coach position
-
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా
ఇస్లామాబాద్: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. హెడ్ కోచ్ మిస్సా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. పాక్ ప్రపంచకప్ జట్టును ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేయడం పాక్ క్రికెట్లో పెను దుమారం రేపుతోంది. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలు కోవిడ్ ప్రోటోకాల్స్‌ను, ఆరోగ్య సమస్యలను బూచిగా చూపించి తప్పుకోవడం విశేషం. త్వరలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌లకు వీరి స్థానాల్లో తాత్కాలిక కోచ్‌లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను నియమించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో 15 మంది సభ్యుల పాక్ బృందాన్ని పీసీబీ ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలు రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. కాగా, ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ల సమరం అక్టోబర్ 24న జరగనున్న సంగతి తెలిసిందే. పాక్ టీ20 ప్రపంచకప్ జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..? -
కోచ్ పదవికి దరఖాస్తు చేస్తా: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో మాజీ కెప్టెన్ రవిశాస్త్రి కూడా చేరనున్నారు. ‘కొత్త కోచ్ కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే నన్ను కచ్చితంగా ఎంపిక చేస్తేనే రేసులో ఉంటానని వచ్చిన కథనాలు అబద్ధం’ అని రవిశాస్త్రి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జూలై 9 వరకు దరఖాస్తుల గడువును బీసీసీఐ ఇటీవల పొడిగించింది. గతంలో రవిశాస్త్రికి 2014 ఆగస్టు నుంచి 2016 జూన్ వరకు టీమ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. క్రితంసారి కూడా ఆయన కోచ్ రేసులో ఉన్నప్పటికీ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కుంబ్లే వైపు మొగ్గు చూపింది. శాస్త్రి పదవీకాలంలో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్, టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. ఈ కాలంలో జట్టు ఆటగాళ్లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అటు కెప్టెన్ కోహ్లి కూడా రవిశాస్త్రి వైపే మొగ్గుచూపుతుండటం కలిసివచ్చే అంశం. ఒకవేళ శాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేస్తే వచ్చే వరల్డ్‌కప్ (2019) వరకు ఆయనను కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే సహాయక సిబ్బందిని కూడా అతనే ఎంపిక చేసుకునే అవకాశాలున్నాయి. కెప్టెన్ కోహ్లితో నెలకొన్న విభేదాల కారణంగా అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో కోచ్ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ రేసులో ఇప్పటికే సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్ ఉన్నారు. అయితే సీఏసీ సభ్యుడు గంగూలీతో శాస్త్రికి అంత సఖ్యత లేదు. గతేడాది స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో గంగూలీ అక్కడ లేకపోవడాన్ని శాస్త్రి తప్పుపట్టారు. అయితే ఆయనకు నిజంగానే ఆసక్తి ఉంటే స్వయంగా హాజరయ్యేవాడని గంగూలీ అప్పట్లో దెప్పిపొడిచారు.