144వ ర్యాంకర్ మాధురి (కుడి వైపు) 241వ ర్యాంకర్ గరిమా (ఎడమ వైపు)
సాక్షి, హైదరాబాద్: సమాజానికి సేవ చేయాలనే తపన. జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలనే ఆలోచన. తమకంటూ ఒక గుర్తింపును పొందాలనే ఉత్సాహం. నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షతో విజయతీరాలను చేరుకున్నారీ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థినులు. ఇటీవల వెలువడిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ట్రిపుల్ ఐటీ– హైదరాబాద్‌లో బీటెక్ 2015 బ్యాచ్‌కు చెందిన మాధురి గడ్డం జాతీయస్థాయిలో 144వ ర్యాంకు సాధించగా, బీటెక్ అండ్ ఎంఎస్ రీసెర్చ్ (డ్యుయల్ డిగ్రీ) గరిమా అగర్వాల్ 241వ ర్యాంకు సాధించడం విశేషం. మాధురి సొంత ప్రాంతం హైదరాబాద్ నగరం కాగా, గరిమది మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన వీరు సివిల్స్‌కు ప్రిపేయిన విధానం, తమకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, కష్టపడిన పద్ధతులు తదితర అనుభవాలను సాక్షికి వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలివీ..
అధ్యాపకుల బోధన ఎంతో ఉపకరించింది: మాధురి
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదవడం ఎంతో మేలు చేకూర్చిందని మాధురి అభిప్రాయపడ్డారు. మావనతా విలువలకు సంబంధించిన కోర్సులో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అధ్యాపకులు కమల్, రాధిక, కన్నన్ శ్రీనాథన్, నందకిషోర్ ఆచార్య చర్చలు, తరగతి గదిలో చెప్పిన పాఠాలు ఎంతో తోడ్పాటును అందించాయి.
ట్రిపుల్‌ఐటీ తర్వాత దేనికోసం చదివారు?
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకున్నా. మూడేళ్లపాటు కష్టపడ్డాను. రెండోసారి రాసి 144వ ర్యాంకు సాధించాను.
సివిల్స్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
ప్రజలు, సొసైటీకి సేవ చేయాలన్నదే లక్ష్యం. ఒకవేళ సివిల్ సర్వీసెస్‌లో ఎంపిక కాకపోయినా మంచి నాలెడ్జి సాధించాననే తృప్తి మిగిలేది. కానీ రావడం ఎంతో సంతోషానిచ్చింది.
సివిల్ సర్వీసెస్‌కు ఎలా ప్రిపేరయ్యారు?
సివిల్ సర్వీసెస్ ఒక లాంగ్‌ప్రాసెస్. మూడు దశల్లో పరీక్ష ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ దశలో నెగెటివ్ మార్కులుండే విధానం. రెండో దశలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ తొమ్మిది పేపర్లు ఉంటాయి. చివరిదశలో 30 నిమిషాలు పర్సనాలిటీ టెస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంజినీరింగ్ చదివిన వారికి లాభనష్టాలు రెండూ ఉంటాయి.
సివిల్స్ పరీక్షలకు ఎవరైనా తోడ్పాటు అందించారా?
సీనియర్లు పంకజ్ కుమావత్, హిమానుజన్, గరిమా అగర్వాల్ తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసేవారు కూడా సివిల్స్‌కు ప్రిపేర్ కావాలి.
ఇక్కడ ట్రిపుల్ ఐటీ చదవడం ఎంతో లాభించింది: గరిమా అగర్వాల్
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదవడం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని, పృథ్వి హౌజ్‌లో కల్చరల్ ప్రతినిధిగా ఉన్నానని గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. 2014లో ఏఏ ఎంఏఎస్–2016లో సింగపూర్ సదస్సులో సర్టిఫికెట్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందడం మరిచిపోలేని సంఘటన. ప్రొఫెసర్లు కౌల్, కమలార్ కర్లపాలెమ్ ఎంతగానో స్పూర్తినిచ్చారు.
ట్రిపుల్‌ఐటీ తర్వాత ఏం చదివారు?
ట్రిపుల్‌ఐటీ చదివిన తర్వాత జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో రోబోటిక్స్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. అనంతరం న్యూఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యా. సివిల్స్‌లో 241వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది.
సివిల్స్ ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
సమాజానికి ఏమైనా చేయాలనే తపనతోనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా. ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తి చేశాక విదేశాల్లో పరిశ్రమలు, పరిశోధనలో అవకాశాలు వచ్చాయి. కానీ సివిల్స్ ప్రిపేర్ కావాలని గ్రేడ్ 4లోనే ఉన్నప్పుడు నిర్ణయించుకున్నా. మధ్యప్రదేశ్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేసే అల్కా ఉపాధ్యాయ యూపీఎస్‌సీ టాపర్‌గా నిలిచింది ఆమెను స్పూర్తిగా తీసుకొని చదివాను.
సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ అయ్యారు?
న్యూఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నా. జనరల్ స్టడీస్. ప్రణాళికాబద్ధంగా చదవడం, టైమ్‌టేబుల్ ఏర్పాటు చేసుకొన్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ కావడం ఇబ్బందే అయినా ఇంజినీర్ల సైంటిఫిక్ టెంపర్‌మెంట్, లాజిక్ అప్రోచ్ నన్ను సివిల్స్ రాణించేలా చేశాయి.
ఎవరెవరు తోడ్పాటునందించారు?
ఐఏఎస్ అధికారి హిమాన్షు జైన్, ఐపీఎస్ అధికారి పంకజ్ కుమావత్, కమల్‌సర్ సివిల్స్ సర్వీసెస్‌లో ర్యాంకు సాధించడంలో ఎంతో తోడ్పాటును అందించారు.
Comments
Please login to add a commentAdd a comment