civils rankers feelings
-
లక్ష్యం.. క్రమశిక్షణే విజయ రహస్యం
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ మానేసి సివిల్సే లక్ష్యంగా.. సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్ అయిన మెరుగు కౌశిక్.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు 8–9 గంటలపాటు ప్రిపేర్ అయినట్లు చెప్పారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టానని, ఆ తర్వాత ఏడాది పాటు జాబ్ చేశానని తెలిపారు. ప్రిలిమ్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మెయిన్స్ రాసినట్లు పేర్కొన్నారు. ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యం అని చెప్పారు. తనకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదన్నారు. తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారని, తల్లి గృహిణి అని చెప్పారు. విధి వంచించినా... విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబ సభ్యులు, గురువుల సహకారంతో విశాఖపట్టణానికి చెందిన హనిత వేములపాటి సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు. తాను ఆత్మవిశ్వాసంతో చదువును కొనసాగించి సివిల్స్ ప్రిపేరయ్యానని ఆమె చెప్పారు. దేశంలోనే అత్యున్నత సివిల్స్ సర్విసెస్‌కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాత జస్టిస్... మనవరాలు సివిల్స్ ర్యాంకర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి మనవరాలు ఐశ్వర్య నీలిశ్యామల సివిల్స్‌లో 649వ ర్యాంకు సాధించారు. బీటెక్ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తాత జస్టిస్ రామస్వామి తనను ఎంతగానో ప్రేరేపించారని, అందుకే ప్రజాసేవ చేయాలనే లక్షంతో సివిల్స్ రాశానని అన్నారు. తండ్రి సివిల్ సర్వెంట్, తల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలు అని, తన మామ ఐఏఎస్ అధికారి అని పేర్కొన్నారు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి : అలేఖ్య ఖమ్మం జిల్లాలో సాధారణ కానిస్టేబుల్ కూతురు అలేఖ్య. పోలీసు వృత్తిలోనూ నిజాయితీని చాటుకున్న తండ్రిని ఆమె ఆదర్శంగా తీసుకుంది. పాఠశాల విద్య నుంచే సివిల్స్ లక్ష్యంగా ఎంచుకుంది. అనుక్షణం తండ్రి ప్రోత్సాహం ఆమెకు కలిసి వచ్చింది. తన కష్టాలే ఆమెను మానసికంగా బలపడేలా చేశాయి. ఐపీఎస్ కావాలన్న లక్ష్య సాధనలో ఆమె 938వ ర్యాంకు సాధించింది. నాలుగుసార్లు సివిల్స్ విజయానికి దగ్గరగా వెళ్లిన ఆమె ఎన్నడూ నిరుత్సాహ పడలేదు. ఐదోసారి అనుకున్నది సాధించారు. ప్రతీ తల్లీదండ్రీ పిల్లలను ప్రోత్సహించాలని ఆమె చెప్పార. ప్రజా జీవితానికి చేరువగా విధి నిర్వహణ చేయాలని ఆమె కోరుకుంటున్నారు. వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు.. పూడూరు: వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లికి చెందిన దయ్యాల బాబయ్య, శశికళ దంపతుల కుమారుడు తరుణ్ (24) సివిల్స్‌లో 231వ ర్యాంక్ సాధించారు. 2017లో తరుణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 2023లో బీటెక్ పూర్తి చేశారు. ఐఏఎస్‌కు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, పేదలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తరుణ్ తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తరుణ్ ఇంటికి వెళ్లి అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన తరుణ్ ఐఏఎస్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. 60 మంది తోటి కానిస్టేబుళ్ల ముందు సీఐ అవమానించారని.. చిక్కడపల్లి: ‘60 మంది పోలీసుల ముందు ఇన్స్పెక్టర్ అవమానించారు. నాపై వ్యక్తిగత కోపంతో తిట్టారు. 2013 నుంచి 2018 వరకు చేసిన కానిస్టేబుల్ జాబ్‌కు ఆరోజే రిజైన్ చేశాను. ఐఏఎస్ సాధించాలని ఆ రోజే కసితో దీక్ష తీసుకున్నాను. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్టారెడ్డి చెప్పారు. తనకు ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా గుడ్లూరు పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనకు సీఐ చేసిన అవమానమే ఈ రోజు సివిల్స్ సాధించేందుకు దోహదపడిందన్నారు. తనకు జంతువులంటే ఎంతో ప్రేమ అని, మనుషుల కోసం 108 వాహనం ఉన్నట్లే జంతువుల కోసం దేశవ్యాప్తంగా 109 అంబులెన్స్ వాహనం కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని నానమ్మ పెంపకంలో పెరిగానని వివరించారు. ఢిల్లీ ఐఐటీ వదిలి.. దూర విద్య చదివి... ముషీరాబాద్: నల్లగొండ జిల్లా అల్వాలకు చెందిన సత్యనారాయణరెడ్డి స్కూల్ ప్రిన్సిపల్, తల్లి హేమలత టీచర్. