- మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి అనూహ్య స్పందన
-మట్టి గణేశ్ విగ్రహాల పంపిణీకి అనూహ్య స్పందన
-తరలివచ్చిన కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు
-‘సాక్షి’కి అభినందనల వెల్లువ
ఏఎస్‌రావునగర్
‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ కమ్యూనిటీ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు, మహిళలు, విద్యార్థిని విద్యార్థులు హాజరై మట్టి విగ్రహాలను ఎంతో ఉత్సాహంగా తీసుకువెళ్లారు. సుమారు 500 విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సాక్షిని పలువురు వక్తలు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలి
పర్యావరణ కాలుష్యం వల్ల భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తమై పర్యావరణ పరిరక్షణ కోసం కంకణబద్ధులు కావాలని ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాక్షి ఆధ్వర్యంలో ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ కాలనీ సంక్షేమ సంఘం కార్యాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. కెమికల్స్‌తో తయారు చేసిన విగ్రహాల వలన భూగర్భ జలాలు కలుషితమై భావితరాల మనుగడకు ముప్పు ఏర్పడనుందన్నారు.
ఇప్పటికే జల, వాయు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. కనీసం స్వచ్ఛమైన మంచినీరు, గాలి లభించే పరిస్థితి లేదన్నారు. రానున్న రోజుల్లో పిల్లలు స్కూల్ బ్యాగుల స్థానంలో ఆక్సిజన్ సిలిండర్లు వెంటపెట్టుకొని తిరిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో సాక్షి పాత్రను ఆయన అభినందించారు. సమాజంపై మీడియా ప్రభావం ఎంతో ఉందని, ఒకప్పుడు ఉపాధ్యాయులు సామాజిక అంశాలపై సమాజాన్ని చైతన్యవంతం చేసేవారని, ప్రస్తుతం ఆ పాత్రను మీడియా ఆక్రమించిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు మీడియా మరింత ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగా అందరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాలని సూచించారు.
మట్టి విగ్రహాలనే పూజించాలి
వాతావరణ కాలుష్య నివారణకు దోహదం చేసే విధంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని కార్పొరేటర్ పజ్జూరి పావనీమణిపాల్‌రెడ్డి సూచించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాలని గత 10 సంవత్సరాల నుండి ప్రజలలో మంచి స్పందన వస్తుందన్నారు. ఇందుకోసం సాక్షి చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం వలన జల కాలుష్యం తగ్గుతుందన్నారు. ప్రభుత్వం సైతం మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోందన్నారు. విగ్రహాల ఎత్తు తగ్గించి మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విషయంలో ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు.
సాక్షి కృషి అభినందనీయం
పర్యావరణ పరిరక్షణ కోసం సాక్షి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏఎస్‌రావునగర్ డివిజన్ కన్వీనర్ కాసం మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలను సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం ప్రశంసనీయమన్నారు.
కార్యక్రమంలో భవానీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు కె.హనుమయ్య, జి.కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వెంకటరాజు, సంయుక్త కార్యదర్శులు ఎన్.సదాలక్ష్మి, ఎం.భుజంగంరెడ్డి, ప్రచార కార్యదర్శి ఇ.వి.రమణ, కోశాధికారి రామకోటేశ్వర్‌రావు, కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జి.వి.కె.రాజు, కాలనీ సలహాదారులు టి.సత్తిరెడ్డి, జి.త్రిమూర్తులు, కె.మొగలయ్య, సి.హెచ్.నాగభూషణం, ఆర్.రాంరెడ్డి, యోగా గురువు మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సుడుగు మహేంద్రారెడ్డి, పజ్జూరి మణిపాల్‌రెడ్డి, మురళీ పంతులు, నాగేశ్వర్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొల్లి మాధవి, లక్ష్మీపురం కాలనీ అధ్యక్షులు టి.మధుకర్‌రెడ్డి, జైజవాన్ కాలనీ నాయకులు అల్లూరయ్య, శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బండి సారుుకుమార్ తదితరులు పాల్గొన్నారు.