినవారుకాగా, 354 మంది ఓబీసీ, 194 మంది ఎస్సీ, 98 మంది ఎస్టీ కేటగిరీలకు చెందిన వారున్నారు. వీరితోపాటు మరో 254 మందితో రిజర్వు జాబి తాను కూడా యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో జనరల్‌లో 127 మందిని, ఓబీసీలో 105 మందిని, ఎస్సీల్లో 19 మం దిని, ఎస్టీల్లో ముగ్గురితో ఈ జాబితాను రూపొందించింది. ప్రస్తుతం 73 మంది వరకు సివిల్స్‌కు ఎంపికైన వారి వివరాలు అందాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారు దాదాపు వంద మంది వరకు ఉంటారని ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్.సి. రెడ్డి, ప్రతినిధి వేగిరెడ్డి హరిచక్రవర్తి, అనలాగ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ విన్నకోట శ్రీకాంత్ వెల్లడించారు. టాప్ 200 ర్యాం కులు సాధించిన వారిలో సాకేత రాజ ముసినిపల్లి (14వ ర్యాంకు), సీఎం సాయికాంత్ వర్మ (18), లక్ష్మీకాంత్‌రెడ్డి (21), మహ్మద్ రోషన్ (44), రాజగోపాల సుంకర (49వ ర్యాంకు), క్రాంతికుమార్ పాటి (50వ ర్యాంకు), వి.ఆర్.కె.తేజ మైలవరపు (66వ ర్యాంకు), రెడ్డి వేదిత (71వ ర్యాంకు), లక్ష్మీభవ్య తన్నీ రు (88వ ర్యాంకు), సతీష్ రెడ్డి పింగిళి (97వ ర్యాంకు), రక్షిత కె మూర్తి (117వ ర్యాంకు), భరత్‌రెడ్డి బొమ్మారెడ్డి (120వ ర్యాంకు), రాకేష్ చింతగుంపుల (122వ ర్యాంకు), వై రఘువంశీ (190వ ర్యాంకు) ఉన్నారు. అలాగే 200 ర్యాంకుపైన సాధించిన వారు 59 మందికిపైగా ఉన్నారు. సివిల్స్ ర్యాంకర్లకు వైఎస్ జగన్ అభినందనలు సివిల్ సర్వీసు 2014 తుది ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ శ్రమతో అత్యత్తమ ఫలితాలు సాధించిన వారందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.