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత విద్యావంతులు కావడంతో కుమారుడు పెంకేసు ధీరజ్‌రెడ్డిని ఐఐటీ చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఐఐటీ ఢిల్లీలో సీటు సాధించారు. మొదటి సంవత్సరంలో 9.3 సీజీపీఏ సాధించి ఐఐటీ ఢిల్లీలోనే టాప్ 7లో నిలిచాడు. ఇలా సాగిపోతున్న తరుణంలో ధీరజ్రెడ్డికి చదువు పరుగు పందెంలా అనిపించింది. ఎప్పుడూ కంప్యూటర్‌తో కుస్తీ, మెకానికల్ లైఫ్ అనిపించి ఈ చదువు తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అయినప్పటికీ కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తల్లిదండ్రులు నీకు నచ్చకపోతే ఐఐటీ వదిలేయమని చెప్పారు. దీంతో ఐఐటీని మధ్యలోనే ఆపేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే డిగ్రీ అడ్మిషన్లు అయిపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్(దూర విద్య)లో బీఏ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ అడ్మిషన్ కేవలం డిగ్రీకి మాత్రమే.. వెంటనే సివిల్స్‌పై దృష్టి సారించాడు. తల్లిదండ్రుల్లో మాత్రం కుమారుడి భవిష్యత్తు మీద ఆందోళన మొదలైంది. 2019లో మొదటిసారి సివిల్స్ ఫలితాల్లో 0.6 మార్కులతో రాలేదు. రెండవ ప్రయత్నంలో 17 మార్కులతో, మూడవ ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో ఫెయిలయ్యాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిoచి నాలుగోసారి 173వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు దారులు వేసుకున్నాడు. మేస్త్రీ కుమారుడికి 574వ ర్యాంక్ కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ కాలనీకి చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్ ఆరో ప్రయత్నంలో 574వ ర్యాంకు సాధించారు. రజనీకాంత్ కుటుంబానిది రాజంపేట మండలం ఆర్గోండ గ్రామం. రామారెడ్డిపేట సిద్ధిరాములు, పద్మ దంపతుల రెండవ కుమారుడు. పేద కుటుంబమే. తల్లి గృహిణి కాగా, తండ్రి భవన నిర్మాణ పనులతోపాటు డ్రైవర్‌గా చేస్తారు. చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడ్డామని, కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని రజనీకాంత్ చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తమ అబ్బాయి సివిల్స్ సాధించి తమ జన్మను సార్థకం చేశాడని తల్లిదండ్రులు ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. బీడీ కార్మికురాలి కొడుకు సివిల్స్ ర్యాంకర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ 27వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయికిరణ్ తండ్రి నందాల కాంతారావు మహారాష్ట్రలోని భివండిలో చేనేత కార్మికుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీ బీడీలు చుట్టేవారు. కాంతారావు కేన్సర్‌తో 2016లో మరణించారు. ఆ సమయంలో సాయికిరణ్ వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2018లో క్యాంపస్ ఇంటరŠూయ్వలో క్వాల్కమ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. బాల్యం నుంచి ఐఏఎస్ కలగా ఉన్న సాయికిరణ్ అప్పటి నుంచి ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. క్రితంసారి విఫలమైనా.. ఈసారి మాత్రం విజయం సాధించి తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. పాలమూరు బిడ్డ... ప్రతిభకు అడ్డా సివిల్స్ లక్ష్యంగా నిద్రాహారాలు మానేసి చదివిన పాలమూరు బిడ్డ అనుకున్నది సాధించింది. ఆలిండియా మూడో ర్యాంకు సాధించింది. మహబూబ్‌నగర్‌కు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయ శిఖరాలు అధిరోహించడం విశేషం. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి, మంజులతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనన్యరెడ్డి కాగా.. రెండో సంతానం చరణ్య. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైసూ్కల్లో చదివిన అనన్య.. ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎంతో కష్టపడి చదివి సివిల్స్‌లో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ మీద దృష్టి సారించానని చెప్పారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివానని పేర్కొన్నారు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నానని, ఇందుకు హైదరాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని పకడ్బందీగా ప్రిపేరయ్యానని చెప్పారు. అయితే ఈ ఫలితాల్లో మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేనని చెప్పారు. అనన్య తల్లి గృహిణి కాగా, తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. -
TS: దినసరి కూలీ కుమారుడికి సివిల్స్‌లో ర్యాంకు..
సాక్షి, హైదరాబాద్: సివిల్స్ ఫలితాల్లో దినసరి కూలీ కుమారుడు సత్తా చాటాడని, అది కూడా ఎస్సీ స్టడీ సర్కిల్లో చదివి ఈ ఘనత సాధించాడని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ చౌడారపు శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగాం జిల్లాకు చెందిన కొయ్యాడా ప్రభాకర్ కుమారుడు కొయ్యాడా ప్రణయ్ కుమార్ తొలిసారి సివిల్స్ పరీక్షకు హాజరై 885వ రాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు. ప్రణయ్ తండ్రి దినసరి కూలీకాగా అతని తల్లి గృహిణి. ప్రణయ్ మేడ్చల్ జిల్లా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదవగా గజ్వేల్ ప్రభుత్వ సోషల్ రెసిడెన్షియల్లో పాలిటెక్నిక్, జేఎన్టీయూలో బీటెక్ చేశాడు. ప్రణయ్‌కుమార్‌ను అభినందిస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడికి.. 410వ ర్యాంకు రెబ్బెన (ఆసిఫాబాద్): సివిల్ ఫలితాల్లో మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడు డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410 ర్యాంకుతో మెరిశాడు. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి విస్తారుబాయి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కారి్మకురాలిగా పనిచేస్తోంది. 25 ఏళ్ల క్రితం భర్త మనోహర్ మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను షోషించింది. పెద్ద కుమారుడు తిర్యాణి మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు రేవయ్య కన్నతల్లి కలను సాకారం చేస్తూ సివిల్స్‌లో సత్తా చాటాడు. ర్యాంకు సాధించిన రేవయ్యకు స్వీట్ తినిపిస్తున్న తల్లి విస్తారుబాయి, సోదరుడు 2021లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి.. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రేవయ్య కొన్నాళ్లు ఐఎన్‌జీసీలో ఉద్యోగం చేశాడు. సివిల్స్ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. 2021లో జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా కేవలం రెండు మార్కులతో ర్యాంకు కోల్పోయాడు. ఈసారి మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాగజ్‌నగర్‌లో ప్రాథమిక విద్య, ఆసిఫాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన రేవయ్య.. హైదరాబాద్‌లోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్లో 929 మార్కులు సాధించాడు. పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని, ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపాడు. శిక్షణ ఇస్తున్న మహేశ్ భగవత్ సివిల్స్ గురూ.. మహేశ్ భగవత్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ ‘సివిల్స్ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్‌కు తాను మెంటార్‌గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టాప్–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్ దత్తా, 25వ ర్యాంకర్ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్ కుమార్, 38వ ర్యాంకర్ అనూప్‌దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకరి్ణ, 74వ ర్యాంకర్ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్‌లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్ భగవత్ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇది కూడా చదవండి: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు -
క్రేన్ ఆపరేటర్ కూతురికి 323వ ర్యాంక్.. స్మార్ట్‌ఫోన్‌తో ప్రిపరేషన్!
