Clown
-
శీతలమైన క్లౌన్స్లింగ్
నవ్వు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచి చేస్తుంది. ఒక్కసారి నవ్వగానే మనసులో ఉన్న బాధ అంతా పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ.. వివిధ భావోద్వేగాల మధ్య నలిగిపోతూ నవ్వునే మర్చిపోతాం. అలా నవ్వులని మర్చిపోయిన వారికి.. వారి బాధలని నవ్వుతో దూరం చేద్దాం అని భుజం తట్టి చెబుతోంది శీతల్ అగర్వాల్. ‘‘మనమంతా ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉండడంపైనే దృష్టిపెడతాం. కానీ మానసిక ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. అందుకే వివిధ రకాల సమస్యలు చుట్టుముట్టి మెదడును తొలిచేస్తుంటాయి. అందుకే నవ్వుతూ ఉండండి’’ అని చెప్పడమేగాక, ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల వద్దకు వెళ్లి వాళ్లను నవ్విస్తూ, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తోంది శీతల్. ఢిల్లీకి చెందిన శీతల్ అగర్వాల్...ఆంత్రోపాలజిస్ట్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2016లో ఒకసారి శీతల్ అహ్మదాబాద్ వెళ్లినప్పుడు అక్కడ ధారను కలిసింది. ధార తనని తాను శీతల్‌కు పరిచయం చేసుకుంటూ.. ‘‘నేను ఒక మెడికల్ క్లౌను’’ను అని చెప్పింది. చిన్నప్పటి నుంచి రకరకాల సర్కస్ విదూషకులు (క్లౌన్స్) చేసే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తూ పెరిగిన శీతల్‌కు మెడికల్ క్లౌన్ అనగానే విచిత్రంగా అనిపించింది. వెంటనే ‘‘అవునా! మెడికల్క్లౌన్ అంటే ఏంటీ?’’ అని అడిగింది..ఆసుపత్రులకు వెళ్లి రోగులను నవ్వించడమే’’ తన పని అని ధార చెప్పిన విషయం శీతలకు బాగా నచ్చింది. మెడికల్ క్లౌన్ గురించి మరింతగా అన్వేషించి అనేక విషయాలు తెలుసుకుంది. ఇందులో భాగంగానే ‘ప్యాచ్ అడమ్స్’ అనే అమెరికా కామెడీ సినిమా చూసింది. దీనిలో డాక్టర్ హాస్యం పండిస్తూ రోగులకు చికిత్స చేస్తుంటాడు. ఈ సినిమా ద్వారా మెడికల్ క్లౌన్ వల్ల ఎంతోమంది జీవితాల్లో ఆనందం నింపవచ్చని అర్థం చేసుకుని శీతల్ తను కూడా మెడికల్ క్లౌన్ కావాలనుకుంది. క్లౌన్స్‌లర్స్.. మెడికల్ క్లౌన్స్ కావాలనుకుని తన ఫేస్బుక్లో కొంతమంది మెడికల్ క్లౌన్స్ కావాలని పోస్టు చేసింది. శీతల్ పోస్టుకు 33 మంది స్పందించారు. దీంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మెడికల్ క్లౌన్స్గా పనిచేసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అనుమతి రాగానే కొన్ని హాస్పిటళ్లకు వెళ్లి అక్కడ రోగులకు తన వేషభాషల ద్వారా ఉల్లాసం కలిగించడం ప్రారంభించింది. జోకర్లా డ్రెస్, నెత్తిమీద టోపీ, ముక్కుకు, చెంపలకు రంగులు వేసుకుని చూడగానే నవ్వు వచ్చేలా మేకప్ వేసుకుని పిల్లల వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారు. వార్డులో ఉన్న పిల్లలంతా తమ బాధను మర్చిపోయి చక్కగా నవ్వారు. ఆ చిన్నారుల ముఖాల్లో విరిసిన నవ్వులు శీతల్‌కు చాలా తృప్తినిచ్చాయి. అంతేగాక వీళ్ల టీమ్ రోజూ ఆ వార్డుకు వెళ్లి రావడం వల్ల అక్కడున్న పిల్లలంతా చక్కగా తింటూ హాయిగా ఆడుకునేవారు. ఈ ప్రేరణతో ఢిల్లీలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా అనుమతి తీసుకుని, ఆయా ఆసుపత్రులను సందర్శించి అక్కడి రోగులను నవి్వంచి, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపేవారు. వీరివల్ల రోగుల్లో వస్తున్న సానుకూల మార్పులను చూసి సంతృప్తి పడ్డ ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలు వీరి టీమ్‌ను మళ్లీ మళ్లీ రావలసిందిగా కోరేవి. ఆ నోటా ఈ నోటా శీతల్ క్లౌన్స్‌లర్స్ గురించి తెలిసిన వారంతా తమ ఆసుపత్రులకు పిలిస్తే, కొంతమంది ఈ టీమ్‌లో స్వచ్ఛందంగా మెడికల్ క్లౌన్స్లర్గా చేరి సేవలందిస్తున్నారు. ఉద్యోగం వదిలేసి.. శీతల్ క్లౌన్స్‌లర్స్ టీమ్‌కు మంచి గుర్తింపు రావడంతో..ఐదేళ్ల తరువాత తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని మెడికల్ క్లౌన్స్కే కేటాయించింది. కోవిడ్ సమయంలోనూ..క్లౌన్స్ సేవలందించింది. మొదటి లాక్డౌన్ సమయంలో మైక్రో షెల్టర్స్‌ను సందర్శించడం, కొన్ని షెల్టర్లలో ఫేస్బుక్ ద్వారా లైవ్ ఈవెంట్స్‌ను అందిచారు. ఆన్లైన్ సెషన్స్‌కు స్పందన బావుండడంతో ఏడాదిన్నరపాటు అనేక ఆన్లైన్ సెషన్లను నిర్వహించారు. న్యూఢిల్లీతోపాటు మహారాష్ట్ర, హర్యాణ, మేఘాలయ, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా శీతల్ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం ఆసుపత్రులతోపాటు, అనాథ, వృద్ధాశ్రమాలు, మురికి వాడల్లో మెడికల్ క్లౌన్ సేవలు అందిస్తోంది. ఈ విషయం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అవ్వడంతో నెటిజన్లంతా శీతల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
ఫోబియా.. ఇదేం మాయ!
వస్తువు, జంతువు, సంఘటన.. ఇలా ఏదో ఒకదాన్ని తలచుకుని అదేపనిగా భయపడడాన్నే ఫోబియా అంటారు. సాధారణంగా ప్రతి వ్యక్తీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని తలచుకుని భయపడుతూనే ఉంటాడు. ఈ భయం మామూలు స్థితిలో ఉంటే పరవాలేదు. ‘అతి’గా పరిణమించిందనుకోండి.. అదే ఫోబియాగా మారుతుంది. వైద్య శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల ఫోబియాలున్నాయి. వాటిలో వింతగా అనిపించేవీ ఉన్నాయి. మీకోసం కొన్ని..! - సాక్షి, స్కూల్ ఎడిషన్ రంగు పడింది.. రంగులను చూసి భయపడటాన్ని ‘క్రోమాటోఫోబియా’ అంటారు. గతంలో ఆయా వ్యక్తులకు జరిగిన ఏదైనా సంఘటన దీనికి కారణంగా చెప్పవచ్చు. ఆ సమయంలో అత్యంత భయాన్ని కలిగించిన రంగులు వారి మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. తమను మానసికంగా బాధించిన ఆ వర్ణాలను చూడగానే వారిలో ఎక్కడిలేని భయం పుట్టుకొస్తుంది. దీంతో ప్రత్యేకంగా ఏదో ఒక రంగునో, రంగుల కలయికనో చూడగానే విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఈ ఫోబియా వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. కొందరు జీవితాంతం క్రోమాటోఫోబియాతోనే బాధపడతారు. మరికొందరు మాత్రం తాత్కాలికంగా, కొన్ని సందర్భాల్లోనే దీని బారిన పడతారు. రంగుల బట్టి ఫోబియాలు మారుతాయి. 1. ఎరుపు - ఫోడోఫోబియా, 2. నారింజ రంగు - క్రైసోఫోబియా, 3. పసుపు - జాంతోఫోబియా, 4. ఆకుపచ్చ - క్లోరోఫోబియా, 5. నీలి రంగు - సియానోఫోబియా, 6. పర్పుల్ - పార్ఫిరోఫోబియా, 7. తెలుపు - ల్యూకూఫోబియా, 8. నలుపు - మిలానోఫోబియా. విదూషకుడూ విలనే.. వారాంతాల్లో షాపింగ్ మాల్స్కో, సర్కస్కో వెళ్లారనుకోండి. అక్కడ మనల్ని నవ్వించేందుకు విచిత్రమైన గెటప్పుల్లో హాస్యగాళ్లు కనిపిస్తారు. వీరినే జోకర్లు, క్లౌన్లు అని పిలుస్తారు. ఈ జోకర్లను చూసి పెద్దలు బాగానే నవ్వుకుంటారు. సమస్యంతా చిన్నారులతోనే..! ముఖం నిండా రంగులు పూసుకుని నవ్వించడానికి దగ్గరకొచ్చే విదూషకులని చూడగానే బావురు మంటారు చిట్టి హీరోలు. ఇది పెద్ద విశేషమేమీ కాదు, మరి టీనేజీ దాటిన వాళ్లు, పెద్దలు సైతం జోకర్‌ను చూసి బెంబేలెత్తిపోతే.. అదే ‘కూల్రోఫోబియా’! ఇప్పటిదాకా ఎక్కువగా భయపెట్టిన క్లౌన్ల జాబితాలో ‘పెన్నీవైజ్’ తొలిస్థానంలో ఉంటుంది. 1990లో వచ్చిన ‘ఇట్’ సినిమాలో ఈ పాత్ర కనిపిస్తుంది. స్పై‘డర్’.. మన దేశంలో తక్కువ గానీ పాశ్చ్యాత్య దేశాల్లో సాలీడును చూస్తే చాలు ఆమడ దూరం పరుగెడతారు. ఎక్కడ మీద పడుతుందో అని ముడుచుకుపోతూ ఉంటారు. సాలీడంటే అంత భయం వారికి. దీన్నే ‘అరాక్నోఫోబియా’ అంటారు. ఇలా భయపడటంలోనూ కొంత హేతుకత ఉందనే చెప్పాలి. ఎందుకంటే సాలీళ్లలో చాలా వరకు విషపూరితం. వీటిలో కొన్ని ఏకంగా మనిషిని చంపెయ్యగలవు. కొన్ని విపరీతమైన బాధ, నొప్పిని కలిగిస్తాయి. విషపూరిత సాలీళ్లను మినహాయిస్తే మిగతా వాటివల్ల ప్రమాదమేమీ ఉండదు. షార్క్‌లు బాబోయ్.. షార్క్‌లను చూసి భయపడని వారెవరూ ఉండరు. మరీ ముఖ్యంగా 1975లో స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన ‘జాస్’ చిత్రం చూశాక ఈ భయం మరీ ఎక్కువైందని చెబుతారు. అద్భుతమైన విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తీసిన ఈ చిత్రం తొమ్మిదేళ్ల చిన్నారులను మరీ భయపెట్టిందట! బీచ్‌లకు వెళ్లాలన్నా, బోటింగ్ చెయ్యాలన్నా, చివరకు షార్క్ చిత్రాలు చూడాలన్నా ఇష్టపడేవారు కాదు. కొన్నాళ్లకు చాలా మంది షార్క్‌ల భయం నుంచి బయటపడ్డారు కానీ, కొందరు మాత్రం ఇప్పటికీ అలానే ఉండిపోతున్నారు. ఈ లక్షణాన్నే ‘గాలియోఫోబియా’ లేదా ‘సిలాచోఫోబియా’ అంటారు. ఎక్కడ గుచ్చుతారో.. సూది.. సాధారణంగా అందరినీ భయపెడుతుంది. సూదిమందు వేసుకోవడాన్ని ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పండి. ఈ అయిష్టతే కొందరిలో బాగా ముదిరి ఫోబియాగా మారుతుంది. దీన్నే ‘ట్రైపానోఫోబియా’ అంటారు. బిలోనీఫోబియా, ఎనెటోఫోబియా, ఐష్మోఫోబియా అనీ పిలుస్తారు. 1994లో అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ముద్రించిన ‘డిఎస్ఎమ్-4’లో తొలిసారిగా ఈ ఫోబియాను చేర్చారు. దీని బాధితులు సూది, పదునైన వస్తువులను చూడగానే గజగజా వణికిపోతారట! వామ్మో.. స్నానం! ఫోబియాలందు ఇది వేరయా అన్నట్లు ఉంటుంది ‘అబ్లుటోఫోబియా’. స్నానం, వాష్ చేసేందుకు భయపడటమే ఈ ఫోబియా లక్షణం. 1960లో వచ్చిన ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మూవీ ‘సైకో’ తర్వాతే ఈ విచిత్రమైన ఫోబియా బాధితులు ఎక్కువయ్యారని చెబుతారు. ఈ చిత్రంలోని టాయ్‌లెట్ సీన్లు అత్యంత భయాన్ని కలిగిస్తాయి. దీంతో బాత్రూంలో స్నానానికి వెళ్లగానే అదే దృశ్యాన్ని ఊహించుకొని, చాలామంది లేనిపోని భయాలకు గురయ్యారట..! అబ్లుటోఫోబియా ఎక్కువగా చిన్నారులు, మహిళల్లోనే కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వారు బలవంతంగానే స్నానానికి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర భయాందోళనలకు గురై అధిక గుండెపోటు, శ్వాస అందకపోవడం, వణికిపోవడం లాంటి విపరీత పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ‘నో’వాహియామి.. రెండేళ్ల బుజ్జిగాడు నిద్రపోకుండా మారాం చేస్తుంటే అమ్మ ఏం చెబుతుంది..? ‘అదిగో! బూచాడు వస్తున్నాడు. నిన్ను ఎత్తుకుపోతాడు. మారా చేయకుండా బజ్జో..’ అని ఏదో చెప్పి నిద్రపుచ్చుతుంది. చాలా మట్టుకు ఈ మాటలు బాగానే పనిచేస్తాయి. కొందరిలో మాత్రం ఇవే జీవితాంతం గుర్తుండిపోయి వేధిస్తూ ఉంటాయి. నిద్రకు ఉపక్రమించగానే బూచాడు వస్తున్నట్టు, ఎత్తుకపోతున్నట్టు ఊహించుకుంటూ భయపడిపోతారు. ఈ కారణంగా నిద్రంటేనే ముఖం చిట్లించుకునే స్థితికి చేరుకుంటారు. దీన్నే ‘సోమ్నిఫోబియా’ అంటారు. -
కామెడీ హీరోలు..!
పంచామృతం: విదూషకుడు బావిలో పడ్డట్టు.. అనేది నానుడి. తెరపై కమెడియన్లు పడే పాట్లు కూడా నవ్విస్తాయి. అందరినీ ఆనందంలో ముంచెత్తుతాయి. అయితే అలాంటి విదూషకులు నిజజీవితంలో పడే పాట్లు మాత్రం బాధను మిగులుస్తాయి. మనల్ని నవ్వించేది వాళ్లే ఏడిపించేదీ వాళ్లే. ఇటీవలే రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చాలా మందిని బాధపెట్టింది. రాబిన్ మాత్రమే కాదు.. హాలీవుడ్లో కమెడియన్లుగా పేరు పొందిన అనేక మంది మానసికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. అయితే వాళ్లు ధైర్యంగా నిలబడ్డారు.. హీరోల్లా నిలిచారు! చార్లీ చాప్లిన్ సెలైంట్ ఎరా సినిమా.. మాటల్లేని రోజుల్లో కూడా నవ్వించిందంటే అందుకు చార్లీ చాప్లిన్ హావభావాలే మూలం. బాధాకరంగా గడిచిన బాల్యం, ప్రేమ, వైవాహిక జీవితాల్లో పడ్డ ఇబ్బందులు.. ఇవన్నీ చాప్లిన్‌ను డిప్రెషన్లోకి తీసుకెళ్లాయి. ఆయనను కుంగుబాటు బాధితుడిగా మార్చాయి. అయితే చాప్లిన్ వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. జిమ్ క్యారీ హాస్యాన్ని అభినయించగల వాళ్లే అసలైన హీరోలు. హాలీవుడ్‌లోనైనా ఇది వర్తిస్తుంది. అందుకు జిమ్ క్యారీనే రుజువు. హాలీవుడ్‌లోని స్టార్లలో ఒకరిగా నిలదొక్కుకొన్న ఈ కెనడియన్ సంతతి వ్యక్తిని గతానుభవాలు ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయట. ఈయన కూడా డిప్రెషన్ బాధితుడే. సినిమాల్లో నిలదొక్కుకోక ముందు జిమ్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. అప్పుడు మొదలైన మానసిక ఒత్తిడి జిమ్‌పై ఇప్పటికీ కొనసాగుతోందని వైద్యులు చెబుతున్నారు. అయితే జిమ్ మాత్రం అలాంటి ఒత్తిడిని తేలికగా తీసుకొని ముందుకు సాగుతున్నాడు. బెన్ స్టిల్లర్ అమెరికా, కెనడాల్లో స్టార్ ఇమేజ్. డబ్బుకు కూడా లోటు లేదు. వారసులు కూడా సినిమా రంగంలోనే స్థిరపడ్డారు. అయితే జన్యుపరంగా, వారసత్వంగా వచ్చిన డిప్రెషన్ మాత్రం ఈ స్టార్ యాక్టర్‌ను ఇబ్బంది పెడుతోంది. సినిమాలతో బిజీ అయిపోవడమే అందుకు విరుగుడుగా భావిస్తున్నాడు ఈ నటుడు. ఒవెన్ విల్సన్ ఎనిమిదేళ్ల కిందటే ఈయన ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తూ బయటపడ్డాడు. ఒవెన్ విల్సన్ తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడనీ, ఆ ఒత్తిడే ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పిందనీ వైద్యులు పేర్కొన్నారు. తన రచనతో కూడా హాస్యాన్ని పండించిన ఈ విదూషకుడిపై అనేక సంఘటనలు ఒత్తిడి పెంచాయనీ, కుంగుబాటును కలిగించాయనీ తెలుస్తోంది. అయితే ఈయన క్రమంగా స్థిమితపడ్డాడు. ఆత్మహత్యాయత్నపు అనంతర జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో లీడ్ చేస్తున్నాడు. రస్సెల్ బ్రాండ్ బై పోలార్ డిజార్డర్ బాధితుడీయన. దాని ప్రభావంతో చాలా ఇబ్బందులే పడుతున్నాడు. ఒక దశలో డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తున్నప్పుడే అరెస్టయ్యాడు. అయితే తర్వాత పరివర్తన చెందాడు. కానీ ఇప్పటికీ కుంగుబాటు బాధితుడుగానే ఉన్నాడు. అయినా సినిమాల్లో, టీవీల్లో విదూషక పాత్రలో రాణిస్తున్నాడు.