clean ganga
-
మోదీ బర్త్‌డే: 5 కోట్ల పోస్ట్‌కార్డులు.. థాంక్స్ పీఎం బ్యానర్లు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు నాడు ప్రజా సేవలో 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ‘‘సేవా, సమార్పణ్, అభియాన్’’ పేరిట 20 రోజుల పాటు మెగా ఈవెంట్ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు సూచనలు జారీ చేశారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా కోవిడ్ సమయంలో ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేసినందుకు, కోవిడ్ టీకా వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో థ్యాంక్స్ పీఎం బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాక బూత్ స్థాయి నుంచి మోదీని అభినందిస్తూ 5 కోట్ల పోస్ట్ కార్డులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కార్యకర్తలందరూ సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో క్లిప్ రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని పార్టీ సూచించింది. (చదవండి: యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్‌లో ‘ఆప్’) ఇక వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గంగా నదిని శుభ్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 71 చోట్ల క్లీన్ గంగా పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్‌లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పుట్టిన రోజు సందర్భంగా మోదీకి వచ్చే అన్ని బహుమతులను వేలం (pmmementos.gov.in/#/) వేసి ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఇక ఈ వేడుకల సందర్భంగా కార్యకర్తలందరూ కోవిడ్ నియమాలు పాటించాలని పార్టీ సూచించింది. చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్ -
గంగా జలంతో కరోనా నయమవుతుందా?!
న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల చికిత్సకు గంగా జలాన్ని ఉపయోగించే అధ్యయనాన్ని పరిశీలించాలన్న జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తిరస్కరించింది. గంగా జలంతో రోగాలు నయమవుతాయనడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం, ఆధారాలు సరిపోవని స్పష్టం చేసింది. కాబట్టి గంగా జలంతో క్లినికల్ పరీక్షలకు సంబంధించిన అధ్యయనం చేయలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎవల్యూషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రపోజల్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వైకే గుప్తా నేతృత్వంలోని బృందం తమ నిర్ణయాన్ని వెల్లడించింది. కాగా పవిత్ర గంగా జలంతో వివిధ రోగాలు నయమైనట్లు పురాణాలు చెబుతున్నాయని మాజీ సైనిక అధికారులు ఏర్పాటు చేసిన ఓ సంస్థ పేర్కొంది. నింజా వైరస్‌గా పేర్కొనే గంగా జలానికి బాక్టీరియాను చంపే శక్తి ఉందని గతంలో నిరూపితమైనట్లు పేర్కొంది. (‘ప్లాస్మా’పై 21 సంస్థలకు అనుమతి) ఈ నేపథ్యంలో కరోనా క్లినికల్ అధ్యయనానికి గంగా జలాన్ని ఉపయోగిస్తే బాగుంటుందని ఈ మేరకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గంగా ప్రక్షాళన జాతీయ మిషన్(ఎన్ఎంసీజీ)కు లేఖ రాసింది. స్వచ్ఛమైన గంగా జలంలో వైరస్‌తో పోరాడే యాంటీ వైరల్ గుణం ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో తమ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని ఏప్రిల్ 28న విన్నవించింది. ఈ లేఖను ఎన్ఎంసీజీ ఐసీఎంఆర్‌కు పంపగా... తాజాగా ఈ విషయంపై చర్చించిన ఐసీఎంఆర్ పరిశోధకులు మాజీ సైనికుల ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ మేరకు ఎంకే గుప్తా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ప్రతిపాదనలకు బలం చేకూర్చేందుకు మరింత శాస్త్రీయ సమాచారం, సాక్ష్యాలు కావాలి. ఈ విషయాన్ని మేము ఎన్ఎంసీజీకి తెలిపాం’’అని పేర్కొన్నారు. అయితే ప్రతిపాదనల అంశమై తమకు ఐసీఎంఆర్ నుంచి ఎటువంటి సమాచారం అందలేదని ఎన్ఎంసీజీ అధికారులు పేర్కొనడం గమనార్హం.(ఆయుర్వేద ప్రభావమెంత?) -
గంగా ఉద్యమ యోధుడు కన్నుమూత
గంగా నది పరిరక్షణ కోసం నిరశన దీక్ష చేపట్టిన ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్(86) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ అయిన అగర్వాల్.. గంగానది ప్రక్షాళనకు తన జీవితాన్ని అంకితం చేశారు. గంగా నదిని కాలుష్యరహితం చేయాలని, దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ అగర్వాల్ గత జూన్ 22 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. 109 రోజుల పాటు కేవలం తేనె కలిపిన నీరు మాత్రమే తీసుకున్నారు. కేంద్రం స్పందించకపోవడంతో ఇకపై నీరు కూడా తాగనంటూ ఈనెల 9న ప్రకటించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బుధవారం రాత్రి రిషీకేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్‌లో 1932లో జన్మించిన అగర్వాల్.. రూర్కీ వర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ పొందారు. అనంతరం కాన్పూర్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1979లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మొదటి మెంబర్ సెక్రెటరీగా పని చేశారు. అదే సమయంలో ఐఐటీ రూర్కీలో విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత 2012లో సన్యాసం స్వీకరించి తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్‌గా మార్చుకున్నారు. -
ప్రాయోపవేశం
ఈ దేశ సంస్కృతిలో, సంప్రదాయంలో, విశ్వాసాల్లో వేల ఏళ్లుగా పెనవేసుకుని ప్రవహిస్తున్న గంగానదిని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ‘భారతీయుల ఆత్మ’గా అభివర్ణించారు. అంతటి పవిత్రాత్మను తమ స్వార్ధంతో, దుండగంతో, దుర్మార్గంతో నిత్యం హతమారుస్తున్నవారెందరో! ఇలాంటివారి బారి నుంచి గంగమ్మ తల్లిని కాపాడాలన్న దృఢ సంకల్పంతో 111 రోజులక్రితం నిరశనదీక్షకు ఉపక్రమించిన స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్ గురువారం హృషీకేశ్‌లో కన్నుమూ శారు. గంగానది కోసం తన ప్రాణాన్ని తర్పణ చేసినవారిలో జ్ఞాన్ స్వరూప్ మొదటివారు కాదు. బహుశా చివరి వారు కూడా కాకపోవచ్చు. ఏడేళ్లక్రితం స్వామి నిగమానంద సరస్వతి నాలుగు నెలలపాటు కఠోర నిరశన వ్రతం కొనసాగించి ఇదే రీతిన తనువు చాలించారు. ఇప్పుడు మరణించిన స్వామి జ్ఞాన్ స్వరూప్ 86 ఏళ్ల వృద్ధుడు. పూర్వాశ్రమంలో కాన్పూర్ ఐఐటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన పేరు జి.