సీమాన్ నీ ప్రాంతం ఏది!
అఖిల భారత తెలుగు సమాఖ్య సూటి ప్రశ్న
దేశద్రోహిగా మిగిలిపోతావ్ : సీఎంకే రెడ్డి హెచ్చరిక
అధిక ప్రసంగం మానుకో : సీమాన్కు తెలుగు ప్రముఖుల సూచన
కొరుక్కుపేట: మలయాళీ అయిన సీమాన్ సినీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమిళజాతికి తానేదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారని, తమిళులకు, తమిళభాషకు ఆయన చేసింది ఏమీలేదని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీ.ఎం.కే.రెడ్డి ఎద్దేవా చేశారు. తమిళనాట తెలుగు, తమిళులు సోదరభావంతో మెలుగుతుండగా విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా సీమాన్ తేనిలో వ్యవహరించిన తీరు పూర్తిగా ఖండించదగినదని అన్నారు.
ఇటీవల తేనిలో మామన్నార్ తిరుమలై నాయకర్ను నామ్ తమిళర్ కచ్చి నాయకులు సీమాన్ అసభ్యకరంగా దూషించడాన్ని ఖండిస్తూ సోమవారం అఖిల భారత తెలుగు సమాఖ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సీఎంకే.రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా తెలుగు, తమిళులు కలసిపోయామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తెలుగు నాయకులు ఎనలేని సేవ చేశారని గుర్తుచేశారు. పలువురు ముఖ్యమంత్రులతో పాటు కృష్ణదేవరాయులు, వీరపాండి కట్టబొమ్మన్ , ఒండి వీరన్, చెన్నై తొలి మేయర్ సర్ పిట్టీ త్యాగరాయ శెట్టి ఇలా ఎందరో తెలుగువారు సేవలు అందించారని గుర్తు చేశారు.
తేని జిల్లా అభివృద్ధిలో తిరుమలై నాయకర్ సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమని తెలిపారు. ఇలాంటి వారిపై గూండాచట్టం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత గల రాజకీయ నేతగా వ్యవహరించాల్సిందిపోయి తెలుగు తమిళుల మధ్య చిచ్చుపెట్టేలా సీమాన్ మాట్లాడడం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అఖిల భారత తెలుగు సమాఖ్య తరపున హెచ్చరించారు.
సీమాన్ వ్యవహార శైలిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆయనపై కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీమాన్ నీ ప్రాంతం ఏదని సీఎంకే రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలు విషయంలో నోటి దురుసును ప్రదర్శించారని, దీన్ని తీవ్రంగా ఖండించడంతో వెనక్కి తగ్గారని, మళ్లీ అదే దూకుడుతో ప్రస్తుతం వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్స్ చిరంజీవి, గొల్లపల్లి ఇశ్రాయేలు, ప్రధాన కార్యదర్శి ఆర్.నందగోపాల్, ట్రెజరర్ శంకరన్, యూత్ వింగ్ ప్రెసిడెంట్ సురేష్, లీగల్ వింగ్ సెక్రటరీ ఆనంద్, హెడ్ క్వార్టర్స్ సెక్రటరీ అళగువేల్, స్టేట్ సెక్రటరీ కరుణానిధి పాల్గొన్నారు.