కోచ్ మిడ్-లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్‌కు రూ.12 కోట్లు
భూసేకరణ కోసం నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాకు గత రైల్వే బడ్జెట్లో మంజూరైన కోచ్ మిడ్-లైఫ్ రిహాబిలి టేషన్ వర్క్‌షాప్ ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక ప్రారంభమైంది. కర్నూలు - మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో దీన్ని నిర్మించాల్సి ఉన్నందున ఈ రెండు జిల్లాల పరిధిలో భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.12 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనపరమైన అనుమతులతో ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇందులో కర్నూలు జిల్లా పరిధిలో 123.89 ఎకరాలకు రూ.10 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 20 ఎకరాలకు రూ.2 కోట్లు కేటాయించారు.
ఈ నిధులతో రెండు జిల్లాల కలెక్టర్లు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే ఈ వర్క్‌షాప్‌ను రైల్వే శాఖ ప్రకటించి ఏడాది దాటినా.. ఇప్పటివరకూ ఎలాంటి కసరత్తు మొదలు కాలేదు. దీంతో ఈ వర్క్‌షాప్ నిర్మాణం ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలూ కనిపించటం లేదు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.110 కోట్లు అవసరం కాగా.. నిధులు లేక కేంద్రం చేతులెత్తేసింది. బడ్జెట్ గడువు తీరేలోపు కనీసం భూసేకరణ కసరత్తయినా ప్రారంభం కాకపోతే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఒత్తిడి తేవడంతో భూసేకరణకు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.