డి. అగర్వాల్. మన దేశంలో అనేకమంది మేధావులు, విద్యావేత్తలు చేస్తున్నట్టుగానే ఆయన రిటైరయ్యాక ఏ బహుళజాతి సంస్థకో సలహాదారుగా వెళ్లి లక్షలాది రూపాయల వేతనం తీసు కుంటూ అంతర్జాతీయ సదస్సు లకూ, సమావేశాలకూ విమానాల్లో వెళ్లివస్తూ కాలక్షేపం చేయొచ్చు. మీడియాలో వెలిగిపోవచ్చు. కానీ అగర్వాల్ ఆ తోవ ఎంచుకోలేదు. విద్యార్థులకు పర్యావరణ ఇంజ నీరింగ్‌ను మొక్కుబడిగా బోధించడం కాక, ఆ శాస్త్రాన్ని సీరియస్‌గా పట్టించుకున్నారు. గంగానది ప్రాణం తీస్తున్న... దానికి చేటు తెస్తున్న శక్తుల్ని నిలువరించడానికి గొంతెత్తడమే మార్గమనుకు న్నారు. అప్పుడు మాత్రమే గంగా పరివాహ ప్రాంత పర్యావరణాన్ని కాపాడగలమని విశ్వసిం చారు. కానీ ఆయన తక్కువ అంచనా వేశారు. మన దేశంలో నదీనదాల్ని, అడవుల్ని, కొండల్ని కొల్ల గొట్టేవారి వెనక పెద్ద పెద్ద మాఫియాలుంటాయని, వాటికి రాజకీయం వెన్నుదన్నుగా నిలుస్తుందని గ్రహించలేకపోయారు. ఆయన యూపీఏ ప్రభుత్వ హయాంలో పోరాడారు. ఎన్డీఏ సర్కారు వచ్చాక ఈ నాలుగున్నరేళ్ల నుంచీ పోరాడుతూనే ఉన్నారు. కేంద్రంలో ఎవరున్నా ఆయనకు ఎప్పుడూ ఒకే రకమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఇవన్నీ చూసి స్వామి జ్ఞాన్ స్వరూప్ ఏవో గొంతెమ్మ కోర్కెలు కోరారనిపించవచ్చు. కానీ ఆయన చేసిన నాలుగు డిమాండ్లూ న్యాయసమ్మతమైనవి. అవి ఇక్కడి పౌరుల శ్రేయస్సును కాంక్షించి చేసినవి. నిజానికి ఆ డిమాండ్లు అన్ని నదులకూ వర్తింపజేయవలసినంత ముఖ్యమైనవి. గంగానదికి శాశ్వతత్వం చేకూర్చేందుకు గంగా పరిరక్షణ చట్టం తీసుకురావడం... గంగ, దాని ఉపనదులైన భగీరథి, అలకానంద, మందాకిని వగైరాలపై ప్రతిపాదనలో ఉన్న, నిర్మాణంలో ఉన్న జల విద్యుదుత్పాదన ప్రాజెక్టుల్ని నిలిపేయడం... హరిద్వార్ ప్రాంతంలో ఇసుక మైనింగ్ కార్య కలాపాలను నిరోధించటం... గంగానది వ్యవహారాలను పర్యవేక్షించడానికి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఏర్పాటు–ఇవీ ఆయన కోర్కెలు. వీటిని సాధించుకోవడానికే ఆయన 2008 నుంచి పోరాడు తున్నారు. ఇప్పటికి అరడజనుసార్లు ఆమరణ దీక్షలు చేశారు. 2010లో ఆయన 34 రోజులపాటు నిరశన వ్రతం కొనసాగించారు. నాటి కేంద్ర పర్యావరణమంత్రి జైరాం రమేష్ వచ్చి కొన్ని విద్యుదుత్పాదన ప్రాజెక్టుల్ని ఆపేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అదే ప్రభుత్వం 2013లో చాటుగా వాటికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొన్న జూన్ 11న ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించింది మొదలు కొని మంగళవారం(9వ తేదీ) వరకూ ఆయన కేవలం రోజుకు మూడు గ్లాసుల మంచినీరు మాత్రమే తీసుకునేవారు. అనంతరం మంచినీటిని కూడా త్యజించారు. ఫలితంగా ఆయన ఆరోగ్యం క్షీణించి గుండెపోటుతో కన్నుమూశారు. స్వామి జ్ఞాన్‌స్వరూప్ దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించిన నాటినుంచి కేంద్రం ఆయనతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. గంగా పునరు జ్జీవన మంత్రిత్వశాఖను చూసిన ఉమాభారతి, ఆమె తర్వాత ఆ శాఖ బాధ్యతలు స్వీకరించిన నితిన్ గడ్కరీ కూడా ఆయనకు లేఖల ద్వారా ప్రభుత్వ వైఖరిని చెబుతూ వచ్చారు. గంగానది పరిరక్షణకు తీసుకోబోయే చర్యల గురించి వివరించారు. కానీ ఇవన్నీ పదేళ్లుగా వింటున్న మాటలుగానే ఆయ నకు అనిపించాయేమో... ప్రాయోపవేశానికే సిద్ధపడ్డారు! కేంద్రం గంగానది ప్రక్షాళనకు భారీగా నిధులు కేటాయించింది. రూ. 20,000 కోట్లు వ్యయం కాగల ‘నమామి గంగ’ ప్రాజెక్టుకు అంకురా ర్పణ చేసింది. కానీ ఏటా నిధుల కేటాయింపు, దాన్ని వ్యయం చేస్తున్న తీరు గమనిస్తే ఆ ప్రక్షాళన ఎప్పటికైనా పూర్తవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. ఒక విద్యావేత్త జీవనదిని కాపాడమని పదేళ్లుగా పోరుతూ చివరకు ప్రాణత్యాగానికి సిద్ధపడవలసి రావడం అత్యంత విషాదకరం. ఇది మన దేశంలో నెలకొన్న అమానుష స్థితికి అద్దం పడుతుంది. ఇందులో పాలకులను తప్పుబట్టి మాత్రమే ప్రయోజనం లేదు. మీడియా సైతం ఆయన దీక్షనూ, దాని ప్రాముఖ్యతనూ సరిగా గుర్తించలేకపోయింది. ఏడేళ్లనాడు స్వామి నిగమానంద దీక్ష సమయంలో చూపించిన నిర్లక్ష్యాన్నే ఇప్పుడూ కొనసాగించింది. స్వామి జ్ఞాన్‌స్వరూప్ దీక్ష గురించి ప్రజల్లో చైతన్యం కలిగి ప్రభుత్వంపై ఒత్తిళ్లు వచ్చివుంటే ఫలితం వేరుగా ఉండేదేమో! ఒక్క గంగానదిని మాత్రమే కాదు... దేశంలో ప్రతి నదినీ కాలుష్య కాసారాలుగా మారుస్తూ, వాటిని విచ్చలవిడిగా తవ్వుతూ లాభార్జనలో మునిగితేలుతున్నవారున్నారు. నదుల్ని దేవతలుగా కొలవడం మాత్రమే కాదు... వాటి పరిరక్షణతోనే మనందరి శ్రేయస్సు ముడిపడి ఉంటుందని గ్రహించాలి. అందుకు అనువైన చర్యలు తీసుకోవడం తక్షణావసరమని గుర్తించాలి. దివిజగంగగా, త్రిలోకాలనూ పావనం చేసిన తల్లిగా పురాణేతిహాసాల్లో గంగకు పేరుంది. కానీ వర్తమాన యుగంలో అది మౌనంగా రోదిస్తోంది. తనను కాపాడమని వేడుకుంటోంది. ఇప్పటికైనా వింటారా?! -
గంగానది ప్రక్షాళనకై మాజీ ప్రొఫెసర్ దీక్ష.. మృతి!
న్యూఢిల్లీ : గంగానది పరిరక్షణ కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రొఫెసర్ జిడి అగర్వాల్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ అయిన అగర్వాల్ గంగానది ప్రక్షాళనæకు తన జీవితాన్ని అంకింతం చేశారు. గంగానదిని కాలుష్యరహితం చేయాలని,దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ అగర్వాల్ గత జూన్ 22 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.111 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బుధవారం రాత్రి రిషీకేశ్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)కు తరలించారు. అక్కడ చికిత్సనందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.1932లో జన్మించిన అగర్వాల్ కాన్పూర్ ఐఐటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేశారు అక్కడ పదవి విరమణ చేసిన తర్వాత గంగానది పరిరక్షణకు నడుం కట్టారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్ సెక్రటరీగా కూడా పని చేసిన అగర్వాల్ 2012లో సన్యాసం స్వీకరించి తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్‌గా మార్చుకున్నారు. గంగానది పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఆయన 2008,2009,2012లలో కూడా ఆమరణ దీక్ష చేపట్టారు. గంగానదిపై ఆనకట్టలు కట్టి దాన్ని ప్రవాహ మార్గాన్ని మార్చడాన్ని,గంగానదిని కలుషితం చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ దీక్షలు చేపట్టారు.ఈ దీక్షలకు అన్నా హజారే వంటి వారు కూడా మద్దతు పలికారు.అగర్వాల్ డిమాండ్ మేరకు అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. అగర్వాల్‌లాగే మరి కొందరు కూడా గంగానది ప్రక్షాళన కోసం తమ ప్రాణాలనుత్యాగం చేశారు. వారిలో నిగమానంద ఒకరు. హైందవ సన్యాసి అయిన స్వామి నిగమానంద సరస్వతి గంగానది కాలుష్యానికి కారణమవుతున్న ఉత్తరాఖండ్‌లోని అక్రమ గనుల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ 2011 ప్రారంభంలో ఆమరణ దీక్ష చేపట్టారు. జూన్‌లో దీక్షలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.