ఫోబియా.. ఇదేం మాయ!
వస్తువు, జంతువు, సంఘటన.. ఇలా ఏదో ఒకదాన్ని తలచుకుని అదేపనిగా భయపడడాన్నే ఫోబియా అంటారు. సాధారణంగా ప్రతి వ్యక్తీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని తలచుకుని భయపడుతూనే ఉంటాడు. ఈ భయం మామూలు స్థితిలో ఉంటే పరవాలేదు. ‘అతి’గా పరిణమించిందనుకోండి.. అదే ఫోబియాగా మారుతుంది. వైద్య శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల ఫోబియాలున్నాయి. వాటిలో వింతగా అనిపించేవీ ఉన్నాయి. మీకోసం కొన్ని..!
- సాక్షి, స్కూల్ ఎడిషన్
రంగు పడింది..
రంగులను చూసి భయపడటాన్ని ‘క్రోమాటోఫోబియా’ అంటారు. గతంలో ఆయా వ్యక్తులకు జరిగిన ఏదైనా సంఘటన దీనికి కారణంగా చెప్పవచ్చు. ఆ సమయంలో అత్యంత భయాన్ని కలిగించిన రంగులు వారి మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. తమను మానసికంగా బాధించిన ఆ వర్ణాలను చూడగానే వారిలో ఎక్కడిలేని భయం పుట్టుకొస్తుంది. దీంతో ప్రత్యేకంగా ఏదో ఒక రంగునో, రంగుల కలయికనో చూడగానే విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఈ ఫోబియా వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. కొందరు జీవితాంతం క్రోమాటోఫోబియాతోనే బాధపడతారు. మరికొందరు మాత్రం తాత్కాలికంగా, కొన్ని సందర్భాల్లోనే దీని బారిన పడతారు.
రంగుల బట్టి ఫోబియాలు మారుతాయి.
1. ఎరుపు - ఫోడోఫోబియా, 2. నారింజ రంగు - క్రైసోఫోబియా, 3. పసుపు - జాంతోఫోబియా, 4. ఆకుపచ్చ - క్లోరోఫోబియా, 5. నీలి రంగు - సియానోఫోబియా, 6. పర్పుల్ - పార్ఫిరోఫోబియా, 7. తెలుపు - ల్యూకూఫోబియా, 8. నలుపు - మిలానోఫోబియా.
విదూషకుడూ విలనే..
వారాంతాల్లో షాపింగ్ మాల్స్‌కో, సర్కస్‌కో వెళ్లారనుకోండి. అక్కడ మనల్ని నవ్వించేందుకు విచిత్రమైన గెటప్పుల్లో హాస్యగాళ్లు కనిపిస్తారు. వీరినే జోకర్లు, క్లౌన్లు అని పిలుస్తారు. ఈ జోకర్లను చూసి పెద్దలు బాగానే నవ్వుకుంటారు. సమస్యంతా చిన్నారులతోనే..! ముఖం నిండా రంగులు పూసుకుని నవ్వించడానికి దగ్గరకొచ్చే విదూషకులని చూడగానే బావురు మంటారు చిట్టి హీరోలు. ఇది పెద్ద విశేషమేమీ కాదు, మరి టీనేజీ దాటిన వాళ్లు, పెద్దలు సైతం జోకర్‌ను చూసి బెంబేలెత్తిపోతే.. అదే ‘కూల్రోఫోబియా’! ఇప్పటిదాకా ఎక్కువగా భయపెట్టిన క్లౌన్ల జాబితాలో ‘పెన్నీవైజ్’ తొలిస్థానంలో ఉంటుంది. 1990లో వచ్చిన ‘ఇట్’ సినిమాలో ఈ పాత్ర కనిపిస్తుంది.
స్పై‘డర్’..
మన దేశంలో తక్కువ గానీ పాశ్చ్యాత్య దేశాల్లో సాలీడును చూస్తే చాలు ఆమడ దూరం పరుగెడతారు. ఎక్కడ మీద పడుతుందో అని ముడుచుకుపోతూ ఉంటారు. సాలీడంటే అంత భయం వారికి. దీన్నే ‘అరాక్నోఫోబియా’ అంటారు. ఇలా భయపడటంలోనూ కొంత హేతుకత ఉందనే చెప్పాలి. ఎందుకంటే సాలీళ్లలో చాలా వరకు విషపూరితం. వీటిలో కొన్ని ఏకంగా మనిషిని చంపెయ్యగలవు. కొన్ని విపరీతమైన బాధ, నొప్పిని కలిగిస్తాయి. విషపూరిత సాలీళ్లను మినహాయిస్తే మిగతా వాటివల్ల ప్రమాదమేమీ ఉండదు.
షార్క్‌లు బాబోయ్..
షార్క్‌లను చూసి భయపడని వారెవరూ ఉండరు. మరీ ముఖ్యంగా 1975లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన ‘జాస్’ చిత్రం చూశాక ఈ భయం మరీ ఎక్కువైందని చెబుతారు. అద్భుతమైన విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తీసిన ఈ చిత్రం తొమ్మిదేళ్ల చిన్నారులను మరీ భయపెట్టిందట! బీచ్‌లకు వెళ్లాలన్నా, బోటింగ్ చెయ్యాలన్నా, చివరకు షార్క్ చిత్రాలు చూడాలన్నా ఇష్టపడేవారు కాదు. కొన్నాళ్లకు చాలా మంది షార్క్‌ల భయం నుంచి బయటపడ్డారు కానీ, కొందరు మాత్రం ఇప్పటికీ అలానే ఉండిపోతున్నారు. ఈ లక్షణాన్నే ‘గాలియోఫోబియా’ లేదా ‘సిలాచోఫోబియా’ అంటారు.
ఎక్కడ గుచ్చుతారో..
సూది.. సాధారణంగా అందరినీ భయపెడుతుంది. సూదిమందు వేసుకోవడాన్ని ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పండి. ఈ అయిష్టతే కొందరిలో బాగా ముదిరి ఫోబియాగా మారుతుంది. దీన్నే ‘ట్రైపానోఫోబియా’ అంటారు. బిలోనీఫోబియా, ఎనెటోఫోబియా, ఐష్మోఫోబియా అనీ పిలుస్తారు. 1994లో అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ముద్రించిన ‘డిఎస్‌ఎమ్-4’లో తొలిసారిగా ఈ ఫోబియాను చేర్చారు. దీని బాధితులు సూది, పదునైన వస్తువులను చూడగానే గజగజా వణికిపోతారట!
వామ్మో.. స్నానం!
ఫోబియాలందు ఇది వేరయా అన్నట్లు ఉంటుంది ‘అబ్లుటోఫోబియా’. స్నానం, వాష్ చేసేందుకు భయపడటమే ఈ ఫోబియా లక్షణం. 1960లో వచ్చిన ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మూవీ ‘సైకో’ తర్వాతే ఈ విచిత్రమైన ఫోబియా బాధితులు ఎక్కువయ్యారని చెబుతారు. ఈ చిత్రంలోని టాయ్‌లెట్ సీన్లు అత్యంత భయాన్ని కలిగిస్తాయి. దీంతో బాత్‌రూంలో స్నానానికి వెళ్లగానే అదే దృశ్యాన్ని ఊహించుకొని, చాలామంది లేనిపోని భయాలకు గురయ్యారట..! అబ్లుటోఫోబియా ఎక్కువగా చిన్నారులు, మహిళల్లోనే కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వారు బలవంతంగానే స్నానానికి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర భయాందోళనలకు గురై అధిక గుండెపోటు, శ్వాస అందకపోవడం, వణికిపోవడం లాంటి విపరీత పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
‘నో’వాహియామి..
రెండేళ్ల బుజ్జిగాడు నిద్రపోకుండా మారాం చేస్తుంటే అమ్మ ఏం చెబుతుంది..? ‘అదిగో! బూచాడు వస్తున్నాడు. నిన్ను ఎత్తుకుపోతాడు. మారా చేయకుండా బజ్జో..’ అని ఏదో చెప్పి నిద్రపుచ్చుతుంది. చాలా మట్టుకు ఈ మాటలు బాగానే పనిచేస్తాయి. కొందరిలో మాత్రం ఇవే జీవితాంతం గుర్తుండిపోయి వేధిస్తూ ఉంటాయి. నిద్రకు ఉపక్రమించగానే బూచాడు వస్తున్నట్టు, ఎత్తుకపోతున్నట్టు ఊహించుకుంటూ భయపడిపోతారు. ఈ కారణంగా నిద్రంటేనే ముఖం చిట్లించుకునే స్థితికి చేరుకుంటారు. దీన్నే ‘సోమ్నిఫోబియా’ అంటారు.