కోచ్‌ పదవికి దరఖాస్తు చేస్తా: రవిశాస్త్రి | Ravi Shastri to apply for India's head coach position | Sakshi
Sakshi News home page

కోచ్‌ పదవికి దరఖాస్తు చేస్తా: రవిశాస్త్రి

Published Tue, Jun 27 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

కోచ్‌ పదవికి దరఖాస్తు చేస్తా: రవిశాస్త్రి

కోచ్‌ పదవికి దరఖాస్తు చేస్తా: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రేసులో మాజీ కెప్టెన్‌ రవిశాస్త్రి కూడా చేరనున్నారు. ‘కొత్త కోచ్‌ కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే నన్ను కచ్చితంగా ఎంపిక చేస్తేనే రేసులో ఉంటానని వచ్చిన కథనాలు అబద్ధం’ అని రవిశాస్త్రి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జూలై 9 వరకు దరఖాస్తుల గడువును బీసీసీఐ ఇటీవల పొడిగించింది.

గతంలో రవిశాస్త్రికి 2014 ఆగస్టు నుంచి 2016 జూన్‌ వరకు టీమ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. క్రితంసారి కూడా ఆయన కోచ్‌ రేసులో ఉన్నప్పటికీ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) కుంబ్లే వైపు మొగ్గు చూపింది. శాస్త్రి పదవీకాలంలో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్, టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. ఈ కాలంలో జట్టు ఆటగాళ్లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అటు కెప్టెన్‌ కోహ్లి కూడా రవిశాస్త్రి వైపే మొగ్గుచూపుతుండటం కలిసివచ్చే అంశం. ఒకవేళ శాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేస్తే వచ్చే వరల్డ్‌కప్‌ (2019) వరకు ఆయనను కొనసాగించాల్సి ఉంటుంది.

అలాగే సహాయక సిబ్బందిని కూడా అతనే ఎంపిక చేసుకునే అవకాశాలున్నాయి. కెప్టెన్‌ కోహ్లితో నెలకొన్న విభేదాల కారణంగా అనిల్‌ కుంబ్లే రాజీనామా చేయడంతో కోచ్‌ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ రేసులో ఇప్పటికే సెహ్వాగ్, టామ్‌ మూడీ, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఉన్నారు. అయితే సీఏసీ సభ్యుడు గంగూలీతో శాస్త్రికి అంత సఖ్యత లేదు. గతేడాది స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో గంగూలీ అక్కడ లేకపోవడాన్ని శాస్త్రి తప్పుపట్టారు. అయితే ఆయనకు నిజంగానే ఆసక్తి ఉంటే స్వయంగా హాజరయ్యేవాడని గంగూలీ అప్పట్లో దెప్పిపొడిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement