ప్రాయోపవేశం | Sakshi Editorial On Clean Ganga Activist GD Agarwal Death | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 12:47 AM | Last Updated on Fri, Oct 12 2018 12:47 AM

Sakshi Editorial On Clean Ganga Activist GD Agarwal Death

ఈ దేశ సంస్కృతిలో, సంప్రదాయంలో, విశ్వాసాల్లో వేల ఏళ్లుగా పెనవేసుకుని ప్రవహిస్తున్న గంగానదిని తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ‘భారతీయుల ఆత్మ’గా అభివర్ణించారు. అంతటి పవిత్రాత్మను తమ స్వార్ధంతో, దుండగంతో, దుర్మార్గంతో నిత్యం హతమారుస్తున్నవారెందరో! ఇలాంటివారి బారి నుంచి గంగమ్మ తల్లిని కాపాడాలన్న దృఢ సంకల్పంతో 111 రోజులక్రితం నిరశనదీక్షకు ఉపక్రమించిన స్వామి జ్ఞాన్‌ స్వరూప్‌ సనంద్‌ గురువారం హృషీకేశ్‌లో కన్నుమూ శారు. గంగానది కోసం తన ప్రాణాన్ని తర్పణ చేసినవారిలో జ్ఞాన్‌ స్వరూప్‌ మొదటివారు కాదు. బహుశా చివరి వారు కూడా కాకపోవచ్చు. ఏడేళ్లక్రితం స్వామి నిగమానంద సరస్వతి నాలుగు నెలలపాటు కఠోర నిరశన వ్రతం కొనసాగించి ఇదే రీతిన తనువు చాలించారు.

ఇప్పుడు మరణించిన స్వామి జ్ఞాన్‌ స్వరూప్‌ 86 ఏళ్ల వృద్ధుడు. పూర్వాశ్రమంలో కాన్పూర్‌ ఐఐటీలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన పేరు జి.డి. అగర్వాల్‌. మన దేశంలో అనేకమంది మేధావులు, విద్యావేత్తలు చేస్తున్నట్టుగానే ఆయన రిటైరయ్యాక ఏ బహుళజాతి సంస్థకో సలహాదారుగా వెళ్లి లక్షలాది రూపాయల వేతనం తీసు కుంటూ అంతర్జాతీయ సదస్సు లకూ, సమావేశాలకూ విమానాల్లో వెళ్లివస్తూ కాలక్షేపం చేయొచ్చు. మీడియాలో వెలిగిపోవచ్చు. కానీ అగర్వాల్‌ ఆ తోవ ఎంచుకోలేదు. విద్యార్థులకు పర్యావరణ ఇంజ నీరింగ్‌ను మొక్కుబడిగా బోధించడం కాక, ఆ శాస్త్రాన్ని సీరియస్‌గా పట్టించుకున్నారు. గంగానది ప్రాణం తీస్తున్న... దానికి చేటు తెస్తున్న శక్తుల్ని నిలువరించడానికి గొంతెత్తడమే మార్గమనుకు న్నారు. అప్పుడు మాత్రమే గంగా పరివాహ ప్రాంత పర్యావరణాన్ని కాపాడగలమని విశ్వసిం చారు. కానీ ఆయన తక్కువ అంచనా వేశారు. మన దేశంలో నదీనదాల్ని, అడవుల్ని, కొండల్ని కొల్ల గొట్టేవారి వెనక పెద్ద పెద్ద మాఫియాలుంటాయని, వాటికి రాజకీయం వెన్నుదన్నుగా నిలుస్తుందని గ్రహించలేకపోయారు. ఆయన యూపీఏ ప్రభుత్వ హయాంలో పోరాడారు. ఎన్‌డీఏ సర్కారు వచ్చాక ఈ నాలుగున్నరేళ్ల నుంచీ పోరాడుతూనే ఉన్నారు. కేంద్రంలో ఎవరున్నా ఆయనకు ఎప్పుడూ ఒకే రకమైన అనుభవాలు ఎదురయ్యాయి.
 
ఇవన్నీ చూసి స్వామి జ్ఞాన్‌ స్వరూప్‌ ఏవో గొంతెమ్మ కోర్కెలు కోరారనిపించవచ్చు. కానీ ఆయన చేసిన నాలుగు డిమాండ్లూ న్యాయసమ్మతమైనవి. అవి ఇక్కడి పౌరుల శ్రేయస్సును కాంక్షించి చేసినవి. నిజానికి ఆ డిమాండ్లు  అన్ని నదులకూ వర్తింపజేయవలసినంత ముఖ్యమైనవి. గంగానదికి శాశ్వతత్వం చేకూర్చేందుకు గంగా పరిరక్షణ చట్టం తీసుకురావడం... గంగ, దాని ఉపనదులైన భగీరథి, అలకానంద, మందాకిని వగైరాలపై ప్రతిపాదనలో ఉన్న, నిర్మాణంలో ఉన్న జల విద్యుదుత్పాదన ప్రాజెక్టుల్ని నిలిపేయడం... హరిద్వార్‌ ప్రాంతంలో ఇసుక మైనింగ్‌ కార్య కలాపాలను నిరోధించటం... గంగానది వ్యవహారాలను పర్యవేక్షించడానికి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఏర్పాటు–ఇవీ ఆయన కోర్కెలు. వీటిని సాధించుకోవడానికే ఆయన 2008 నుంచి పోరాడు తున్నారు. ఇప్పటికి అరడజనుసార్లు ఆమరణ దీక్షలు చేశారు. 2010లో ఆయన 34 రోజులపాటు నిరశన వ్రతం కొనసాగించారు.