అనంతరం ఆయన ఆశ్రమానికి చెందిన స్వామి శివానంద 2011, నవంబర్ 25 నుంచి 11 రోజుల పాటు ఆమరణ నిరశన చేశారు.దాంతో జిల్లాలో అక్రమ తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారతీయ జీవనాడి భారత దేశ జీవనాడి గంగానది. దేశంలో అతిపొడవైన, పవిత్రమైన నదిగా పేరొందింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన గంగానది 11 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. దేశ జనాభాలో 40% మంది నీటి అవసరాలు గంగానదే తీరుస్తుంది. 50 కోట్ల మంది ప్రజలు గంగానదిపై ఆధారపడి బతుకుతున్నారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది గంగా పరీవాహక ప్రాంతంలోనే నివసిస్తున్నారు. భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలతో ముడిపడి ఉన్న గంగానది మన దేశంలో 52 నగరాలు, 48 పట్టణాల గుండా ప్రవహిస్తోంది. పరిశ్రమలు వదిలే వ్యర్థాలు, మానవ విసర్జితాలు, చెత్తాచెదారం తదితరాల వల్ల గంగానది కలుషితమైపోతోంది.రాను రాను ఈ నీరు తాగడానికే కాక సాధారణ వినియోగానికి కూడా పనికిరానంతగా కలుషితమైపోవడంతో నదిని ప్రక్షాళన చేయాలన్న ఆలోచన వచ్చింది. రాజీవ్ ప్రభుత్వం నుంచి మోదీ సర్కారు వరకు అన్ని ప్రభుత్వాలు గంగా ప్రక్షాళణకు నడుం కట్టాయి. కేంద్ర ప్రభుత్వం దీని కోసం వేల కోట్లు వెచ్చిస్తోంది. -
‘సిగరెట్’ తరహాలో గంగ హెచ్చరికలు
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక తరహాలో గంగా నది కాలుష్యంపై పరీవాహక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(ఎన్ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నది తీవ్రస్థాయిలో కలుషితం కావడంపై ఎన్జీటీ ఆవేదన వ్యక్తం చేసింది. హరిద్వార్ నుంచి ఉన్నావ్ మధ్య గంగా నది నీరు కనీసం స్నానానికి పనికిరావని వ్యాఖ్యానించింది. ‘ ప్రజలు గంగా నీటిని భక్తి భావంతో సేవిస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. కేవలం సిగరెట్ ప్యాకెట్ల మీదే ‘పొగతాగడం మీ ఆరోగ్యానికి హానికరం’ అని రాస్తున్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ఎందుకు చెప్పకూడదు?’’ అని ఎన్జీటీ బెంచ్ ప్రశ్నించింది. గంగా నదీ తీరంలో ప్రతి 100 కి.మీ ఓ చోట నీటి స్వచ్ఛతపై బోర్డులను ఏర్పాటు చేయాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ(ఎన్ఎంసీజీ)ను ఎన్జీటీ ఆదేశించింది. అక్కడి నీటిని తాగటానికి, స్నానం చేయటానికి వాడొచ్చా? లేదా? అన్న విషయాన్ని బోర్డుల్లో స్పష్టంగా పేర్కొనాలంది. -
మా అడ్రస్ తప్పుగా ఉందేమో?
డెహ్రాడూన్: కేంద్ర ప్రభుత్వ నిధులు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అందకపోవటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా.. అదిగో.. ఇదిగో.. అంటూ చెబుతున్నారే తప్ప ఇంతవరకు తమ వద్దకు నిధులు చేరలేదని రావత్ అన్నారు. ఉత్తరాఖండ్ అడ్రసు తప్పుగా నమోదై ఉండబట్టే నిధులు తమదాకా చేరటం లేదేమోనని రావత్ ఎద్దేవా చేశారు. అర్ధ కుంభమేళా, క్లీన్ గంగా పథకాలకోసం నిధులు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు. వచ్చే ఏడాది హరిద్వార్‌లో జరగనున్న అర్ధ కుంభమేళాకు రూ.500కోట్లు విడుదల చేయాలని రావత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా తొలగించాలన్న 14వ ఫైనాన్స్ కమిషన్ నివేదికలు సరికాదన్నారు.