రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం | Lifetime Achievement Award to Ravi Shastri | Sakshi
Sakshi News home page

రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం

Published Wed, Jan 24 2024 4:20 AM | Last Updated on Wed, Jan 24 2024 7:51 AM

Lifetime Achievement Award to Ravi Shastri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కెప్టెన్ , మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. 1983లో భారత్‌ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్‌ విజేత సభ్యుడైన రవిశాస్త్రి అంతర్జాతీయ కెరీర్‌ అనంతరం టీవీ వ్యాఖ్యతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు. తదనంతరం భారత పురుషుల టీమ్‌ డైరెక్టర్‌గా, హెడ్‌ కోచ్‌గా విజయవంతమయ్యారు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో జట్టును మరో దశకు తీసుకెళ్లారు.

ఓ ఆటగాడిగా, కోచ్‌గా రవిశాస్త్రి దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన బీసీసీఐ 2019–20 సీజన్‌కుగాను ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ (జీవిత సాఫల్య) అవార్డుతో సత్కరించింది. ఆయనతో పాటు ఫరూఖ్‌ ఇంజినీర్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే ‘పాలీ ఉమ్రీగర్‌ బెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుల్ని 2019–20 సీజన్‌కుగాను షమీ, అశి్వన్‌ (2020–21), జస్‌ప్రీత్‌ బుమ్రా (2021–22), శుబ్‌మన్‌ గిల్‌ (2022–23) అందుకున్నారు.  

మహిళల కేటగిరీలో బెస్ట్‌ క్రికెటర్‌ అవార్డుల్ని దీప్తి శర్మ (2019–20, 2022–23), స్మృతి మంధాన (2020–21, 2021–22) గెలుచుకున్నారు. ఓపెనింగ్‌లో చిచ్చర పిడుగల్లే రాణిస్తున్న యశస్వి జైస్వాల్‌ 2022–23 సీజన్‌కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు చేజిక్కించుకున్నాడు. ఈ విభాగంలో మయాంక్‌ అగర్వాల్‌ (2019, 20), అక్షర్‌ పటేల్‌ (2020–21), శ్రేయస్‌ అయ్యర్‌ (2021–22)లకు అవార్దులు దక్కాయి.

కరోనా మహమ్మారి వల్ల 2019–20, 2020–21, 2021–22, 2022–23 సీజన్లలో బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం చేయలేకపోయారు. దీంతో మంగళవారం ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించిన వేడుకలో నాలుగు సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళల, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement