ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మంగళం!
* పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం నిర్ణయం
* విధివిధానాలు రూపొందించాలని సీఎస్‌కు ఆదేశాలు
* మూడంచెల విధానాన్ని అనుసరించేలా చర్యలు
* చట్టపరంగా చేపట్టాల్సిన అంశాలను పరిశీలించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కొనసాగించాలని, అదనపు సమాం తర పదవులు మండల ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను రద్దు చేయనుంది.
ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సీఎస్ రాజీవ్‌శర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేసేందుకు చట్టప్రకారం అనుసరించాల్సిన చర్యలు పరిశీలించాలని, సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సూచించారు.
సమాంతర పదవులు..
స్థానిక సంస్థల పాలనలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వారికి నిర్దిష్ట అధికారాలు కూడా లేవు. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు సమాంతర స్థాయిలో ఉండగా.. గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు దాదాపు సమాన స్థాయిలో ఉన్నారు. దీంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను 42 శాతానికి పెంచినా.. అందులో చాలా వరకు నిధులను నేరుగా గ్రామాలకు కేటాయిస్తోంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఆర్థిక అంశాల్లో ప్రమేయం లేకుండా పోయింది. వారు కేవలం ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకే పరిమితమవుతున్నారనే అభిప్రాయం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తొలగించి జిల్లా, మండలం, గ్రామం యూనిట్లుగా మూడంచెల విధానాన్ని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పంచాయతీరాజ్ చట్టానికి అవసరమైన సవరణలు చేయాలని అధికారులకు సూచించారు. అనవసర రాజకీయ జోక్యం తగ్గేలా, పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
అలంకారప్రాయంగా పదవులు..
1987కు ముందున్న పంచాయతీ సమితులను అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో మండల ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చాక ఈ వ్యవస్థలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా మూడంచెల వ్యవస్థతో పాటు మండల ప్రాదేశిక, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు కొత్తగా వచ్చాయి.
1995లో తొలిసారిగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు ఎన్నికలు జరిగాయి. కానీ స్థానిక పాలనలో ఈ పదవులు అలంకార ప్రాయంగా మారడంతో దీనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కానీ 73వ రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్న అంశం కావటంతో... ఈ వ్యవస్థలో మార్పులు చేయటం సాధ్యమా, కాదా అనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే స్థానిక సంస్థలు రాష్ట్ర పరిధిలోని అంశం కావటంతో.. ప్రస్తుత చట్టానికి మార్పులు చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీలను తొలగించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.