![How Long He Sitting In NCA: Ex India Coach On Absence of Shami Ahead Ind vs Eng](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/7/shami.jpg.webp?itok=IMco_AuP)
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం ఎప్పుడు? ఇప్పటికే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు దూరమైన ఈ సీనియర్ బౌలర్.. కనీసం ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు అయినా అందుబాటులోకి వస్తాడా?.. ఇంతకీ షమీకి ఏమైంది? అతడి గాయం తీవ్రత ఎలా ఉంది?.. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తప్ప జాతీయ జట్టుతో చేరేందుకు అతడు సిద్ధంగా లేడా?..
భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవి. అసలు షమీ ఫిట్‌నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గానీ.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) గానీ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నిస్తున్నాడు. తానే గనుక బీసీసీఐ నాయకత్వంలో ఉంటే గనుక షమీని కచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటనకు పంపించేవాడినని పేర్కొన్నాడు.
అదే ఆఖరు
కాగా వన్డే ప్రపంచకప్-2023(ODI World Cup 2023) సందర్భంగా మహ్మద్ షమీ చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. చీలమండ నొప్పి వేధిస్తున్నా బంతితో మైదానంలో దిగి.. ప్రత్యర్థులకు వణుకుపుట్టించాడు. అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
దేశీ టీ20 టోర్నీతో రీ ఎంట్రీ
అయితే, దురదృష్టవశాత్తూ టైటిల్ పోరులో రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ మెగా ఈవెంట ముగిసిన తర్వాత షమీ చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని ఎన్‌సీఏలో పునరావాసం పొందాడు. దాదాపు ఏడాది తర్వాత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు.
ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన షమీ.. పదకొండు వికెట్లు తీసి సత్తా చాటాడు. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో ఓవరాల్‌గా 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే ఆసీస్‌తో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ మొదలుపెట్టగా.. కనీసం మూడో టెస్టు నుంచైనా షమీ జట్టుతో చేరతాడనే వార్తలు వచ్చాయి.
కొన్నాళ్లు విరామం
కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం షమీ గాయంపై స్పష్టత లేదని.. అతడి ఫిట్‌నెస్ గురించి తమకు పూర్తి సమచారం లేదని పేర్కొన్నాడు. దీంతో షమీ ఆసీస్ టూర్ అటకెక్కింది.
ఈ క్రమంలో కొన్నాళ్లు విరామం తీసుకున్న షమీ.. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఈ బెంగాల్ ఆటగాడు బ్యాట్ ఝులిపించడం విశేషం. 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మహ్మద్ సిరాజ్‌తో పాటు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ పెద్దగా రాణించకపోవడంతో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడింది. ఇక ఈ సిరీస్‌ను టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇంకెన్నాళ్లు ఇలా?
ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘అసలు అతడు ఎక్కడ ఉన్నాడు? పూర్తి స్థాయిలో కోలుకునేది ఎప్పుడు? అతడిని ఇంకెన్నాళ్లు ఎన్‌సీఏలో కూర్చోబెడతారు? అతడి ఫిట్‌నెస్ గురించి, ప్రస్తుతం అతడి పరిస్థితి గురించి బీసీసీఐ గానీ, ఎన్‌సీఏ గానీ ఎందుకు సరైన సమాచారం ఇవ్వలేకపోతోంది. నిజానికి అతడికి ఉన్న నైపుణ్యాల దృష్ట్యా.. నేనైతే అతడు పూర్తి ఫిట్‌గా లేకున్నా ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లేవాడిని’’ అని షమీ గురించి ప్రస్తావించాడు.
అతడిని ఆస్ట్రేలియా టూర్‌కి పంపాల్సింది!
ఇందుకు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ బదులిస్తూ.. ‘‘షమీ పూర్తి ఫిట్‌గా లేకపోయినా.. కనీసం నాలుగైదు ఓవర్లు అయినా బౌల్ చేసేవాడు. బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉండేవాడు. నిజంగా అతడు గనుక టీమిండియాతో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
Comments
Please login to add a commentAdd a comment