నాటి కేంద్ర పర్యావరణమంత్రి జైరాం రమేష్‌ వచ్చి కొన్ని విద్యుదుత్పాదన ప్రాజెక్టుల్ని ఆపేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అదే ప్రభుత్వం 2013లో చాటుగా వాటికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మొన్న జూన్‌ 11న ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించింది మొదలు కొని మంగళవారం(9వ తేదీ) వరకూ ఆయన కేవలం రోజుకు మూడు గ్లాసుల మంచినీరు మాత్రమే తీసుకునేవారు. అనంతరం మంచినీటిని కూడా త్యజించారు. ఫలితంగా ఆయన ఆరోగ్యం క్షీణించి గుండెపోటుతో కన్నుమూశారు. స్వామి జ్ఞాన్‌స్వరూప్‌ దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించిన నాటినుంచి కేంద్రం ఆయనతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. గంగా పునరు జ్జీవన మంత్రిత్వశాఖను చూసిన ఉమాభారతి, ఆమె తర్వాత ఆ శాఖ బాధ్యతలు స్వీకరించిన నితిన్‌ గడ్కరీ కూడా ఆయనకు లేఖల ద్వారా ప్రభుత్వ వైఖరిని చెబుతూ వచ్చారు. గంగానది పరిరక్షణకు తీసుకోబోయే చర్యల గురించి వివరించారు. కానీ ఇవన్నీ పదేళ్లుగా వింటున్న మాటలుగానే ఆయ నకు అనిపించాయేమో... ప్రాయోపవేశానికే సిద్ధపడ్డారు! కేంద్రం గంగానది ప్రక్షాళనకు భారీగా నిధులు కేటాయించింది. రూ. 20,000 కోట్లు వ్యయం కాగల ‘నమామి గంగ’ ప్రాజెక్టుకు అంకురా ర్పణ చేసింది. కానీ ఏటా నిధుల కేటాయింపు, దాన్ని వ్యయం చేస్తున్న తీరు గమనిస్తే ఆ ప్రక్షాళన ఎప్పటికైనా పూర్తవుతుందా అన్న అనుమానం కలుగుతుంది.

 
ఒక విద్యావేత్త జీవనదిని కాపాడమని పదేళ్లుగా పోరుతూ చివరకు ప్రాణత్యాగానికి సిద్ధపడవలసి రావడం అత్యంత విషాదకరం. ఇది మన దేశంలో నెలకొన్న అమానుష స్థితికి అద్దం పడుతుంది. ఇందులో పాలకులను తప్పుబట్టి మాత్రమే ప్రయోజనం లేదు. మీడియా సైతం ఆయన దీక్షనూ, దాని ప్రాముఖ్యతనూ సరిగా గుర్తించలేకపోయింది. ఏడేళ్లనాడు స్వామి నిగమానంద దీక్ష సమయంలో చూపించిన నిర్లక్ష్యాన్నే ఇప్పుడూ కొనసాగించింది. స్వామి జ్ఞాన్‌స్వరూప్‌ దీక్ష గురించి ప్రజల్లో చైతన్యం కలిగి ప్రభుత్వంపై ఒత్తిళ్లు వచ్చివుంటే ఫలితం వేరుగా ఉండేదేమో! ఒక్క గంగానదిని మాత్రమే కాదు... దేశంలో ప్రతి నదినీ కాలుష్య కాసారాలుగా మారుస్తూ, వాటిని విచ్చలవిడిగా తవ్వుతూ లాభార్జనలో మునిగితేలుతున్నవారున్నారు. నదుల్ని దేవతలుగా కొలవడం మాత్రమే కాదు... వాటి పరిరక్షణతోనే మనందరి శ్రేయస్సు ముడిపడి ఉంటుందని గ్రహించాలి. అందుకు అనువైన చర్యలు తీసుకోవడం తక్షణావసరమని గుర్తించాలి. దివిజగంగగా, త్రిలోకాలనూ పావనం చేసిన తల్లిగా పురాణేతిహాసాల్లో గంగకు పేరుంది. కానీ వర్తమాన యుగంలో అది మౌనంగా రోదిస్తోంది. తనను కాపాడమని వేడుకుంటోంది. ఇప్పటికైనా వింటారా?! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement