ఊహల ఉగాది.. ఆశలు సమాధి
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ప్రకాశం జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తానని పదేపదే ఊదరగొట్టిన సీఎం ఎన్.చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమంపై తనకు ఏపాటి శ్రద్ధ ఉందో మరోమారు నిరూపించారు. గడిచిన ఐదేళ్లలో జిల్లా ప్రజలకు ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా.. అవన్నీ నెరవేర్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. తాగునీరు లేక పల్లెలు అల్లాడిపోతున్నాయి. ఉపాధి కరువై ప్రజలు కూలీలుగా ఇతర రాష్ట్రాలకు బాట పట్టారు. జిల్లా నుంచి వేలాది మంది పొట్టచేతపట్టుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలకు పొలోమంటూ వలస వెళ్తున్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడంలో, నూతన పరిశ్రమలను ప్రోత్సహించడంలో బాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. గడిచిన ఐదేళ్లలో సుమారు 4 వేల చిన్న పరిశ్రమలు మూతపడటమే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో 5.2 లక్షల మంది డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో నిలువునా మోసం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని సాక్షాత్తు మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో ప్రకటించినా, బయట మాత్రం మాఫీ చేసినట్టు, పసుపు కుంకుమ కింద ప్రత్యేకంగా నగదు ఇస్తున్నట్లు ఊదరగొడుతున్నారు. తొలివిడత పసుపు కుంకుమ నిధులు రూ.200 కోట్లు పెండింగ్‌లో పెట్టి అందరికీ నగదు ఇచ్చినట్టు కలరింగ్ ఇవ్వడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణాల మాఫీకి సంబంధించి జిల్లాలో రైతులకు ప్రభుత్వం అక్షరాలా రూ.8 వేల కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉన్నా.. రైతులను తానే ఆదుకున్నట్టు, అన్నదాత సుఖీభవ పేరున చిల్లర విదిల్చి మరీ ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లింది. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి హామీని పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్లు రాబట్టే వ్యూహంలో భాగంగా పథకం అమలు చేయడంపైనా విమర్శల వర్షం కురుస్తోంది.
అగ్రిగోల్డ్ బాధితులను పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారేగానీ పైసా విదల్చకపోవడంతో నాలుగేళ్లుగా నరకం చవిచూస్తున్నారు. డబ్బులొస్తాయా రావా అనే సందిగ్ధంలో జిల్లాకు చెందిన 28 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కూడా చంద్రబాబులో చలనం లేదు. ఇంటికో ఉద్యోగం రాలేదు. ఫీజురీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు చదువులకు ఆటంకం ఏర్పడింది. ఆరోగ్య శ్రీ, 108 పరిస్థితి దయనీయంగా మారింది.
హామీలన్నీ హంబక్..
దొనకొండలో పారిశ్రామిక నగరం, కనిగిరి నిమ్జ్, చీమకుర్తిలో మైనింగ్ యూనివర్శిటీ, గుడ్లూరులో వెటర్నరీ యూనివర్శిటీ, ఒంగోలులో ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టు, వెలుగొండ ప్రాజెక్టు మిగులు పనుల పూర్తి, సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు తాగు, సాగునీటి సమస్య, వెటర్నరీ యూనివర్సిటీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ, సుబాబుల్, జామాయిల్, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు, ఒంగోలు డెయిరీకి పూర్వ వైభవం, ఫ్లోరైడ్, కిడ్నీ రోగుల సమస్య, ఉద్యాన రైతులకు నష్ట పరిహారం, ఉలవపాడులో మామిడి మార్కెట్, పేదలందరికీ గృహ నిర్మాణాలు.. ఇలాంటివి లెక్కకు మిక్కిలిగా హామీలిచ్చిన చంద్రబాబునాయుడు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. హామీలిచ్చి గాలికొదిలేస్తే ప్రకాశం జిల్లా ప్రగతి పథంలో ఎలా నడుస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి అంటే.. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాలను సామాన్యులకు దూరం చేసి, ఇసుకను దోచేసి, నీరు–చెట్టు పనులు, ఉపాధి పనుల పేరుతో నిధులు దండుకోవడమేనా అని నిలదీస్తున్నారు.
ఈ చావులకు కారకులెవరు?
ఒకవైపు ఆరోగ్యశ్రీని అంపశయ్యపైకి చేర్చిన చంద్రబాబు.. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువచేసినట్టు గొప్పలు పోతున్నారు. కానీ జిల్లాలో వైద్య సేవలు, శిశు సంక్షేమానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి ఏమిటంటే.. వందలాది మంది శిశువులు నెలలు నిండక ముందు, అలాగే తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. ఇలా పుట్టిన శిశువులు గంటలు, రోజుల వ్యవధిలోనే కన్నుమూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపమేనని వైద్యులు పేర్కొన్నారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ ద్వారా గర్భిణులకు సక్రమంగా పోషకాహారం అందకపోవడంతో వారు రక్తహీనత బారిన పడ్డారు.
ఫలితంగా శిశువులు కుడా అవయవ లోపాలు, ముందుగానే పుట్టడం, బరువు తక్కువగా ఉండటం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. నెలలు నిండక ముందు, బరువు తక్కువతో పుట్టిన శిశువు లు గడిచిన నాలుగేళ్లలో 475 మంది మృత్యువాత పడ్డారు. 2015–16లో 184 మంది, 2016–17లో 149 మంది, 2017–18లో 123 మంది, 2018–19 సెప్టెంబర్ వరకు 39 మంది శిశువులు మరణించారు. గుండె జబ్బు, న్యుమోనియా, ఇతర కారణాలతో మృతి చెందిన వారి సంఖ్య 1400కు పైగా ఉంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువులే అధిక సంఖ్యలో మృతి చెందుతున్నట్లు వైద్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులేది..
కిడ్నీ బాధితులకు పింఛన్లేవి ?
రొయ్య రైతుల విద్యుత్ చార్జీల తగ్గింపెక్కడ...?
కంది, శనగ రైతులకు గిట్టుబాట ధరేది..?
నాలుగేళ్లుగా సాగర్ ఆయకట్టును ఎందుకు బీడు పెట్టించావు?
సాగర్‌లో 580 అడుగులకు నీళ్లొచ్చినా ఎందుకివ్వలేదు
పొగాకు రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చారా?
ఐదేళ్లవుతున్నా ట్రిపుల్ ఐటీ కట్టలేదెందుకు?
వెలిగొండ పనులు ఎందుకు ఆగిపోయాయి?
గుండ్లకమ్మ అరకొర పను పూర్తి చేయలేదెందుకు?
రాళ్లపాడు ఆధునీకరణ, రామాయపట్నం సంగతేమిటి?
దొనకొండలో పరిశ్రమలు, కనిగిరిలో నిమ్జ్ మాటేంటి?
విమానాశ్రయం ఎక్కడ నిర్మించారు?
మైనింగ్, వెటర్నరీ యూనివర్శిటీల నిర్మాణ ఏమైంది?
సహకార వ్యవస్థలను కుప్పకూల్చింది ఎవరు?
రుణం మాఫీ కాలేదు
నా పేరు మీద 1.79 ఎకరాల పొలం ఉంది. పెదారికట్ల ఎస్బీఐ బ్యాంక్‌లో పొలం పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి 1.20 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా. చంద్రబాబు రుణమాఫీ అని ప్రకటిస్తే నమ్మా కానీ రూపాయి కూడా మాఫీ కాలేదు. వ్యవసాయాధికారులను, అమరావతిలో అధికారులను కలిసినా, బ్యాంక్ చూట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన లేదు. ఒంగోలులో జరిగిన రుణమేళా కార్యక్రమంలో నా ఫైల్ కరెక్టుగా ఉందని చెప్పారు. కానీ ఇంత వరకు రూపాయి ఇవ్వలేదు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు.
– ఏలూరి అనిత, చిన్నారికట్ల, కొనకనమిట్ల మండలం
అడ్డగోలుగా దోచుకున్నారు
రైతులను నీరిస్తామని నట్టేట ముంచారు. మంత్రి శిద్దా రాఘవరావు సాగు నీరందించేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. దర్శి నియోజకవర్గంలో రైతులు కరువుతో అల్లాడుతున్నారు. దర్శి మండలాన్ని కరువు జాబితాలో ప్రకటించకపోవడం దారుణం. అరకొరగా పండిన కందులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులు, మంత్రి అనచరులు అడ్డగోలుగా దోచుకున్నారు. గ్రామాల్లో కందులు కొనేవారు లేక పుచ్చిపోతున్నాయి.
– మానికొండ వెంకయ్య చౌదరి, రైతు, పాతవెంకటాపురం
పోర్టు పేరుతో బాబు డ్రామా
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చంద్రబాబు ఆడిన డ్రామా. నాలుగున్నరేళ్లు ఏమీ పట్టించుకోకుండా ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని కేవలం శిలాఫలకం వేసి ప్రజలను మోసం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెబుతాం.
– షేక్ మున్వర్ బాషా
వెలిగొండ నీళ్లేవి బాబూ..
అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతోంది కానీ పనులు పూర్తి కావడం లేదు. 2018 సంక్రాంతి, అక్టోబర్, 2019 సంక్రాంతికి నీళ్లిస్తున్నట్లు సమీక్షలు పెట్టి మరీ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. చుక్క నీరు లేదు. బోర్లు ఎండిపోయాయి. తాగేందుకు చుక్కనీరు దొరకడం లేదు. పొలాలన్నీ బీళ్లుగా మారాయి.
– గొంగటి రామిరెడ్డి, జేబీకే పురం(బేస్తవారిపేట)