రాంఘర్(రాంచి): పేద కుటుంబం..కోచింగ్ తీసుకునే స్తోమత లేదు..అయినప్పటికీ వెనుకాడలేదు. రోజుకు 18 గంటలపాటు చదువుకుని, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకుని యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరైంది. రెండు రోజుల క్రితం వెలువడిన యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా 323వ ర్యాంక్ సాధించింది. జార్ఖండ్‌కు చెందిన దివ్యా పాండే(24) ఘనత ఇది. రాంచీ యూనివర్సిటీ నుంచి దివ్య 2017లో డిగ్రీ పొందారు. ఈమె తండ్రి జగదీష్ ప్రసాద్ పాండే సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్)లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసి 2016లో రిటైరయ్యారు. ‘ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్‌ఫోన్ సివిల్స్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇంటర్నెట్లోని అపార సమాచారాన్ని వాడుకున్నా. రోజుకు 18 గంటలపాటు సొంతంగా చదువుకున్నా. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. యూపీఎస్సీ కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఏడాది కష్టానికి తొలి ప్రయత్నంలోనే ఫలితం దక్కింది’ అని దివ్యా పాండే తెలిపారు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం పనిచేస్తానన్నారు. కుమార్తె సాధించిన ఘనతతో జగదీష్ ప్రసాద్ ఆనందానికి అవధుల్లేవు. ‘నాకు చాలా గర్వంగా ఉంది. దివ్య ఎంతో కష్టపడింది. అందుకు తగిన ఫలితం దక్కింది’ అని అన్నారు. దివ్య చెల్లెలు ప్రియదర్శిని పాండే కూడా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణురాలైంది. -
సివిల్స్‌లో మెరిసిన గిరిజన వజ్రం
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): చదువుకు పేదరికం అడ్డుకాదు.. సాధించాలనే లక్ష్యం, తపన ఉంటే కష్టపడి తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించాడు గ్రామీణ ప్రాంత విద్యార్థి ప్రవీణ్ నాయక్. సివిల్ సర్వీసెస్–2018 ఫలితాల్లో వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబల్లికి చెందిన నునావత్ ప్రవీణ్‌నాయక్ 610 ర్యాంక్‌ను సాధించాడు. నునావత్ భీమా నాయక్–రాజమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారి కుమారుడు ప్రవీణ్ నాయక్ ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కరీంనగర్‌లోని పారమిత హైస్కూల్లో చదువుకున్నాడు. పదో తరగతి పూర్తికాగానే 2008 సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్(ఎంపీసీ), అనంతరం వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి కాగానే ఢిల్లీలో కొన్ని నెలల పాటు కోచింగ్ తీసుకున్న ప్రవీణ్ నాయక్ 2016 సివిల్స్ మెయిన్స్‌లో తప్పాడు. రెండో ప్రయత్నంలో లక్ష్యం సాధించాడు. 2018 సంవత్సరానికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ కమిషన్) గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్వూలు నిర్వహించగా అందులో ప్రవీణ్నాయక్కు 610 ర్యాంక్ సాధించాడు. సంతోషంగా ఉంది.. నా కుమారుడు సివిల్స్ సాధించడం చాల సంతోషంగా ఉంది. మాది చాలా పేద కుటుంబం. మా తండాల్లో ఎర్రమట్టి విక్రయాలే జీవనాధారం. మా తండ్రి నునావత్ బిక్యా–బూలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నాన్న ఎర్రమట్టి అమ్మి వచ్చిన డబ్బులతో నన్ను చదివించాడు. ప్రస్తుతం మా ఇద్దరు తమ్ముళ్లలో ఒకరు ఆటో డ్రైవర్‌గా, మరో తమ్ముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నేను పదో తరగతి వరకు ముల్కనూర్‌లో చదువుకున్నాను. 1996 సంవత్సరంలో ఓరియంటల్ బ్యాంక్ కామర్లో ఫ్యూన్‌గా ఉద్యోగం లభించింది. నాకు కుమారుడు ప్రవీణ్‌తో పాటుగా కూతురు నవ్య సంతానం. నవ్య ఇప్పుడు డిగ్రీ చదువుతోంది. – భీమా నాయక్, ప్రవీణ్ నాయక్ తండ్రి పేపర్ చదవడం వల్లే సివిల్స్ సాధించాను.. మాది పేద కుటుంబం.. సివిల్స్ చదవాలనే తపన ఇంటర్మీడియట్లోనే కలిగింది. అప్పటి నుంచి అందే సంకల్పంతో బీటెక్ పూర్తి కాగానే సివిల్స్‌పై దృష్టి సారించి ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్లాను. అయిప్పటికీ స్వతహాగా నోట్స్ తయారు చేసుకున్నాను. ఇతర పుస్తకాలతోపాటు నిత్యం పేపర్ చదివాను. సివిల్స్ సాధించడానికి ఇవి తోడ్పడ్డాయి. పేపర్ చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. నిత్యం 8 నుంచి 10 గంటలు ప్రిపేరయ్యాను. ఆశయం ఉంటే లక్ష్యం సాధించడం కష్టమేమి కాదు. – నునావత్ ప్రవీణ్ నాయక్ -
హైదరాబాద్‌లో చదివి..
