Clay idols of Ganesh
-
ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
తిరుపతి రూరల్: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‘లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ 1.24 లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికీ అందిస్తున్న ఆయన అవార్డుకు అర్హత సాధించారు. శనివారం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ అకార్డ్ స్కూల్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా తమ సంస్థ శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఉమాశంకర్ అందించారు. ఏటా కొనసాగిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వివరించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, అకార్డ్ స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు ప్రశాంత్, వివేక్ పాల్గొన్నారు. కాగా, ‘మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను నిషేధిద్దాం’ అంటూ ప్లకార్డ్‌లు చేత బట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు తుడా వీసీ హరికృష్ణ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. -
Hyderabad: మట్టి ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వినాయకచవితి వేడుకలకు నగరం సన్నద్ధమవుతోంది. మండపాల్లో కొలువుదీరేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబవుతున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలపై ఆంక్షలు తొలగిపోవడంతో విగ్రహాల అమ్మకాలు మొదలయ్యాయి. మరోవైపు పర్యావరణహితమైన మట్టి ప్రతిమలకే నగరం పట్టం కడుతోంది. ముఖ్యంగా ఇళ్లల్లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజించేందుకు నగర వాసులు ఒక అడుగు నుంచి అయిదడుగుల మట్టి విగ్రహాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పీసీబీ వంటి ప్రభుత్వ సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి ప్రతిమల పంపిణీకి సన్నాహాలు చేపట్టాయి. సుమారు 6 లక్షల విగ్రహాలు.. ఈ ఏడాది సుమారు 6 లక్షల విగ్రహాలకు డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేట్ సంస్థలు తయారు చేసే మట్టి విగ్రహాలకు సైతం డిమాండ్ భారీగా ఉండనుంది. ‘ప్లాన్ ఏ ప్లాంట్’ వంటి సంస్థలు మొలకెత్తే విగ్రహాలను అందజేస్తుండగా మరి కొన్ని సంస్థలు ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన ప్రకృతి ప్రతిమలను అందుబాటులోకి తెచ్చాయి. ‘బాధ్యత ఫౌండేషన్’ అనే సంస్థ స్వచ్ఛమైన పల్లె మట్టితో చేసిన వినాయక ప్రతిమలను, సేంద్రీయ పద్ధతిలో సిద్ధం చేసిన పూజా ద్రవ్యాలను అందజేస్తోంది. ఈ మట్టి విగ్రహంతో పాటే విత్తనాలు కూడా ఉంటాయి. వేడుకలు పూర్తయ్యే నాటికి మొక్కలై ఎదుగుతాయి. ప్రకృతిని ఆరాధించడమే దైవంగా భావిస్తూ గత 8 ఏళ్లుగా ఏఎస్‌రావునగర్ కేంద్రంగా ప్రకృతి వినాయకుడి ప్రతిమలను భక్తులకు అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు, బ్రిటన్, అమెరికా, మలేషియా, తదితర దేశాలకు సైతం పెద్ద ఎత్తున విగ్రహాలను పంపించినట్లు పేర్కొన్నారు. పల్లెల్లోంచి నగరానికి.. బాధ్యత ఫౌండేషన్ అందజేసే గణపతి కిట్లు అన్నీ పూర్తిగా పల్లెల నుంచి సేకరించినవే. పల్లెల్లోని చెరువు మట్టి నుంచి ఈ ప్రతిమలను తయారు చేస్తారు. ఈ ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్లను అందుబాటులోకి తెచ్చారు. 60 పేజీల వినాయక పూజా పుస్తకాన్ని అందజేస్తారు. పదకొండు రోజుల పాటు పూజలకు అవసరమయ్యే వివిధ రకాల వస్తువులు ఉంటాయి. తేనె, ఆవుపాలు, ఆకుల డొప్పలు, ఖర్జూర వంటివి కూడా ఈ కిట్‌లో ఉంటాయి. పల్లెల్లోని చేతి వృత్తులను కాపాడేందుకు సహజమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి ప్రతిమలకు శ్రీకారం చుట్టినట్లు చంద్రశేఖర్ తెలిపారు. (చదవండి: ప్రీలాంచ్ మాయ ) -
ఏఎస్రావు నగర్లో ‘సాక్షి’ గణపతి
- మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి అనూహ్య స్పందన -మట్టి గణేశ్ విగ్రహాల పంపిణీకి అనూహ్య స్పందన -తరలివచ్చిన కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు -‘సాక్షి’కి అభినందనల వెల్లువ ఏఎస్‌రావునగర్ ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ కమ్యూనిటీ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు, మహిళలు, విద్యార్థిని విద్యార్థులు హాజరై మట్టి విగ్రహాలను ఎంతో ఉత్సాహంగా తీసుకువెళ్లారు. సుమారు 500 విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సాక్షిని పలువురు వక్తలు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలి పర్యావరణ కాలుష్యం వల్ల భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తమై పర్యావరణ పరిరక్షణ కోసం కంకణబద్ధులు కావాలని ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాక్షి ఆధ్వర్యంలో ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ కాలనీ సంక్షేమ సంఘం కార్యాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. కెమికల్స్‌తో తయారు చేసిన విగ్రహాల వలన భూగర్భ జలాలు కలుషితమై భావితరాల మనుగడకు ముప్పు ఏర్పడనుందన్నారు. ఇప్పటికే జల, వాయు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. కనీసం స్వచ్ఛమైన మంచినీరు, గాలి లభించే పరిస్థితి లేదన్నారు. రానున్న రోజుల్లో పిల్లలు స్కూల్ బ్యాగుల స్థానంలో ఆక్సిజన్ సిలిండర్లు వెంటపెట్టుకొని తిరిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో సాక్షి పాత్రను ఆయన అభినందించారు. సమాజంపై మీడియా ప్రభావం ఎంతో ఉందని, ఒకప్పుడు ఉపాధ్యాయులు సామాజిక అంశాలపై సమాజాన్ని చైతన్యవంతం చేసేవారని, ప్రస్తుతం ఆ పాత్రను మీడియా ఆక్రమించిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు మీడియా మరింత ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగా అందరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాలని సూచించారు. మట్టి విగ్రహాలనే పూజించాలి వాతావరణ కాలుష్య నివారణకు దోహదం చేసే విధంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని కార్పొరేటర్ పజ్జూరి పావనీమణిపాల్‌రెడ్డి సూచించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాలని గత 10 సంవత్సరాల నుండి ప్రజలలో మంచి స్పందన వస్తుందన్నారు. ఇందుకోసం సాక్షి చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం వలన జల కాలుష్యం తగ్గుతుందన్నారు. ప్రభుత్వం సైతం మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోందన్నారు. విగ్రహాల ఎత్తు తగ్గించి మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విషయంలో ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. సాక్షి కృషి అభినందనీయం పర్యావరణ పరిరక్షణ కోసం సాక్షి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏఎస్‌రావునగర్ డివిజన్ కన్వీనర్ కాసం మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలను సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో భవానీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు కె.హనుమయ్య, జి.కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వెంకటరాజు, సంయుక్త కార్యదర్శులు ఎన్.సదాలక్ష్మి, ఎం.భుజంగంరెడ్డి, ప్రచార కార్యదర్శి ఇ.వి.రమణ, కోశాధికారి రామకోటేశ్వర్రావు, కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జి.వి.కె.రాజు, కాలనీ సలహాదారులు టి.సత్తిరెడ్డి, జి.త్రిమూర్తులు, కె.మొగలయ్య, సి.హెచ్.నాగభూషణం, ఆర్.రాంరెడ్డి, యోగా గురువు మల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుడుగు మహేంద్రారెడ్డి, పజ్జూరి మణిపాల్‌రెడ్డి, మురళీ పంతులు, నాగేశ్వర్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొల్లి మాధవి, లక్ష్మీపురం కాలనీ అధ్యక్షులు టి.మధుకర్‌రెడ్డి, జైజవాన్ కాలనీ నాయకులు అల్లూరయ్య, శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బండి సారుుకుమార్ తదితరులు పాల్గొన్నారు.