2040కల్లా కర్బనరహితం
న్యూఢిల్లీ: పూర్తికర్బనరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు చమురు రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ ఇండియా తాజాగా పేర్కొంది. 2040కల్లా కర్బన ఉద్గారాల నెట్‌జీరో కంపెనీగా నిలిచేందుకు రూ. 25,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా గ్యాస్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక విద్యుదుత్పాదనకు తెరతీడం, గ్రీన్ హైడ్రోజన్, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ రంజిత్ రథ్ వివరించారు.
అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సామ్కు సహజవాయు సరఫరాకుగాను 80 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. తద్వారా లిక్విడ్ ఇంధనాల రవాణా కాలుష్యానికి చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ముడిచమురు రవాణాకు ఏర్పాటు చేసిన కొన్ని పైప్లైన్లను గ్యాస్ పంపిణీకి అనువుగా మార్పు చేయనున్నట్లు పేర్కొన్నారు.
పెట్టుబడులు ఇలా
నెట్‌జీరో పెట్టుబడుల్లో రూ. 9,000 కోట్లను 1,800 మెగావాట్ల సోలార్, ఆన్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించనుండగా.. మరో రూ. 3,000 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుపై వెచి్చంచనున్నట్లు రంజిత్ తెలియజేశారు. ఈ బాటలో రూ. 1,000 కోట్లు కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్, స్టోరేజీ(సీసీయూఎస్) ప్రాజెక్టులకు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కంపెనీ అస్సామ్‌లో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ప్రణాళికలు వేసింది. వెరసి నెట్‌జీరో లక్ష్యాన్ని ముందుగానే అంటే 2038కల్లా సాధించాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.