coaching camp
-
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపు ప్రారంభం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైందని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. అండర్–14, 17 బాలికల రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు అనంత క్రీడా మైదానంలో క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపు ఈనెల 17 వరకు సాగుతుందన్నారు. ఖేలో ఇండియా పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. క్యాంపునకు కోచ్‌లుగా రఘు (గుంటూరు), రాజు(కర్నూలు) వ్యవహరిస్తారు. కోచింగ్ అనంతరం ఇరు జట్లు చెన్నైలో జరిగే జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటాయి. అండర్–14, 17 బాలుర కోచింగ్ క్యాంపు విశాఖపట్టణంలో జరుగుతుందని ఆయన తెలిపారు. -
ఓక్రిడ్జ్‌లో ‘ఆర్సెనల్’ శిక్షణా శిబిరం ప్రారంభం
రాయదుర్గం, న్యూస్‌లైన్: ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ సాకర్ క్లబ్ ఆర్సెనల్కు చెందిన కోచ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో కోచింగ్ క్యాంప్ గురువారం ప్రారంభమైంది. ఈ క్యాంప్‌ను ఓక్రిడ్జ్ పాఠశాల ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్ సేన్ బజాజ్ ప్రారంభించారు. రోజుకు మూడు విడతల్లో ఈ క్యాంప్‌ను నిర్వహిస్తారు. ఈనెల 6వ తేదీ వరకు ఆరేళ్ళ నుంచి 15 ఏళ్ళలోపు విద్యార్థులకు ఈ క్యాంప్ కొనసాగుతుంది. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు సాగే మొదటి బ్యాచ్‌లో 14 మంది, 9 నుంచి 10.30 గంటల వరకు సాగే బ్యాచ్ 34 మంది, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు సాగే బ్యాచ్‌లో 34 మందికి ఆర్సెనల్ కోచ్ జువాన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంప్‌లో ఓక్రిడ్జ్ ఖాజాగూడతోపాటు బాచుపల్లి క్యాంపస్ విద్యార్థులు, నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆజ్మీర్‌కు చెందిన విద్యార్థులు పాల్గొంటు న్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్‌సేన్ బజాజ్ మాట్లాడుతూ ఫుట్‌బాల్‌లో రాణించే విద్యార్థులకు మరిన్ని మెళకువలను నేర్పించాలని భావించే ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. చిన్నతనంలోనే ఫుట్‌బాల్‌లో రాణిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని భావించి అత్యధిక ప్రాధాన్యత పొందిన అర్సెనల్ కోచ్‌లతో శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
ఉత్సాహంగా...ఉల్లాసంగా..!
సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్ఎంటీఏ) తొలిసారి అగ్రశ్రేణి ఆటగాళ్ల శిక్షణకు వేదికగా మారింది. నగర శివార్లలోని మొయినాబాద్‌లో గల ఈ అకాడమీలో భారత పురుషుల జట్టు సభ్యులకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. ప్రస్తుతం వర్ధమాన ఆటగాళ్లకు శిక్షణా కేంద్రంగానే ఉన్న అకాడమీ భవిష్యత్తులో మరిన్ని కీలక ఈవెంట్లకు ప్రధాన వేదిక అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ (ఐటీపీఏ) తాజాగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. భారత సింగిల్స్ టాప్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొపన్న, యువ క్రీడాకారులు పురవ్ రాజా, సాకేత్ మైనేని, శ్రీరామ్ బాలాజీ, సనమ్ సింగ్ తదితరులు ఇందులో పాల్గొంటున్నారు. రెండు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. ఆటగాళ్ల వ్యక్తిగత కోచ్‌లు ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తుండగా...సానియా మీర్జా అకాడమీ స్పెషల్ ట్రైనర్ రాబర్ట్ బలార్డ్ భారత ఆటగాళ్లకు కూడా ప్రత్యేకంగా సహకరించనున్నారు. కొత్త సీజన్లో జరిగే తొలి టోర్నీ చెన్నై ఓపెన్‌కు ముందు ఈ సన్నాహకాలు ఉపయోగపడతాయని ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై ఓపెన్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌కు కూడా సోమ్‌దేవ్, బొపన్న సిద్ధమవుతున్నారు. మరో వైపు సానియా మీర్జా డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) కూడా ఇక్కడే సాధన చేస్తోంది. వచ్చే ఏడాది అంతా బ్లాక్‌తోనే కలిసి బరిలోకి దిగనున్నట్లు సానియా ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 15నుంచి ఎస్ఎంటీఏలో భారత ఫెడరేషన్ కప్ జట్టుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని కూడా నిర్వహించనుంది.