సాక్షి, హైదరాబాద్: సమాజానికి సేవ చేయాలనే తపన. జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలనే ఆలోచన. తమకంటూ ఒక గుర్తింపును పొందాలనే ఉత్సాహం. నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షతో విజయతీరాలను చేరుకున్నారీ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థినులు. ఇటీవల వెలువడిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ట్రిపుల్ ఐటీ– హైదరాబాద్‌లో బీటెక్ 2015 బ్యాచ్‌కు చెందిన మాధురి గడ్డం జాతీయస్థాయిలో 144వ ర్యాంకు సాధించగా, బీటెక్ అండ్ ఎంఎస్ రీసెర్చ్ (డ్యుయల్ డిగ్రీ) గరిమా అగర్వాల్ 241వ ర్యాంకు సాధించడం విశేషం. మాధురి సొంత ప్రాంతం హైదరాబాద్ నగరం కాగా, గరిమది మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన వీరు సివిల్స్‌కు ప్రిపేయిన విధానం, తమకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, కష్టపడిన పద్ధతులు తదితర అనుభవాలను సాక్షికి వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలివీ.. అధ్యాపకుల బోధన ఎంతో ఉపకరించింది: మాధురి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదవడం ఎంతో మేలు చేకూర్చిందని మాధురి అభిప్రాయపడ్డారు. మావనతా విలువలకు సంబంధించిన కోర్సులో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అధ్యాపకులు కమల్, రాధిక, కన్నన్ శ్రీనాథన్, నందకిషోర్ ఆచార్య చర్చలు, తరగతి గదిలో చెప్పిన పాఠాలు ఎంతో తోడ్పాటును అందించాయి. ట్రిపుల్ఐటీ తర్వాత దేనికోసం చదివారు? హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకున్నా. మూడేళ్లపాటు కష్టపడ్డాను. రెండోసారి రాసి 144వ ర్యాంకు సాధించాను. సివిల్స్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ప్రజలు, సొసైటీకి సేవ చేయాలన్నదే లక్ష్యం. ఒకవేళ సివిల్ సర్వీసెస్‌లో ఎంపిక కాకపోయినా మంచి నాలెడ్జి సాధించాననే తృప్తి మిగిలేది. కానీ రావడం ఎంతో సంతోషానిచ్చింది. సివిల్ సర్వీసెస్‌కు ఎలా ప్రిపేరయ్యారు? సివిల్ సర్వీసెస్ ఒక లాంగ్ప్రాసెస్. మూడు దశల్లో పరీక్ష ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ దశలో నెగెటివ్ మార్కులుండే విధానం. రెండో దశలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ తొమ్మిది పేపర్లు ఉంటాయి. చివరిదశలో 30 నిమిషాలు పర్సనాలిటీ టెస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంజినీరింగ్ చదివిన వారికి లాభనష్టాలు రెండూ ఉంటాయి. సివిల్స్ పరీక్షలకు ఎవరైనా తోడ్పాటు అందించారా? సీనియర్లు పంకజ్ కుమావత్, హిమానుజన్, గరిమా అగర్వాల్ తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసేవారు కూడా సివిల్స్‌కు ప్రిపేర్ కావాలి. ఇక్కడ ట్రిపుల్ ఐటీ చదవడం ఎంతో లాభించింది: గరిమా అగర్వాల్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదవడం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని, పృథ్వి హౌజ్‌లో కల్చరల్ ప్రతినిధిగా ఉన్నానని గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. 2014లో ఏఏ ఎంఏఎస్–2016లో సింగపూర్ సదస్సులో సర్టిఫికెట్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందడం మరిచిపోలేని సంఘటన. ప్రొఫెసర్లు కౌల్, కమలార్ కర్లపాలెమ్ ఎంతగానో స్పూర్తినిచ్చారు. ట్రిపుల్ఐటీ తర్వాత ఏం చదివారు? ట్రిపుల్ఐటీ చదివిన తర్వాత జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో రోబోటిక్స్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. అనంతరం న్యూఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యా. సివిల్స్‌లో 241వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. సివిల్స్ ఎందుకు ఎంపిక చేసుకున్నారు? సమాజానికి ఏమైనా చేయాలనే తపనతోనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా. ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తి చేశాక విదేశాల్లో పరిశ్రమలు, పరిశోధనలో అవకాశాలు వచ్చాయి. కానీ సివిల్స్ ప్రిపేర్ కావాలని గ్రేడ్ 4లోనే ఉన్నప్పుడు నిర్ణయించుకున్నా. మధ్యప్రదేశ్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేసే అల్కా ఉపాధ్యాయ యూపీఎస్సీ టాపర్‌గా నిలిచింది ఆమెను స్పూర్తిగా తీసుకొని చదివాను. సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ అయ్యారు? న్యూఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నా. జనరల్ స్టడీస్. ప్రణాళికాబద్ధంగా చదవడం, టైమ్‌టేబుల్ ఏర్పాటు చేసుకొన్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ కావడం ఇబ్బందే అయినా ఇంజినీర్ల సైంటిఫిక్ టెంపర్మెంట్, లాజిక్ అప్రోచ్ నన్ను సివిల్స్ రాణించేలా చేశాయి. ఎవరెవరు తోడ్పాటునందించారు? ఐఏఎస్ అధికారి హిమాన్షు జైన్, ఐపీఎస్ అధికారి పంకజ్ కుమావత్, కమల్‌సర్ సివిల్స్ సర్వీసెస్‌లో ర్యాంకు సాధించడంలో ఎంతో తోడ్పాటును అందించారు. -
సివిల్స్ ర్యాంకర్ల మనోభావాలు...
సివిల్స్ తుది ఫలితాల్లో ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతోపాటు ర్యాంకుల పట్ల తమ మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు ఇవీ... -సాక్షి, హైదరాబాద్ ఐఎఫ్ఎస్కు వెళతా నాకు ఫారిన్ సర్వీసెస్ అంటే ఇష్టం. ఇంటర్నేషనల్ లా అంశంలో ఆసక్తి ఉంది. అందుకే ఇండియన్ ఫారిన్ సర్వీసు (ఐఏఎఫ్ఎస్)ను ఎంచుకోవాలనుకుంటున్నా. 2011లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ నుంచి డిగ్రీ పూర్తి చేశా. ఆ తరువాత రెండేళ్లు ఉద్యోగం చేసి ఏడాదిపాటు సెలవు పెట్టి శిక్షణ తీసుకున్నా. అమ్మ ఛాయారతన్, నాన్న రతన్ ఇద్దరూ సివిల్ సర్వేంట్లే కావడంతో ఇంటర్వ్యూ మెళకువలను నేర్పించి ఎంతగానో తోడ్పడ్డారు. - సాకేత రాజ ముసినిపల్లి, 14వ ర్యాంకర్ మళ్లీ పరీక్ష రాస్తా... మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కొండ్రిపోలు గ్రామం. రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో ఐఏఎస్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఒకవేళ రాకుంటే మంచి ర్యాంకు కోసం మళ్లీ సివిల్స్ రాస్తా. ఓయూలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి క్యాపిటల్ ఐక్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశా. - అదావత్ సైదులు, 1,174వ ర్యాంకు పేదల సంక్షేమమే లక్ష్యం... మొదటి ప్రయత్నంలోనే 18వ ర్యాంకుతో సివిల్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. మొదటి ఆప్షన్ ఐఏఎస్, రెండోది ఐపీఎస్. ఏ రంగంలో పని చేసినా పేదల సంక్షేమమే నా లక్ష్యం. పేదల అభ్యున్నతి కోసం అంకిత భావంతో సేవలందిస్తా. - సాయికాంత్ వర్మ, 18వ ర్యాంకర్ కష్టాలే సివిల్స్ వైపు నడిపించాయి మాది పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవపల్లి. తల్లిదండ్రులు పడిన కష్టాలే నన్ను సివిల్స్ వైపు నడిపించాయి. వారిది వ్యవసాయ కుటుంబం. రోజుకు 8గంటలు కష్టపడి చదివా. బీటెక్ చేసినా అప్షనల్గా ఆంత్రోపాలజీ ఎంపిక చేసుకొని విజయం సాధించా. - లక్ష్మీ భవ్య, 88వ ర్యాంకర్ దేశ సేవ కోసమే.. దేశానికి విస్తృతస్థాయిలో సేవలందించడమే లక్ష్యంగా సివిల్స్‌ను ఎంచుకున్నా. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. సీబీఐటిలో ఇంజనీరింగ్ చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరినా సంతృప్తి చెందకే సివిల్స్ వైపు అడుగులేశా. - రాకేష్, 122వ ర్యాంకర్ ఫ్యాకల్టీ నుంచి సివిల్స్‌కు.. గతంలో మూడుసార్లు ర్యాంకులు రాకున్నా నిరుత్సాహ పడకుండా సివిల్స్‌కు సిద్ధమయ్యా. హార్డ్ వర్క్, డెడికేషన్ , ఫోకస్ ఈ మూడు అంశాలపై దృష్టిపెట్టి చదివా. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే రెండేళ్లుగా ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో ఎకానమి, జాగ్రఫీ సబ్జెక్టులలో విద్యార్థులకు తరగతు లు బోధిస్తున్నా. - వీఆర్ కృష్ణతేజ, 66వ ర్యాంకర్ నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ మాది కృష్ణాజిల్లాలోని గుళ్లపూడి అనే పల్లెటూరు. మూడో విడత పరీక్షలో 318 ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికై ప్రస్తుతం నాగపూర్‌లో శిక్షణ తీసుకుంటున్న నాకు ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యం నాలుగో ప్రయత్నంలో నెరవేరింది. - గౌతమ్, 30వర్యాంకు గ్రామాల్లో సేవ చేస్తా... కలెక్టర్‌గా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. బెంగళూరులో బీటెక్ కంప్యూటర్ సైన్స్, అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశా. హైదరాబాద్‌లోని కేపీఎంజీ అనే సివిల్ సర్వీసెస్ అడ్వయిజరీ సంస్థలో పనిచేస్తూ అనుదినం ఐఏఎస్‌లతో అభిప్రాయాలు పంచుకోవటంతో నాకూ ఐఏఎస్ కావాలనే లక్ష్యం ఏర్పడింది. సివిల్స్‌లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, ఓపిక ఎంతో అవసరం. - గిరియప్ప లక్ష్మీకాంత్‌రెడ్డి, 21వ ర్యాంకర్ గురి ఎప్పుడు లక్ష్యం వైపే.. పోటీలో ఉన్న వారి గురి ఎప్పుడు లక్ష్యం మీదే ఉండాలి. అప్పుడే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుంది. బీటెక్ చేసే క్రమంలోనే సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నా. నా విజయం వెనుక తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల ఆశీస్సులు ఉన్నాయి. -మహ్మద్ రోషన్, 44వ ర్యాంకర్ ఆడియో ద్వారా పాఠాలు విన్నా ఆడియో విని.. బ్రెయిలీ లిపిలో సివిల్స్ పరీక్షలు రాశా. మూడో ప్రయత్నంలో విజయం సాధించా. మాది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. ఓయూలో ఎం.ఎ.బిఈడీ పూర్తి చేశా. మెరుగైన ర్యాంకు కోసం మళ్లీ సివిల్స్ రాస్తా. - స్వాతి (అంధురాలు), 796వ ర్యాంకర్ వినికిడి శక్తి కోల్పోయినా.. సివిల్స్ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన 22 ఏళ్ల నేహా వీరవల్లి 1221 ర్యాంకు సాధించారు. వికలాంగుల కోటాలో తనకు ఐఏఎస్ లేదా మరేదైనా మంచి సర్వీసు వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. రెండో తరగతిలో ఉన్నప్పుడు ఆమెకు బ్రెయిన్ ఫీవర్ (మెనిజైటిస్) రావడం వల్ల వినికిడి శక్తిని కోల్పోయారు. సివిల్స్‌లో రెండో ప్రయత్నంలో 1,221 ర్యాంకు సాధించారు. నేహా సాధించిన విజయం గురించి తెలుసుకున్న రాష్ట్రపతి సోమవారం తనను కలిసేందుకు ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ‘ఆర్సీ రెడ్డి’కి టాప్ ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ విద్యార్థులు సివిల్స్ 2015 ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించినట్లు సంస్థ డెరైక్టర్ ఆర్సీ రెడ్డి తెలిపారు. 100లోపు 18, 49, 66 ర్యాంకులతోపాటు మొత్తం 36 మందికిపైగా మంచి ర్యాంకులు కైవసం చేసుకున్నారని, పట్టుదల, శ్రమతో సివిల్స్‌లో విజయం సాధించొచ్చని తెలిపారు.